RBI Gold Reserves: దేశంలోని ఆర్థిక వ్యవస్థను గాడిన ఉంచేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా సమయానుగుణంగా బంగారం నిల్వలను పెంచుకుంటూ ఉంటుంది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్థిక అస్థిరతలతో ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు తమ గోల్డ్ రిజర్వు పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ రేసులో ఇప్పటికై చైనా ముందంజలో ఉండగా.. భారత్ సైతం ఈ క్రమంలో తమ గోల్డ్ హోల్డింగ్స్ భారీగా పెంచుకున్నట్లు తాజా గణాంకాల ప్రకారం వెల్లడైంది.
2024 ఆర్థిక సంవత్సరంలో భారతీయ సెంట్రల్ బ్యాంక్ ఆర్బీఐ వద్ద బంగారం నిల్వలు 27.46 మెట్రిక్ టన్నులు పెరిగినట్లు వెల్లడైంది. దీంతో మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ వద్ద మెుత్తం 822.10 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయని విదేశీ మారక నిల్వలపై అర్థ సంవత్సరానికి సంబంధించిన రిపోర్ట్ వెల్లడించింది. డాలర్ విలువ ప్రకారం దేశంలోని సెంట్రల్ బ్యాంక్ వద్ద ఉన్న మెుత్తం విదేశీ మారక నిల్వలు మార్చితో ముగిసిన కాలానికి 8.15 శాతానికి పెరిగాయని వెల్లడైంది. 2023 ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి విదేశీ మారక నిల్వల్లో పసిడి 7.81 శాతంగా ఉంది.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజా నివేదిక ప్రకారం నికర ప్రాతిపదికన సెంట్రల్ బ్యాంక్ కొనుగోలు బహుళ-సంవత్సరాల ట్రెండ్ స్థాపించబడినట్లు కనిపిస్తోంది. అయితే ఇటీవలి ధరల వరుస పెరుగుదతో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని సెంట్రల్ బ్యాంకులు వేచి ఉండటానికి సిద్ధంగా ఉండొచ్చని పేర్కొంది. భారీగా పెరుగుతున్న పసిడి ధరలతో కొంత మంది ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయిస్తూ నగదు డ్రా చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని వెల్లడించింది. ఈ క్రమంలో 2024 మార్చి చివరి నాటికి RBI మొత్తం బంగారం నిల్వల్లో 408.31 మెట్రిక్ టన్నులు దేశీయంగా ఉన్నాయి.
ఈ క్రమంలో భారత్ 387.26 మెట్రిక్ టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద భద్రంగా ఉంచగా, 26.53 మెట్రిక్ టన్నులు బంగారు డిపాజిట్ల రూపంలో ఉంచబడ్డాయి. డిసెంబర్ 2023 చివరి నాటికి దిగుమతులపై విదేశీ మారక నిల్వలు 9.3 నెలల నుంచి 11 నెలలకు పెరిగాయి. 2024 మార్చి చివరి నాటికినమొత్తం విదేశీ కరెన్సీ ఆస్తులు $570.95 బిలియన్లు, $468.99 బిలియన్లు సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టబడింది. గత ఐదేళ్లలో దేశీయంగా బంగారం నిల్వలు 40 శాతం పెరిగాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాలు వెల్లడించాయి.
మార్చి 2019 చివరి నాటికి మొత్తం బంగారం నిల్వ 612 మెట్రిక్ టన్నులుగా ఉంది. ఇందులో దేశీయంగా 292 మెట్రిక్ టన్నులు ఉన్నాయని డేటా చూపించింది.