నాన్నా పందులే గుంపుగా వస్తాయి... సింహం సింగిల్‌గా వస్తుంది... ఎవరు అడ్డొచ్చినా తగ్గేదేలే... తొక్కుకుంటూ పోవాలే... ఈ మూడు డైలాగ్ ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్స్‌ను మిగతా చోట్ల ఎవరు ఎలా వాడుకుంటున్నారో తెలియదు కానీ పొలిటికల్ సర్కిల్స్‌లో మాత్రం ఈ మూడింటినీ విరివిగా వాడేస్తున్నారు మన రాజకీయా నాయకులు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఈ మూడు డైలాగ్స్‌ను గుర్తు చేస్తున్నాయి.
స్ట్రాంగ్ వార్నింగ్
మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ అసమ్మతి నేతలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎంత మంది ఏకమైనా తానే మళ్ళీ ఎమ్మెల్యేనని చెప్పుకొచ్చారు. ఎవరెవరు... ఎంతమంది ఏకమైన నేనే ఎమ్మెల్యేనని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అని చాలెంజ్ విసిరారు. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలతోపాటు అపోహలు సృష్టిస్తున్న సొంత పార్టీ నేతలను ఉద్దేశించి ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
అసంతృప్తులకు దిశానిర్దేశం
కృష్ణదాస్ మాట్లాడిన మాటలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చణీయాంశమయ్యాయి. జిల్లాలోని 8 నియోజకవర్గాల పరిధిలో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో పార్టీ పరిస్థితులపై చర్చ జరుగుతుంది. అంతా కలిసి పని చేయాలంటూ అసమ్మతి గళం వినిపిస్తున్న నేతలకు పార్టీ పెద్దలు హితబోధన చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో వైకాపా గెలుపే అందరి లక్ష్యం కావాలని దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న మాజీ సిఎం, నరసన్నపేట ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ప్రాతినిధ్యంవహిస్తున్న నరసన్నపేట నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశం శుక్రవారం సాయంత్రం జరిగింది.
కృష్ణదాస్‌కు వ్యతిరేకంగా ప్రచారం
ఈ ప్లీనరీ సమావేశంలో నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. అయితే గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలోని కొందరు నాయకులు అసమ్మతి గళం విన్పిస్తున్నారు. ధర్మాన కృష్ణదాస్‌ను అబాసుపాలు చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికలలో నరసన్నపేటలో వైకాపాకి గడ్డు పరిస్థితే అంటూ వ్యతిరేక ప్రచారాలను సాగిస్తున్నారు. నాయకులు, కార్యకర్తలను కృష్ణదాసు పట్టించుకోవడం లేదని... ఏ పనులు కూడా జరగడం లేదని రకరకాలుగా విమర్శలు గుప్పిస్తున్నారు. అవకాశం వస్తే తాము పోటీకి సిద్ధమన్న సంకేతాలను కూడా అధిష్ఠానానికి పంపిస్తున్నారు. ఈసారి కృష్ణదాస్ ఎలా గెలుస్తారో చూస్తామని అసమ్మతి నేతలు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ప్రత్యర్థులకు ఛాలెంజ్
అసమ్మతి నేతల పోరు పెరుగుతుండడంతో జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కృష్ణదాస్ వారికి చెక్ పెట్టేందుకు సిద్దమయ్యారు. రాష్ట్రముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిఆశీస్సులు పుష్కలంగా ఉన్న దాసన్న... ప్లీనరీ సమావేశాన్నివేదికగా చేసుకుని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పలుమార్లు ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకి ఛాలెంజ్ విసిరిన కృష్ణదాస్ ఈసారి పార్టీ నేతలను వదలలేదు. వారిని ఉద్దేశించి గట్టిగానే మాట్లాడారు. తనదైన శైలిలో ఛాలెంజ్ చేశారు.
ఒక్క పదవి అనేక మంది ఆశిస్తారు... సమర్థులు అనేక మంది ఉంటారు. కానీ ఎవరో ఒక్కరికే అవకాశం వస్తుందన్నారు ధర్మాన కృష్ణదాస్. పదవి దక్కని వారికి కొంత బాధ ఉంటుందన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి ఎంత మంది ఎమ్మెల్యేలవుతారు... ప్రతి ఒక్కరు ఎమ్మె ల్యేలు అయిపోవాలనుకుంటే అయిపోతారా అంటూ ధర్మాన కృష్ణదాస్ ప్రశ్నించారు. అది ఎమ్మెల్యే పదవైనా, జడ్పీటిసి, ఎంపిపి, ఎంపిటిసి, సర్పంచ్ వంటి పదవులైనా ఒక్కరికే అవకాశం ఉంటుందన్నారు. ఇతర నేతలందరిని కలుపుకుని వెళ్లే బాధ్యత గెలిచిన వారికే ఉంటుందన్నారు. అలా కలుపుకోకుండా వెళితే అసమ్మతి ఉంటుంద న్నారు.
మంచోడు... అమాయకుడనుకుంటే మీకే నష్టం
స్థాయి మరచిపోయి అత్యాశకి పోవడం కూడా అసమ్మతికి కారణం అవుతుందన్నారు ధర్మాన కృష్ణదాస్. స్థాయి మరచిపోయి కొందరు ఎమ్మెల్యే అయిపోవాలనో, మంత్రిని అయిపోవాలనో, సిఎంని అయిపోవాలనో అనుకుంటే అసమ్మతి మొదలైపోతుందని, స్పర్ధలు వస్తాయన్నారు. అటువంటి నేతలకి నేల విడిచి సాము చేయవద్దని హెచ్చరించారు. అలా చేస్తే నడవ లేక పడిపోతారన్నారు. తానేమి అమాయకుడునుకాదన్నారు. దాసయ్య మంచోడు... మంచోడు... అమాయకుడని అనుకుంటారని తానేమి అమాయకుడుని కాదన్నారు. తాను అమాయకుడినైతే నాలుగు సార్లు గెలవనివ్వరన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. నియోజకవర్గంలోని నాయకుల అందరి పద్దతులు తనకు తెలుసునన్నారు.. ఎవరి మనోభావాలు ఏంటో తనకు తెలుసునని వారికి ఎలా చెక్ చెప్పాలో కూడా తెలుసునన్నారు.
రానున్న 2024 ఎన్నికలలో నరసన్నపేట నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్‌కాంగ్రెస్ పార్టీ తరఫున తానే పోటీ చేస్తున్నానన్నారు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్. ఎంత మంది, ఎవరెవరు ఏకమైనా తాను ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమన్నారు. జగన్మోహన్ రెడ్డి సిఎం అవ్వడాన్ని ఆపలేరన్నారు. తనపై అవినీతి ఆరోపణలు నిరూపించగలరా అంటూ ఛాలెంజ్ చేశారు. అశ్రద్దగా ఉంటున్నారనో లేదంటే పట్టించుకోవడం లేదనో ఎవరైనా చెప్పగలరా అని ప్రశ్నించారు. ఎవరైనా ఈ సమావేశంలోనే నిర్భయంగా ముందుకువచ్చి మాట్లాడవచ్చని కూడా కృష్ణదాస్ సూచించారు. ఏది ఏమైనా తగ్గేదేలే అంటూ కృష్ణదాస్ వ్యాఖ్యలు చేయగా ఆ సమావేశానికి హాజరైన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు చప్పట్లు కొట్టి హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.