RBI Monetary Policy: దేశంలో బ్యాంక్‌ వడ్డీ రేట్లకు, స్టాక్‌ మార్కెట్లకు దిశానిర్దేశం చేసే కీలకమైన ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం ఈ రోజు (04 అక్టోబర్‌ 2023) ప్రారంభమైంది, 06వ తేదీన (శుక్రవారం) ముగుస్తుంది. 
ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ, రెపో రేట్‌ సహా వివిధ ఆర్థికాంశాలపై చర్చలు జరుపుతోంది. సమావేశం ఫలితాలు శుక్రవారం ఉదయం 10 గంటల తర్వాత వెల్లడవుతాయి. 


అమెరికన్‌ బ్యాంకింగ్‌ వ్యవస్థలో 'సాఫ్ట్-ల్యాండింగ్' ఉంటుందన్న ఆశలు సన్నగిల్లాయి. యూరప్, చైనాలోనూ వృద్ధి పరమైన ఆందోళనలు ఎక్కువగానే ఉన్నాయి. మన దేశం విషయానికి వస్తే, పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం సహా కొన్ని సవాళ్లు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో RBI MPC భేటీ జరుగుతోంది. US ఫెడరల్ రిజర్వ్, గత భేటీలో కీలక రేట్లను మార్చలేదు. ఇప్పుడు RBI కూడా బాటలో నడుస్తుందని, రేట్లను తగ్గించే అవకాశం లేదని మార్కెట్‌ పండితులు విశ్వసిస్తున్నారు. ఇదే జరిగితే, RBI రెపో రేటు వరుసగా నాలుగోసారి కూడా 6.50% వద్దే స్థిరంగా కొనసాగుతుంది. 


దేశీయ సవాళ్లు
దేశంలో పెరుగుతున్న ఆహార ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్ల వల్ల వినియోగ డిమాండ్ తగ్గింది. అసమాన రుతుపవనాలు ఖరీఫ్ పంటలను దెబ్బకొట్టాయి. పెరుగుతున్న ముడి చమురు ధరలు కూడా భారత ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయి.


ఈ ఏడాది ఆగస్టులో కన్జ్యూమర్‌ కాన్ఫిడెన్స్‌ 1.5% తగ్గింది. FMCG కంపెనీల లాభదాయకత పెరిగినా అమ్మకాలు అధ్వాన్నంగా ఉన్నాయి. డిమాండ్‌లో డౌన్‌సైడ్‌ రిస్క్‌ను ఇది సూచిస్తోంది. పండుగ సీజన్ వల్ల డిమాండ్‌ పెరుగుతుందని అంచనా వేస్తున్నా, ఇప్పటికీ డిమాండ్‌కు హెడ్‌విండ్స్‌ ఎక్కువగానే ఉన్నాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగ డిమాండ్‌ను ప్రభావితం చేసే ఎదురుగాలులు ఎక్కువవుతున్నాయి. ఇలాంటి రిస్క్‌లను RBI పరిగణనలోకి తీసుకుంటుంది.


అంతర్జాతీయ సవాళ్లు
ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అమెరికాలో ఆర్థిక డేటా స్ట్రాంగ్‌గా ఉండడంతో, ఆ దేశ సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌, తన తదుపరి భేటీలో కీలక రేట్లను పెంచుతుందని, దీర్ఘకాలం కొనసాగిస్తుందని భావిస్తున్నారు. దీంతో, యూఎస్‌ డాలర్‌ బలపడింది, బాండ్‌ ఈల్డ్స్‌ 16 సంవత్సరాల గరిష్టంలో ఉన్నాయి. వీటి ఎఫెక్ట్‌తో స్టాక్‌ మార్కెట్లు, బంగారం కుదేలయ్యాయి. ప్రపంచంలో రెండో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనాలో పరిస్థితి ఏమీ బాగాలేదు. వృద్ధి రేటు పడిపోకుండా నిలబెట్టుకోవడానికి డ్రాగన్‌ కంట్రీ ఆపసోపాలు పడుతోంది. యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థలు కూడా అంతంతమాత్రంగానే బండి లాక్కొస్తున్నాయి. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ (ECB) కూడా అధిక వడ్డీ రేట్లను ఎక్కువ కాలం కొనసాగిస్తుందని భావిస్తున్నారు. 


ముడి చమురు ధరలు
ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మండిపోతున్నాయి. గత వారం, బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడ్‌ 95 డాలర్లకు చేరుకుంది, ఇప్పుడు కాస్త శాంతించి 90 డాలర్ల వద్ద ఉంది. ప్రస్తుత సంవత్సరంలో చమురు ధరలు బ్యారెల్‌కు $90 నుంచి $100 మధ్య ఉండవచ్చన్న అంచనాలున్నాయి. పెరుగుతున్న చమురు ధరల వల్ల భారత్‌ వంటి దేశాల దిగుమతి బిల్లులు పెరుగుతాయి. ఇది ఆర్థిక వ్యవస్థపైన, ద్రవ్యోల్బణంపైనా ఒత్తిడి పెంచుతుంది. ప్రస్తుతం భారతదేశ కరెంట్ ఖాతా లోటును (CAD) GDPలో 1.8%గా అంచనా వేశారు, గత అంచనా 1.6% కంటే ఇది ఎక్కువ. కాబట్టి, RBI ఈ విషయాలను తప్పకుండా పరిగణనలోకి తీసుకుంటుంది. 


ఫారిన్‌ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు దేశం నుంచి బయటకు వెళ్లడం వల్ల భారత రూపాయి విలువ ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతోంది. సెప్టెంబర్‌లో సుమారు 0.5% క్షీణించింది. గత ఆరు నెలలుగా నెట్‌ బయ్యర్స్‌గా ఉన్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు), సెప్టెంబర్ నెలలో ట్రెండ్‌ మార్చారు, భారతీయ మార్కెట్ నుంచి $1.7 బిలియన్లను విత్‌డ్రా చేశారు. గత వారంలో విదేశీ మారక నిల్వలు దాదాపు నాలుగు నెలల కనిష్టానికి, 593 బిలియన్ డాలర్లకు పడిపోయాయి.


'వెయిట్ అండ్ వాచ్' 
ప్రస్తుతం కొన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ, అక్టోబర్ పాలసీ మీటింగ్‌లో ఆర్‌బీఐ కాస్త సానుకూలంగా వ్యవహరించవచ్చు. పండుగ సీజన్‌లో డిమాండ్‌ పెరుగుతోంది కాబట్టి, మరింత స్పష్టమైన పిక్చర్‌ కోసం 'వెయిట్ అండ్ వాచ్' విధానాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ అవలంబిస్తుందని అంచనా వేస్తున్నారు.


ఆగస్టులో CPI ద్రవ్యోల్బణం RBI టాలరెన్స్‌ అప్పర్‌ బ్యాండ్‌ (6%) కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, జులైలోని గరిష్ట స్థాయి 7.4% నుంచి 6.8% కు చల్లబడింది.


ప్రస్తుతం, RBI రెపో రేటు 6.50% వద్ద ఉంది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (SDF) రేటు 6.25% వద్దే మారకుండా ఉంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (MSF) రేటు, బ్యాంక్ రేటు 6.75% వద్ద ఉన్నాయి. FY24 కోసం CPI ద్రవ్యోల్బణం 5.4%గా ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ అంచనా వేయవచ్చు. 


మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial