RBI Extends Credit, Debit Card Tokenisation Deadline Till September 30 : డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల టోకెనైజేషన్‌ అమలు గడువును రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మరోసారి పొడగించింది. 2022, జులై 1 నుంచి సెప్టెంబర్‌ 30 వరకు పెంచింది. టోకెనైజేషన్‌ అమలు గడువు పెంచడం ఇది రెండోసారి కావడం గమనార్హం. లావాదేవీల పరంగా టోకెనైజేషన్‌ అమల్లో ఇంకా ఇబ్బందులు తొలగిపోలేదని వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు విన్నవించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.


'అన్ని వైపులా నుంచి విజ్ఞప్తులు రావడంతో టోకెన్‌ ఆధారిత లావాదేవీల ప్రాసెసింగ్‌ను మరికొన్ని రోజులు వాయిదా వేస్తున్నాం. క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల లావాదేవీలకు ఇప్పుడున్న పద్ధతే కొనసాగుతుంది. టోకెనైజేషన్‌ ప్రకియ అమలు గడువును మరో మూడు నెలలు పొడగిస్తున్నాం' అని ఆర్బీఐ తెలిపింది.


Also Read: జస్ట్‌ ఒక్క వారంలో 30% పెరిగిన షేర్లు! లిస్ట్‌ ఇదే!


Also Read: నీరవ్‌ మోదీ తరహా దొంగల కోసం 'బ్లాక్‌ చైన్‌' వల పన్నుతున్న ఆర్బీఐ!


టోకెనైజేషన్‌ ఏంటి? 


మీరు లావాదేవీలు చేపట్టేటప్పుడు డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డు వివరాలను నమోదు చేస్తుంటారు. కార్డు మీదున్న 16 అంకెలు, కార్డు ఎక్స్‌పైరీ డేట్‌, సీవీవీ, ఓటీపీ, పిన్‌ వివరాలు ఎంటర్‌ చేస్తుంటారు. అవన్నీ సరిగ్గా ఉంటేనే లావాదేవీ చెల్లుతుంది. ఈ ప్రకియనంతా ఇకపై టోకెనైజేషన్‌ భర్తీ చేస్తుంది. ఇందుకు మీ కార్డు వివరాలు నమోదు చేయాల్సిన అవసరం లేదు. బదులుగా మీ కార్డుకు సంబంధించిన టోకెన్‌ను నమోదు చేస్తే చాలు.


కార్డులు టోకెనైజ్ ఎలా?


మొదట కస్టమర్లు తమ కార్డులను టోకెన్ రిక్వెస్టర్ అందించే ఒక ప్రత్యేక యాప్ ద్వారా టోకెనైజ్ చేసుకోవాలి. ఈ టోకెన్ రిక్వెస్టర్ వినియోగదారుడి అభ్యర్థనను కార్డ్ నెట్‌వర్క్‌కు పంపుతుంది. కార్డు జారీచేసిన సంస్థ అనుమతితో ఆఖర్లో టోకెన్‌ జారీ అవుతుంది. కాంటాక్ట్‌లెస్ కార్డు లావాదేవీలు, క్యూఆర్ కోడ్‌లు, యాప్‌ల ద్వారా చెల్లింపులకు టోకెనైజేషన్‌ను అనుమతించారు. వీసా, మాస్టర్ కార్డ్ లాంటి కంపెనీలు టోకెన్ సర్వీస్ ప్రొవైడర్లుగా (టీఎస్‌పీ) వ్యవహరిస్తాయి. ఇవి మొబైల్ చెల్లింపులు లేదా ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌కు టోకెన్‌లను అందిస్తాయి.