శ్రీకాకుళం వైసీపీలో విచిత్రమైన సమస్య పార్టీని వేధిస్తోంది. అవినీతి లేకుండా పథకాలు అందిస్తున్నామని చెప్పుకుంటున్న అధికార పార్టీ నేతలు.. క్యాడర్ సంగతి మర్చిపోతున్నారన్న విమర్శ బహిరంగంగానే వినిపిస్తోంది. మూడేళ్లు గడిచిపోతున్నా తమను పట్టించుకున్న వారే లేరన్న అసంతృప్తి సిక్కోలు క్యాడర్‌లో గట్టిగానే కనిపిస్తోంది. 


ఎప్పుడైనా ధర్మానదే పైచేయి


ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లాకు పరిమితం కాలేదని రాష్ట్రవ్యాప్తంగా అదే పరిస్థితి ఉందని కొందరు పార్టీ లీడర్లే చెబుతున్నారు. ఇలా  క్యాడర్‌లో అసంతృప్తి ఉందనడానికి అనేక ఉదాహరణలు కళ్ల ముందే కనిపిస్తున్నాయి. అందులో శ్రీకాకుళం ఒకటి. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీకాకుళం నియోజకవర్గానిది భిన్నమైన పరిస్థితి. ధర్మానకు గెలుపు ఓటములతో సంబంధం లేదు. 2014లో ఆయన వైకాపాలో చేరి ఆ ఏడాది ఎన్నికల్లో ఓడిపోయినా, వైకాపా ప్రభుత్వం అధికారంలోకి రాకపోయినా ధర్మాన చరిష్మా ఎక్కడా తగ్గలేదు. అప్పటి ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి ఇంట్లో కంటే ధర్మాన బంగ్లాలోనే జనం ఎక్కువగా ఉండే వారు. 2019లో అధికారంలోకి వచ్చినా మొదటి మూడేళ్లు ఆయనకు మంత్రి పదవి దక్కలేదు. అయినా అప్పటి మంత్రుల క్యాంప్ కార్యాలయాల కంటే ధర్మాన కార్యాలయంలోనే జనం ఎక్కువగా కనిపించేవారని టాక్. కానీ ఇప్పుడు ఆయనకు మంత్రి పదవి వచ్చినా క్యాడర్‌లో సంతోషం కనిపించడం లేదు. 


పెరుగుతున్న నిరాశ 


ఇన్నాళ్లూ వారిలో కాస్త అసంతృప్తి ఉన్నప్పటికీ నాయకుడు పవర్‌లో లేడని సరిపెట్టుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. నమ్ముకున్న నాయకుడు పదవిలో ఉన్నాడు. అందుకే ధర్మానపై చాలా ఆసలు పెట్టుకున్న వాళ్లంతా నిరాశలో కూరుకుపోతున్నారు. ధర్మాన మీద ఉన్న ప్రేమ కొద్దీ ఇన్నాళ్లూ నెట్టుకొచ్చినా, ఇక నుంచి తమ అసంతృప్తిని బహిరంగపర్చడానికి క్యాడర్ సిద్ధపడుతోంది. 


అంసతృప్త సంకేతాలు పంపిస్తున్న కేడర్


మొన్నటికి మొన్న ముఖ్యమంత్రి బహిరంగ సభ కోసం ధర్మాన సన్నాహక సభ నిర్వహిస్తే దానికి సగం నగర క్యాడర్ డుమ్మా కొట్టారు. దీనిపై ధర్మాన కూడా సీరియస్ అయ్యారు. ఇలా డుమ్మా కొట్టే వాళ్లను తప్పించాలని ఓపెన్‌గానే చెప్పేశారు. కానీ ఇక్కడ అసలు లాజిక్‌ను ఆయన మిస్‌ అయ్యారని కేడర్‌ మాట్లాడుకుంటోంది. 2010లో మున్సిపల్ కౌన్సిల్ పదవీ కాలం ముగిసిన తర్వాత ఇంత వరకు ఇక్కడ ఎన్నికలు జరగలేదు. అప్పట్నుంచి అదిగో ఎన్నికలు.. ఇదిగో ఎన్నికలంటూ ఊరిస్తూ  వచ్చారు. అలా ఎన్నికలు లేకుండానే 12 ఏళ్లు గడిచి పోయాయి. 


లీడర్ ఎవరు కేడర్‌ ఎవరు?


ధర్మాన మంత్రి అయిన తర్వాత కూడా శ్రీకాకుళం మున్సిపల్‌ కౌన్సిల్ ఎన్నికల ఊసు లేకపోవడంతో క్యాడర్లో పూర్తిగా నిస్పృహ ఆవహించింది. 2014 నుంచి ఇప్పటి వరకు ప్రతి డివిజన్‌లోనూ కార్పొరేటర్ పదవి కోసం ముగ్గురికి తక్కువ కాకుండా  ఆశావహులు ఉన్నారు. ఇన్నాళ్లూ వారే పార్టీకి బలంగా ఉండేవారు. కానీ ఈసారి కూడా ఎన్నికలు జరగవన్న భావనకు రావడంతో వారిలో తెగింపు వచ్చేసింది. అలాగని ఇప్పటి వరకు ఏ డివిజన్‌లోనూ అధికారికంగా ఇన్ఛార్జిలను ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ధర్మాన గెలుపు కోసం బూత్ స్థాయిలో, వార్డు స్థాయిలో పని చేసినవారే ఇప్పుడు వైఎస్‌ఆర్‌సీపీ తరఫున డివిజన్లలో ఉన్నారు. అందులో ఎవరు ఇన్ఛార్జ్, ఎవరు కాదో ఇంతవరకు తెలియదు. 


మేల్కోకుంటే అభ్యర్థులు కష్టమే


వారిలో సమావేశానికి రాని వారిని తప్పించాలంటూ ధర్మాన ఆదేశించారు. ఇలాంటి వ్యక్తులతో కార్పొ రేషన్ ఎన్నికలకు వెళ్లలేమని ప్రకటించారు. 2023 లోపు కార్పొరేషన్ ఎన్నికలు జరగకపోతే ఆ తర్వాత పోటీ చేయడానికి అభ్యర్థులు ఉండరని నేతలు చెవుళ్లు కొరుక్కుంటున్నారు. ఇప్పటికే పైసలు పోయి, పరపతి పోయి అప్పుల పాలైపోయిన తాము ఇకైప చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా లేమని సిగ్నల్ ఇస్తున్నారు. 


వదులుతున్న కేడర్ చేతి చమురు


చేతి చమురు వదులుతున్నా గుర్తింపు లేదని శ్రీకాకుళంలోని వైసీపీ కేడర్‌ అసహనంతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కార్యకర్తల చేతి చమురు వదులుతోందని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి సొమ్ములొచ్చే పనుల విషయం పక్కన పెడితే కనీసం మర్యాదకు కూడా లేదన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. మొన్నటికి మొన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తే పాల్గొన్నవారికి టిఫిన్స్ పెట్టడానికి బలగకు చెందిన కార్యకర్తకు రూ.30వేలు ఖర్చయిందట. సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర పేరిట చేపట్టిన సభకు ప్రతి డివిజన్ నుంచి జనాలను పోగేయడానికి ఒక్కో డివిజన్‌కు రూ.30వేలు వంతున ఖర్చయిందని సమాచారం. ఇంత చేసినా ఫలాన నాయకుడు జనసమీకరణ చేశాడన్న గుర్తింపు కూడా లేదని వారంతా వాపోతున్నారు. 


మైలేజ్‌ వాళ్లకు- గుండు సున్నా కేడర్‌కు


గతంలో జెమ్స్ ఆస్పత్రితో ధర్మాన తనయుడు చిన్ని కలిసి గుండె వైద్య శిబిరాలు నిర్వహిస్తే ప్రతి డివిజన్‌లోనూ పండుగలా చేశారు. ఫ్లెక్సీలు, భోజనాలు, తాంబూలాలతో హడావుడి చేశారు. ఇది చిన్నీకి, జెమ్స్ ఆస్పత్రికి పేరు తెచ్చింది కానీ.. తమ చేతి చమురు వదిలిందని వాపోతున్నారు కార్యకర్తలు. గతంలో ధర్మాన ప్రసాదరావు చేసిన పాదయాత్రకు జనసమీకరణ చేసినా... కార్యకర్తలెవరినీ పార్టీ గుర్తించలేదట. 


కార్పొరేషన్‌కు పాలకవర్గం ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని... అలా కాకపోవడంతో ఇప్పుడు మంత్రి అయిన ధర్మాన ప్రసాదరావు వద్దకు ఇంతకు ముందు వెళ్లినంత సులువుగా తాము వెళ్లలేకపోతున్నామని వాపోతున్నారు కొందరు నేతలు. తమ అసంతృప్తిని ఎలా చెప్పినా పట్టించుకున్న వారే లేరని ఆవేదన చెందుతున్నారు. 


రేపు ప్లీనరీకి, సీఎం సభకు జనాలు పోగవుతారు కానీ... గతంలో వచ్చినంత ఉత్సాహంగా రాబోరని.. దీన్ని గమనించాలని కేడర్‌ అభిప్రాయపడుతోంది. కానీ ఈ ప్లీనరీ సందర్భంగా కేడర్‌కు భరోసా ఇచ్చే అంశాన్ని విస్మరిస్తే మాత్రం కచ్చితంగా భవిష్యత్తు  కష్టమవుతుందని కొందరు హెచ్చరిస్తున్నారు.