Rakesh Jhunjhunwala Dance: భారత స్టాక్‌ మార్కెట్‌ దిగ్గజం రాకేశ్‌ ఝున్‌ఝున్‌వాలా అకాల మరణంతో యావత్‌ భారతావని దిగ్భ్రాంతికి లోనైంది! ఈక్విటీల్లో బుడిబుడి అడుగులు వేస్తున్న యువత నుంచి ప్రముఖుల వరకు ఆయన లేరన్న వార్త విని విలపిస్తున్నారు. దేశ ఆర్థిక ప్రగతిని ఆయన ఎంత ప్రేమించారో గుర్తు చేసుకుంటున్నారు.


ప్రస్తుతం రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా వయసు 62 ఏళ్లు. ముంబయిలోని బ్రిడ్జ్ క్యాండీ హాస్పిటల్‌లో ఆదివారం (ఆగస్టు 14) ఉదయం 6.45 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు సమాచారం. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శనివారం ఆస్పత్రిలో చేరారు. బహుళ అవయవ వైఫల్యమే ఆయన మరణానికి కారణమని చెబుతున్నారు. ఆయన్ను కాపాడేందుకు వైద్య బృందం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది.




కొంత కాలంగా రాకేశ్‌ ఆరోగ్యం క్షీణించినట్టు తెలిసింది. చక్రాల కుర్చీలో నిస్సత్తువగా ఆయనిచ్చిన ఇంటర్వ్యూను చూసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఇంత బలహీనంగా ఆయన ఎప్పుడూ లేరని బాధపడ్డారు. ఇంతలోనే ఆయన అందర్నీ విడిచిపోవడంతో అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


ఆయన ఈ మధ్యే చక్రాల కుర్చీలో ఖజురారే గీతానికి స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అందులో ఝున్‌ఝున్‌వాలా ఎంతో ఉత్సాహంగా కనిపించారు. చీరను మీద వేసుకొని మరీ ఉల్లాసంగా కాళ్లు కదిపారు. దాదాపు మూడు నిమిషాల నిడివిగల ఈ వీడియోను చూడగానే ప్రతి ఒక్కరి కంటి నుంచి నీళ్లు కారుతున్నాయి. ఎన్ని కోట్లు సంపాదించినా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదని మరికొందరు గుర్తు చేసుకుంటున్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' అని నిట్టూర్పు విడుస్తున్నారు.