Shantanu Naidu Joined Tata Motors As General Manager: దివంగత వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు క్లోజ్ ఫ్రెండ్‌గా, యువ స్నేహితుడిగా, అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తిగా (Ratan Tata's Young Friend) శంతను నాయుడు సుపరిచితుడు. ఇప్పుడు, శంతను నాయుడు టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నియమితులయ్యారు. లింక్డ్ఇన్‌లో ఒక భావోద్వేగ పోస్ట్ ద్వారా ఈ సమాచారాన్ని శంతను నాయుడు షేర్ చేశారు.
"టాటా మోటార్స్‌లో జనరల్ మేనేజర్ & స్ట్రాటజిక్ ఇనిషియేటివ్స్ హెడ్‌గా నేను కొత్త బాధ్యత స్వీకరించబోతున్నానని తెలియజేయడానికి సంతోషిస్తున్నా. నాన్న గారు టాటా మోటార్స్ ప్లాంట్ నుంచి తెల్లటి చొక్కా, నేవీ బ్లూ ప్యాంటు ధరించి ఇంటికి తిరిగి వచ్చేవారు. నేను కిటికీ దగ్గర కూర్చుని ఆయన కోసం వేచి ఉండేవాడిని. ఇప్పుడు నేను కూడా అలా నడుచుకునే రోజులు తిరిగి వచ్చాయి" అని తన పోస్ట్‌లో శంతను నాయుడు రాశారు.
శంతను నాయుడి విద్యార్హతలు
శంతను నాయుడు 2014లో సావిత్రిబాయి పులే పుణె విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ అందుకున్నారు. తర్వాత, 2016లో కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి MBA పూర్తి చేశారు. 2018లో, శాంతను నాయుడు రతన్ టాటాకు సహాయకుడిగా పని చేయడం ప్రారంభించాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య గాఢమైన స్నేహం కుదిరింది. వయస్సుల్లో దశాబ్దాల తేడా ఉన్నప్పటికీ, ఆ ఇద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ కావడం యావత్ దేశాన్ని ఆకర్షించింది. మూగ జీవాలపై. ముఖ్యంగా వీధి కుక్కలపై ఉన్న ప్రేమ ఆ ఇద్దరినీ కలిపింది. రతన్ టాటా పుట్టిన రోజున శాంతను నాయుడు పాడిన పాట తాలూకు వీడియో కూడా వైరల్ అయింది. రతన్ టాటా జీవిత చరమాంకంలో, టాటాకు కేర్‌టేకర్‌గా, జనరల్ మేనేజర్‌గానూ శంతను నాయుడు బాధ్యతలు తీసుకున్నారు.
శంతను నాయుడి ప్రయత్నాలు మెచ్చుకున్న రతన్ టాటా
వృత్తిరీత్యా ఆటోమొబైల్ డిజైన్ ఇంజనీర్ అయిన శంతను నాయుడు, మూగ జీవాల కోసం సేవా కార్యక్రమాలు కూడా చేపట్టేవారు. వీధుల్లో & రోడ్లపై తిరిగే వీధి శునకాలను వేగంగా వచ్చే వాహనాలు ఢీకొనకుండా కాపాడటానికి శంతను నాయుడు 2014లో ఒక ప్రాజెక్ట్ ప్రారంభించారు. అతనికి మూగ జంతువుల పట్ల ఉన్న ప్రేమ రతన్ టాటా దృష్టిని ఆకర్షించింది. దీంతో, శంతను నాయుడి ప్రాజెక్టులో రతన్ టాటా పెట్టుబడి పెట్టారు, ఆ విధంగా ఇరువురూ స్నేహితులయ్యారు.
శాంతను నాయుడు, తాను రాసిన 'ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్' (I Came Upon a Lighthouse) పుస్తకంలో రతన్ టాటాతో తనకు ఉన్న స్నేహాన్ని గురించి కూడా ప్రస్తావించారు. ఆ పుస్తకంలో, రతన్ టాటా వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలీని అంశాలను ఆ పుస్తకంలో ప్రస్తావించాలని భావిస్తున్నట్లు టాటాకు చెప్పారు. దీనికి రతన్ టాటా అంగీకరించారు. అలా రతన్ టాటా జీవితం గురించి చాలా మందికి తెలీని కొత్త కోణాలతో 'ఐ కేమ్ అపాన్ ఎ లైట్‌హౌస్' పుస్తకం ముద్రితమైంది, ఇది ప్రస్తుతం మార్కెట్‌లో దొరుకుతోంది.
మరో ఆసక్తికర కథనం: నెలకు రూ.11 వేలు పెట్టుబడి పెడితే మీ రిటైర్మెంట్ నాటికి ఏది ఎక్కువ డబ్బు వస్తుంది ?