RBI Report: దేశంలోని బ్యాంకింగ్ రంగాన్ని పటిష్టం చేసేందుకు వాటి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు సెంట్రల్ బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేయబడింది. దీనికి తోడు ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడితప్పకుండా చూసుకోవటంతో పాటు ద్రవ్యోల్బణం నియంత్రణలోనూ తన పాత్రను పోషిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా రిజర్వు బ్యాంక్ అందించిన రిపోర్ట్ దేశ ఆర్థిక వ్యవస్థలోని ప్రమాదాన్ని ముందుకు తీసుకొస్తోంది. 


తాజా నివేదిక ప్రకారం కరోనా మహమ్మారి తర్వాత దేశంలో పబ్లిక్ డెట్ భారీగా పెరిగిందని ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికలో పేర్కొంది. అలాగే దేశ ప్రజల్లో గడచిన 10 ఏళ్లుగా పొదుపు సైతం భారీగా క్షీణించినట్లు వెల్లడించింది. ప్రస్తుతం దేశంలోని ప్రజలు తక్కువగా పొదుపు చేస్తూ ఎక్కువగా అప్పులు చేస్తున్నారని నివేదిక వెల్లడించింది. ఈ ధోరణి దేశ ఆర్థిక స్థిరత్వానికి పెద్ద ముప్పును తీసుకొచ్చే ప్రమాదం ఉందని ఆర్బీఐ హెచ్చరించింది. 


2023 ఆర్థిక సంవత్సరంలో దేశ ప్రజల పొదుపు జీడీపీలో 18.4 శాతం తగ్గుతుందని ఆర్బీఐ అంచనా వేసింది. అయితే 2013-2022 మధ్య కాలంలో సగటున ప్రజల పొదుపు 39.8 శాతంగా ఉన్నట్లు ఐర్బీఐ నివేదిక పేర్కొంది. దీని ప్రకారం ప్రజల్లో వేగంగా తగ్గిపోయిన పొదుపు అలవాట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే 2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలోని ప్రజల పొదుపు 28.5 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. 2013- 2022 మధ్య ప్రజలు తమ ఆదాయంలో సగటున 8 శాతం జీడీపీకి ఆదా చేశారు. అయితే అది 2023లో ఈ సంఖ్య 5.3 శాతానికి పడిపోయింది. ఇదే క్రమంలో రుణాలకు సంబంధించిన డేటాను పరిశీలిస్తే.. భారతదేశంలో మెుత్తం రుణం జీడీపీలో 40.1 శాతానికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇతర ఆర్థిక సంస్థల కంటే ఎక్కువ స్థాయి కావటం ప్రస్తుతం అటు ఆర్బీఐతో పాటు ఆర్థిక నిపుణులు కూడా పెరుగుతున్న రుణాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం..
మార్చి 2023 ప్రారంభంలో అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌తో సహా నాలుగు మధ్య తరహా బ్యాంకులు కుప్పకూలాయి. దీనికి అసలు కారణం సదరు బ్యాంకుల్లో డబ్బు ఉంచిన డిపాజిటర్లు వేగంగా నిధులను ఉపసంహరించుకోవటమే కారణం. ఇదే క్రమంలో అమెరికాలోని బ్యాంకులు ప్రజల సొమ్మును అధిక వడ్డీని సంపాదించేందుకు దీర్ఘకాలిక మెచ్యూరిటీ ఉండే సాధనాల్లో నిధులను పార్క్ చేసింది. ఇది సదరు బ్యాంకులను సంక్షోభంలోకి నెట్టేసింది. ఈ క్రమంలో దేశంలో ముఖ్యంగా బ్యాంకింగ్ రంగంలో ఐదవ వంతు కంటే ఎక్కువగా ఉన్న ఎన్‌బిఎఫ్‌సి సెక్టార్‌లో బాధ్యతల(Liabilities) వైపు రిస్క్ పెరగడం గురించి ఆర్బీఐ ఇప్పుడు ఆందోళన చెందుతోంది.  IL&FS, SREI ఇన్‌ఫ్రా, దేవాన్ హౌసింగ్ వంటి పెద్ద వైఫల్యాలు గతంలో భారత ఆర్థిక వ్యవస్థలో పెద్ద కుదుపులకు దారితీసిన సంగతి తెలిసిందే. 


NBFCల పరిస్థితి ఆందోళనకరం.. 
ఆర్బీఐ తాజా ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రకారం మార్చి 2024 చివరి నాటికి దేశంలోని NBFC సంస్థలు మెుత్తంగా భారీ రుణ భారాన్ని కలిగి ఉన్నాయి. ఇవి ఆర్థిక వ్యవస్థ నుంచి ఎక్కువగా నిధులను సమీకరించాలని ఆర్బీఐ పేర్కొంది. మార్చితో ముగిసిన కాలానికి ఈ సంస్థలకు స్థూల రాబడులు రూ.1.61 లక్షల కోట్లుగా ఉండగా.. అవి చెల్లించాల్సిన స్థూల మెుత్తం రూ.16.58 లక్షల కోట్లుగా ఉండటంపై సెంట్రల్ బ్యాంక్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇదే క్రమంలో మార్కెట్లోని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు సైతం భారీగా నిధులను ఆర్థిక వ్యవస్థ నుంచి సమీకరించాయి. ఇవి ఫెయిల్ అయితే ఆ ప్రభావం అంటువ్యాధిలా ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తుంది.