Systematic Investment Plan Vs Public Provident Fund: చాలా మంది, తమ పదవి/పని విరమణ సమయానికి చాలా డబ్బు కూడబెట్టుకునేందుకు ముందు నుంచే పెట్టుబడులు పెడుతుంటారు. ఆ పెట్టుబడి ప్రణాళికల్లో SIP & PPF రెండూ పాపులర్ ఆప్షన్స్. SIP మార్కెట్ పనితీరుతో ముడిపడి ఉంటుంది, ఫలితంగా రాబడిలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. PPF స్థిర రాబడిని అందిస్తుంది, అయితే ఇది సాధారణంగా SIP కంటే తక్కువగా ఉంటుంది. ఈ రెండిటిలో దేనిని ఎంచుకున్నా స్థిరంగా & క్రమశిక్షణతో పెట్టుబడి కొనసాగించడం కీలకం.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (SIP) ద్వారా,మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లో ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టవచ్చు. పెట్టుబడుల ఫ్రీక్వెన్సీని ఎంచుకోవడానికి వెసులుబాటు కూడా ఉంటుంది. రోజువారీ, నెలవారీ, త్రైమాసిక లేదా వార్షికంగా అయినా ఇన్వెస్ట్‌మెంట్ కొనసాగించవచ్చు. ఇది సంపదను కూడబెట్టే సమర్థవంతమైన & నిర్మాణాత్మక విధానంగా పని చేస్తుంది.
సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ కోసం కనీస పెట్టుబడి రూ.500 (కొన్ని పథకాల్లో రూ.100). SIP సహకారాలను అవసరానికి తగ్గట్లు పెంచడం, తగ్గించడం లేదా నిలిపివేయడం ద్వారా సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీనిలో, ముందుగా నిర్ణయించిన డబ్బు మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్ అయి మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌కు చేరుతుంది. ఈ పెట్టుబడులు క్రమం తప్పకుండా జరుగుతుంది & మీరు ఫండ్ నికర ఆస్తి విలువ (NAV) ప్రకారం యూనిట్లను అందుకుంటారు.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా బాగా పాపులర్ స్కీమ్. రిటైర్మెంట్ ఫండ్‌ను సృష్టించడానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడే పొదుపు కార్యక్రమం ఇది. ఏదైనా బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌లో పీపీఎఫ్ అకౌంట్‌ను సులభంగా ప్రారంభించవచ్చు లేదా ఇంట్లో కూర్చుని ఆన్‌లైన్‌లోనే అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ప్రస్తుతం, పీపీఎఫ్ ఖాతాలపై 7.10% వడ్డీ రేటు (PPF interest rate 2025) ఉంది, ఏటా కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ వస్తుంది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్‌లో, ఒక ఆర్థిక సంవత్సరంలో కనీస డిపాజిట్ రూ. 500, గరిష్ట పరిమితి రూ. 1.50 లక్షలు.
మీరు 35 సంవత్సరాల పాటు ప్రతి నెలా రూ. 11,000 పెట్టుబడి పెడితే, ఎందులో ఎక్కువ డబ్బు క్రియేట్ అవుతుంది?
పదవీ విరమణ నిధి కోసం ఏ పెట్టుబడి ఎంపిక ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఒక వ్యక్తి, 35 సంవత్సరాల పాటు నెలకు రూ. 11,000 చొప్పున పెట్టుబడి పెట్టడని భావిద్దాం.
PPFలో ఇలా...
నెలకు రూ. 11,000 చొప్పున, PPF వార్షిక పెట్టుబడి రూ. 1,32,000 (రూ. 11,000 x 12 నెలలు). కాల వ్యవధి 35 సంవత్సరాలు, వడ్డీ రేటు 7.10 శాతం. ఈ ప్రకారం, 35 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆ మొత్తం పెట్టుబడి విలువ రూ. 1,99,74,114 కు చేరుకుంటుంది. దీనిలో మీ పెట్టుబడి రూ. 46,20,000 + రాబడి రూ. 1,53,54,114 ఉంటుంది.
SIPలో ఇలా..
SIP పెట్టుబడులపై స్థిరమైన రాబడి ఉండదు కాబట్టి.. డెట్ ఫండ్లకు 8 శాతం, ఈక్విటీ ఫండ్లకు 10 శాతం & హైబ్రిడ్ ఫండ్లకు 12 శాతం వార్షిక రాబడిని ఉదాహరణగా తీసుకుందాం.
హైబ్రిడ్ ఫండ్స్‌లో SIP చేస్తే, 12 శాతం వార్షిక వృద్ధి రేటుతో, 35 సంవత్సరాల తర్వాత, కార్పస్ రూ. 7,14,47,960 కు చేరుకుంటుంది. ఈ కాలంలో మీ మొత్తం పెట్టుబడి రూ. 46,20,000 అవుతుంది, రూ. 6,68,27,960 మూలధన లాభం వస్తుంది.
ఈక్విటీ ఫండ్స్‌లో SIP చేస్తే, 10 శాతం వార్షిక వృద్ధి రేటుతో, 35 సంవత్సరాల తర్వాత, కార్పస్ రూ. 4,21,11,044 కు చేరుకుంటుంది. మీ మొత్తం పెట్టుబడి రూ. 46,20,000 పోను, రూ. 3,74,91,044 లాభం కనిపిస్తుంది.
డెట్ ఫండ్స్‌లో SIP చేస్తే, 8 శాతం వార్షిక వృద్ధి రేటుతో, 35 సంవత్సరాల తర్వాత, కార్పస్ రూ. 2,54,00,925 కు చేరుకుంటుంది. మీ పెట్టుబడి రూ. 46,20,000 పోను, రూ. 2,07,80,925 లాభం వస్తుంది.
స్పష్టీకరణ: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. ఫలానా చోట పెట్టుబడి పెట్టాలని "abp దేశం" ఎప్పుడూ సలహా ఇవ్వదు.
మరో ఆసక్తికర కథనం: PPFతో నెలకు రూ.39,000 పైగా రాబడి - ఈ డబ్బు మొత్తానికీ 'జీరో టాక్స్'