Ysrcp With BJP : కొద్ది రోజుల క్రితం సీపీఐ నేత రామకృష్ణ మాట్లాడుతూ వైసీపీ, బీజేపీల మధ్య సంబంధంపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఉద్దేశం ప్రకారం బీజేపీ, వైసీపీలు ఏపీలో గుద్దులు, కేంద్రంలో ముద్దులు అన్నట్టు ఉందని, చూస్తూ ఉండండి వైసీపీ కచ్చితంగా ఎన్డీయే అభ్యర్థికే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తుందని అన్నారు. సరిగ్గా ఆయన చెప్పినట్టే జరిగింది. గిరిజన మహిళను నిలబెట్టారు కాబట్టి మద్దతు ఇస్తున్నామంటూ వైసీపీ బీజేపీ నిలబెట్టిన అభ్యర్థికే ఓటు వేసింది. నిజానికి ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయేతర పార్టీల్లో వైసీపీ, బీజేడీలదే ప్రముఖ పాత్ర. అయితే సొంత రాష్ట్రం ఒడిశాకు చెందిన అభ్యర్థి కావడంతో ద్రౌపది ముర్ముకు బీజేడీ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి. కానీ వైసీపీ మాత్రం కేవలం గిరిజన మహిళా అభ్యర్థి కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నామంటూ బీజేపీకి మద్దతు తెలిపింది. అయితే ఒకవేళ బీజేపీయేతర పార్టీలు కూడా తమ అభ్యర్థిగా మరో గిరిజన అభ్యర్థిని తెరపైకి తెచ్చి ఉంటే వైసీపీ ఏ నిర్ణయం తీసుకునేది అంటే అది సమాధానం లేని ప్రశ్నే అంటున్నారు విశ్లేషకులు. 


రాష్ట్రంలోనే ప్రత్యర్ధులు?


మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా ఇటీవల మాట్లాడుతూ ఏపీలో ఎవరు అధికారంలో ఉన్నా బీజేపీకి వాళ్ల ఎంపీల మద్దతు ఉన్నట్టే అంటూ చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి. దానికి ఉదాహరణగా జగన్ ప్రభుత్వం అనేక సందర్భాల్లో బీజేపీకి కేంద్రంలో మద్దతు ఇచ్చిన అంశాన్ని తెరమీదకు తెచ్చారు. ముఖ్యంగా ఆయనలాంటి విశ్లేషకులు, మాజీలు చెబుతున్నది ఒకటే  రాష్ట్రంలో పార్టీలపరంగా ఎంతెలా ఒకరినొకరు దుమ్మెత్తిపోసుకున్నా కేంద్రంలో అవసరం వచ్చేసరికి మాత్రం వైసీపీ, బీజేపీలు ఒకదానికొకటి మద్దతుగా నిలుస్తున్నాయని అంటున్నారు. కేవలం రాజకీయంగా రాష్ట్రంలో మాత్రమే ప్రత్యర్థులు అని, కేంద్రంలో మాత్రం సహకారం కొనసాగుందనేది వారి వాదన. 


విపక్షాల భేటీకి హాజరుకాని వైసీపీ  


దిల్లీలో ఇటీవల జరిగిన ఎన్డీయేతర విపక్షాల భేటీకి తెలుగు నేతలను పిలవలేదని  చిన్న చూపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఆ భేటీకి అధ్యక్షత వహించిన తృణమూల్ కాంగ్రెస్ వివరణ ఇస్తూ తాము జగన్ మోహన్ రెడ్డిని కూడా ఆహ్వానించామని కానీ వారు తమ ఆహ్వానాన్ని తిరస్కరించారని స్పష్టం చేశారు. దీనితో వైసీపీ ఎన్డీయేకి మద్దతు ఇస్తుందని కథనాలు వెలువడ్డాయి. మరోవైపు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, రాయితీలు సాధించుకోవడానికి ఇదే సరైన సమయం అని, బీజేపీతో సరైన సంప్రదింపులు చేసే అవకాశం వచ్చిందని విశ్లేషకులు చెబుతూ వచ్చారు. కానీ అలాంటి స్పష్టమైన సంప్రదింపులు లేకుండానే బీజేపీకి జగన్ ప్రభుత్వం మద్దతు పలికింది అనేది ఇప్పటివరకూ ఉన్న సమాచారం. 


2024 ఎన్నికల ముఖచిత్రం ఇదేనా ?


ఒకవైపు ఏపీలో విపక్షాల మధ్య ఏదో ఒకదశలో పొత్తు ఏర్పడక తప్పదని అందరూ భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని కొన్ని పార్టీలు ప్రకటించాయి కూడా. కానీ కేంద్రంలో  బీజేపీ వైఖరి చూస్తుంటే జగన్ ను ఒక  నమ్మకమైన స్నేహితుడిగానే  చూస్తున్నట్టు కనపడుతోంది. దానితో విపక్షాల మధ్య బీజేపీతో కూడిన పొత్తు సాధ్యం కాదనే అనుమానాలు రేగుతున్నాయి. అందుకే ఇప్పటికే వారితో పొత్తులో ఉన్న జనసేన కూడా పొత్తుల విషయమై ప్రస్తుతానికి మౌనం వహించింది అంటున్నారు విశ్లేషకులు. ఇదే నిజమైతే కనుక ఏపీలో 2024 ఎన్నికల ముఖచిత్రంపై స్పష్టత వచ్చేసినట్టే అనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి .