Telugu States CM's Pays Tribute To PV Narasimharao: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు (PV Narasimharao) జయంతిని తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఘనంగా నిర్వహిస్తోంది. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీవీ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం తదితరులు పీవీ ఘాట్ వద్ద ఘన నివాళి అర్పించారు. అటు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ట్విట్టర్ వేదికగా పీవీకి నివాళి అర్పించారు. 'స్థిత ప్రజ్ఞుడు, బహుభాషా కోవిదుడు, నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పూర్వ ప్రధాన మంత్రి భారతరత్న శ్రీ పీవీ నరసింహారావు గారి జయంతి సందర్భంగా వారికి నివాళులు' అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు. అటు, ఏపీ సీఎం చంద్రబాబు సైతం పీవీకి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. పీవీ తెలుగు రాష్ట్రాలు, దేశానికి చేసిన సేవలను గుర్తు చేశారు. విప్లవాత్మక సంస్కరణలు, సాహసోపేత నిర్ణయాలతో భారతదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు పునాదులు వేశారని కొనియాడారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
'భారతజాతి ముద్దుబిడ్డ'
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. పీవీ జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు, దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని కొనియాడారు. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితి చక్కదిద్దిన దార్శనికుడు అని ప్రశంసించారు. పీవీ అందించిన స్ఫూర్తి ఎన్నటికీ మరువలేనిదని చెప్పారు.
'చరిత్రపై చెరగని ముద్ర'
అటు, తెలంగాణ భవన్‌లో పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మహమూద్ అలీ, పీవీ కూతురు ఎమ్మెల్సీ వాణీదేవి, మాలోత్ కవిత ఇతరులు పాల్గొన్నారు. పీవీ గొప్ప సంస్కరణల శీలి అని కేటీఆర్ అన్నారు. భారతదేశ చరిత్ర ఉన్నంత కాలం పీవీ చరిత్ర నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. మైనార్టీ ప్రభుత్వాన్ని సైతం పూర్తి కాలం సమర్థంగా నడిపారని ప్రశంసించారు. పీవీ గొప్పతనాన్ని గుర్తించి భారతరత్న ఇచ్చి సత్కరించిన కేంద్రానికి అభినందనలు తెలిపారు.