కీలక వడ్డీ రేట్లలో భారతీయ రిజర్వు బ్యాంకు వరుసగా పదోసారీ ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 4 శాతంగానే ఉంచారు. 3.35 శాతంగా ఉన్న రివర్స్ రెపో రేటునూ సవరించలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆర్‌బీఐ చివరి సారిగా 2020, మే 22న విధాన రెపో రేట్లు లేదా స్వల్ప కాల వ్యవధి వడ్డీరేట్లను పెంచింది. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత జరిగిన మొదటి ద్రవ్య పరపతి సమీక్ష ఇదే కావడం గమనార్హం. ఇక 2022-23 ఆర్థిక ఏడాదికి వాస్తవ జీడీపీ వృద్ధిరేటును 7.8 శాతంగా అంచనా వేస్తున్నట్టు దాస్ తెలిపారు. వినియోగ ధరల సూచీ ద్రవ్యోల్బణాన్ని FY21-22కి 5.3 శాతం, FY22-23కి 4.5 శాతంగా అంచనా వేస్తున్నామని వెల్లడించారు.
Also Read: ఉద్యోగం మారితే పాత సాలరీ అకౌంట్‌కు ఫైన్ వేస్తారా? నిబంధనలు మారతాయా?
Also Read: ఐటీ శాఖ అప్‌డేట్ - ఏడాదికి ఒకసారి అప్‌డేటెడ్ ITR దాఖలుకు అవకాశం
'ప్రపంచంతో పోల్చుకుంటే భారత్ భిన్నంగా పుంజుకుంటోంది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది' అని శక్తికాంత దాస్ అన్నారు. వృద్ధికి ఊతమిచ్చేందుకు, లక్షిత ద్రవ్యోల్బణం కోసం వడ్డీరేట్లను యథాతథంగా ఉంచేందుకు ద్రవ్య పరపతి సమీక్ష కమిటీ ఏకగ్రీవంగా అంగీకరించిందని ఆయన తెలిపారు.
ప్రస్తుత ఏడాదికి ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటును 9.2 శాతంగా, ద్రవ్యోల్బణాన్ని 5.3 శాతంగా అంచనా వేశామని దాస్ పేర్కొన్నారు. ఆహార పదార్థాల ధరలు పెరగడంతోనే నవంబర్లో 4.91 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం డిసెంబర్‌కు 5.59 శాతానికి పెరిగిందన్నారు. 2026, మార్చి 31 వరకు వార్షిక ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేందుకే కమిటీ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని 2-6 శాతం మధ్యే ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.