Delhi Elections 2025: ఢిల్లీలో పోలింగ్ ప్రారంభం, భారీ బందోబస్తు నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్న ఈసీ

Delhi Assembly Elections 2025 | దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కడుతున్నారు. తొలి ఓటర్లకు ప్రశంసాపత్రం ఇచ్చారు.

Continues below advertisement

Delhi Assembly Polls 2025 | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు భారీ భద్రత నడుమ పోలింగ్‌ ప్రారంభమైంది. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్‌ జరగనుందని ఈసీ పేర్కొంది. ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. మొత్తం 70 నియోజకవర్గాల్లో 13,776 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 1.56 కోట్ల మందికిపైగా ఓటర్లు ఢిల్లీ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. బీజేపీ, అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ మధ్య హోరాహోరీగా పోరు నడుస్తోంది.

Continues below advertisement

అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న 699 మంది అభ్యర్థులు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 నియోజకవర్గాలకుగానూ మొత్తం 699 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. హోమ్‌ ఓటింగ్‌ ద్వారా ఇదివరకే 7,553 మంది ఓటర్లలో 6,980 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. 19,000 మంది హోమ్ గార్డులు, 35,626 మంది ఢిల్లీ పోలీసు సిబ్బంది సహా 220 కంపెనీల పారామిలిటరీ బలగాలతో ఎన్నికల కమిషన్ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తోంది. మరోవైపు డ్రోన్ కెమెరాలతో నిఘాను పెంచింది. పాతికేళ్ల తరువాత ఢిల్లీ పీఠం సొంతం చేసుకోవాలని బీజేపీ భావిస్తోంది. హ్యాట్రిక్ విజయం సాధించాలని ఆప్ నేతలు ఎదురుచూస్తున్నారు. వరుసగా మూడుసార్లు ఆప్ అధికారం లోకి వచ్చింది. కానీ తొలిసారి ఎన్నికల తరువాత కేవలం నెలన్నరకే ప్రభుత్వాన్ని రద్దు చేసి అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికలకు వెళ్లడం తెలిసిందే. దాంతో వరుసగా రెండు టర్మ్‌లుగా ఢిల్లీలో ఆప్ పాలన కొనసాగుతోంది.

ఢిల్లీ ఎన్నికల్లో ఓటు వేసిన తొలి పురుష ఓటర్‌గా ఉమేష్ గుప్తా, తొలి మహిళా ఓటర్‌గా ప్రేరణ నిలిచారు. కరోల్ బాగ్ నియోజకవర్గంలో దర్యాన్ గంజ్ పోలింగ్ కేంద్రంలో వీరు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

గెలుపుపై ఆప్ దీమా..
తాము చేసిన సంక్షేమ కార్యక్రమాలే గెలిపిస్తాయని ఆమ్ ఆద్మీ పార్టీ ధీమాగా ఉంది. గతంలో లేనట్లుగా హాస్పిటల్స్ ను తీర్చిదిద్ది పేదలకు సైతం కార్పొరేట్ తరహా వైద్యం ఉచితంగా అందించామని మాజీ సీఎం కేజ్రీవాల్, సీఎం అతిషి చెబుతున్నారు. విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం, ఢిల్లీ ఓటర్లు తమ పక్షమే అని ఆప్ నేతలు దీమా వ్యక్తం చేశారు. మరోవైపు ఆప్ ప్రభుత్వం కుంభకోణాలు చేసిందని, స్కామ్ ల్లో ఆప్ నేతలు చిక్కుకుని జైలు పాలయ్యారని బీజేపీ నేతలు విమర్శించారు. మురికివాడలను కేజ్రీవాల్ పట్టించుకోలేదని, ఢిల్లీలో అన్ని వర్గాలకు న్యాయం బీజేపీతో సాధ్యమని కేంద్ర మంత్రులు హస్తినలో గట్టిగానే ప్రచారం చేశారు.

చివరిరోజు హోరాహోరీ ప్రచారం
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను ఆకర్షించడానికి చివరిరోజు ఢిల్లీలో 3 ర్యాలీలలో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ దేశ రాజధానిలో అదేరోజు 22 రోడ్‌షోలు, ర్యాలీలను  నిర్వహించింది. చివరిరోజు ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి చీఫ్ జెపి నడ్డా బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కస్తూర్బా నగర్, కల్కాజీ నియోజకవర్గాల్లో వేర్వేరుగా రోడ్‌షోలు నిర్వహించారు. తాము ఢిల్లీ ప్రజల మద్దతు కూడగడుతామని కాంగ్రెస్ పెద్దలు అన్నారు. 

Continues below advertisement