Economic Recovery: మన దేశంలో కన్‌జంప్షన్‌లో (వినియోగం లేదా వస్తు కొనుగోళ్లు) వృద్ధి కనిపిస్తోంది. ఇంకా సులభంగా చెప్పుకోవాలంటే, వస్తు కొనుగోళ్ల మీద జనం ఇబ్బడిముబ్బడిగా ఖర్చు పెరుడుతున్నారు. ఆహారం, పానీయాలు, దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువుల కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీలకు ఇది గుడ్ న్యూస్.
కొవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గి ఆర్థిక కార్యకలాపాలు కోలుకుంటున్న నేపథ్యంలో, దేశంలో క్రెడిట్ కార్డ్ & యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపులు బాగా పెరుగుతున్నాయి. కన్‌జంప్షన్‌లో వృద్ధికి ఇది నిదర్శనం.
RBI ప్రకటించిన సమాచారం ప్రకారం... UPI లావాదేవీలు ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.9.83 లక్షల కోట్లుగా ఉండగా, ఆగస్టులో రూ.10.73 లక్షల కోట్లకు పెరిగాయి. అంటే, 4 నెలల్లోనే UPI పేమెంట్లు రూ.లక్ష కోట్ల మేర పెరిగాయి.
రూ.29,988 కోట్లు - రూ.32,383 కోట్లు
అదేవిధంగా, PoS (పాయింట్ ఆఫ్ సేల్) టెర్మినల్ ద్వారా క్రెడిట్ కార్డ్ వ్యయాలు ఈ ఏడాది ఏప్రిల్‌లోని రూ.29,988 కోట్ల నుంచి, ఆగస్టులో రూ.32,383 కోట్లకు చేరాయి. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై క్రెడిట్ కార్డ్ ద్వారా చేసిన వ్యయాలు కూడా ఏప్రిల్‌లోని రూ.51,375 కోట్ల నుంచి ఆగస్టులో రూ.55,264 కోట్లకు పెరిగాయి.
RBI డేటాను విశ్లేషిస్తే... FY17 - FY22 మధ్య 16 శాతం CAGR వద్ద క్రెడిట్ కార్డ్‌ల ఔట్‌స్టాండింగ్ పెరిగింది. వినియోగదారులు తమ భయాల్ని వదిలేసి ఆన్‌లైన్ పేమెంట్స్‌కు మరింత ఓపెన్ అవుతున్నారని ఈ డేటా సూచిస్తోంది. దీనివల్ల, భవిష్యత్‌లోనూ ఈ తరహా లావాదేవీలు పెరిగే అవకాశం ఉంది.
కార్డ్‌లు, UPI ద్వారా చెల్లింపుల సైజ్, విలువ పెరగడం ఒక్క కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీకే కాదు, డిజిటల్ పేమెంట్స్ అందించే కంపెనీలకు కూడా లాభమే.
క్రెడిట్ కార్డ్‌ల జారీ పెరగడంతో, జనం వాటిని తెగ వాడేస్తున్నారు. గత కొన్ని నెలలుగా, క్రెడిట్ కార్డుల ద్వారా చేస్తున్న ఖర్చులు స్థిరంగా రూ.1 లక్ష కోట్లను దాటుతూ వస్తున్నాయంటే, ఏ రేంజ్‌లో జనం కార్డుల్ని వాడేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. వినియోగదారుల్లో కనిపిస్తున్న బలమైన కన్‌జంప్షన్‌కు ఇది గుర్తు.
పండుగ సీజన్‌పై మరిన్ని అంచనాలు
పండుగల సీజన్‌లోని ఆఫర్ల కోసం కూడా కూడా కోట్లాది మంది వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. కాబట్టి, త్వరలో లావాదేవీలు మరింత పెరుగుతాయన్న అంచనాలున్నాయి. ముఖ్యంగా... టైర్-II & III పట్టణాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ప్రస్తుత పండుగ సీజన్‌లో UPI పేమెంట్లు మరింత విజృంభించవచ్చు.
డిజిటల్ లావాదేవీలను ప్రభుత్వం ప్రోత్సహించడం, ప్రజల ఆదాయం & స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం పెరగడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ మెరుగుదల వంటివి ఆన్‌లైన్ చెల్లింపుల వృద్ధికి సహాయపడుతున్నాయి. అంతేకాదు, ఎక్కువ మంది వ్యాపారులు కూడా డిజిటల్ చెల్లింపులను అంగీకరిస్తున్నారు, అందుకు కావల్సిన ఏర్పాట్లను తమ స్టోర్లు, దుకాణాల్లో ఏర్పాటు చేసుకున్నారు.
ప్రయాణ పరిమితుల సడలింపుల వల్ల.. ప్రయాణాలు, వినోదం, రెస్టారెంట్ వంటి కేటగిరీల మీద క్రెడిట్ కార్డ్‌ల ద్వారా చేసే చెల్లింపులు పెరిగాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.