PhonePe's Ecommerce App: ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపడం, స్వీకరించడమే కాదు.. వస్తువులను కూడా ఆర్డర్ పెట్టొచ్చు. కాకపోతే, దీనికి వేరే యాప్‌ను ఫోన్‌పే డిజైన్ చేసింది. కొత్త యాప్ పేరు 'పిన్‌కోడ్' (Pincode).
చెల్లింపుల వ్యాపారం చేస్తున్న ఫోన్‌పే, కొత్తగా ఈ-కామర్స్ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందుకోసం 'పిన్‌కోడ్' యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం సృష్టించిన ONDC (open network for digital commerce) నెట్‌వర్క్ ద్వారా ఈ యాప్ పని చేస్తుంది.
మంగళవారం (04 ఏప్రిల్ 2023) నాడు పిన్‌కోడ్ యాప్‌ను ఫోన్‌పే లాంచ్ చేసింది. ప్రస్తుతానికి ఇది బెంగళూరుకే పరిమితం. బెంగళూరు సిటీలోని స్టోర్‌లను, వినియోగదార్లను ఈ యాప్ అనుసంధానిస్తుంది. అంటే, బెంగళూరులో నివాసం ఉండే వ్యక్తులు ఈ యాప్ ద్వారా అదే నగరం దొరికే వస్తువులను ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్ చేయవచ్చు. హైపర్ లోకల్ ఈ-కామర్స్ ఫ్లాట్‌ఫామ్‌గా ఇది పని చేస్తుంది.
ఆరు కేటగిరీల్లో 'పిన్‌కోడ్' సేవలు
పిన్‌కోడ్ ద్వారా కిరాణా, ఆహారం, ఫార్మసీ, గృహాలంకరణ, ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్ కేటగిరీల్లోని ఉత్పత్తులను ఆర్డర్ చేయవచ్చు. ఈ కేటగిరీల్లో కొన్ని వేల మంది వ్యాపారులతో పిన్‌కోడ్ ప్రారంభమైంది.
ప్రస్తుతం, పిన్‌కోడ్‌కు రోజుకు 1,000 వరకు ఆర్డర్‌లు వస్తున్నట్లు తెలుస్తోంది.
బెంగళూరులో రోజుకు 10,000 లావాదేవీలు దాటితే, అప్పుడు ఈ యాప్ సేవలను ఇతర నగరాలకు కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నారు. అయితే, అప్పుడు కూడా ఇంటర్-సిటీ డెలివెరీలు ఉండవు, బెంగళూరు మోడల్‌లోనే పని చేస్తుంది. అంటే, ఏ నగరంలో యాప్‌ను లాంచ్ చేస్తే, ఆ నగరం పరిధిలో మాత్రమే సేవలను అందిస్తుంది తప్ప, ఒక నగరం నుంచి మరో నగరానికి ఉత్పత్తులను డెలివెరీ చేయదు.
"భారతదేశంలోని ఫిజికల్ షాపులను ఎవరైనా డిజిటలైజ్ చేయవచ్చని మేం నిరూపించాలనుకుంటున్నాం. తన కస్టమర్‌లతో మాట్లాడటానికి షాప్ ఓనర్లకు ఒక వేదికను పిన్‌కోడ్ ఏర్పాటు చేస్తుంది" అని ఫోన్‌పే కో-ఫౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సమీర్ నిగమ్ చెప్పారు. "అందుకే ఇది హైపర్ లోకల్ స్ట్రాటజీ" అని అన్నారు.
డిసెంబర్ నాటికి లక్ష టార్గెట్
ఈ ఏడాది చివరి నాటికి, పిన్‌కోడ్ యాప్ ద్వారా రోజుకు లక్ష లావాదేవీలను లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిగమ్ వివరించారు.
ONDCలో తాము సెల్లర్ ప్లాట్‌ఫామ్‌గా ఉండబోమని, కొనుగోలుదార్ల మీద దృష్టి పెడతామని నిగమ్ చెప్పారు. ఆర్డర్ నిర్వహణ వంటి సెల్లర్ పనుల్లో తాము జోక్యం చేసుకునేది లేదని అన్నారు.
ONDC 'డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్' ఏర్పాటు చేసిన లాభాపేక్ష రహిత నెట్‌వర్క్ ONDC. ఈ నెట్‌వర్క్ ఆధారిత యాప్‌ల ద్వారా స్థానిక సంస్ధలు తమ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో అమ్ముకోవచ్చు. పోటీ ధరల కారణంగా వినియోగదార్లకు కూడా ONDC చాలా ఉపయోగపడుతుంది.
ఈ-కామర్స్ మీద సీరియస్‌గా ఫోకస్
ఈ-కామర్స్ బిజినెస్ అనేది ఫోన్‌పే జీన్స్‌లోనే ఉంది. ఎందుకంటే, గత మాతృ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నుంచి ఈ కంపెనీ విడిపోయింది. పూర్వ వాసనలు కొనసాగిస్తూ, ఈ-కామర్స్ బిజినెస్‌లోకి ఈ కంపెనీ అడుగు పెట్టింది. పిన్‌కోడ్ కోసం $10-15 మిలియన్ల పెట్టుబడులను కేటాయించింది. సాధారణంగా, ఒక కొత్త వ్యాపారానికి ఈ స్థాయి మూలధనం అవసరం.
ఈ-కామర్స్ అనేది అధిక మార్జిన్ ఇచ్చే వ్యాపారమని, దీర్ఘకాలంలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించగల సామర్థ్యం ఉందని నిగమ్ చెబుతున్నారు. దీంతో పోలిస్తే, చెల్లింపుల వ్యాపారం నుంచి తక్కువ మార్జిన్ వస్తుంది. ఈ వ్యాఖ్యలు, పెట్టుబడి మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ-కామర్స్ బిజినెస్ మీద ఫోన్‌పే సీరియస్‌గా దృష్టి పెట్టిందని అర్ధం చేసుకోవచ్చు.
అంతేకాదు, బీమా, స్టాక్ బ్రోకింగ్, పెట్టుబడులు వంటి ఆఫర్‌లతో ఆర్థిక సేవల సంస్థగా కూడా ఫోన్‌పే మారుతోంది. ఈ వ్యాపార లైసెన్స్‌ల కోసం దరఖాస్తు కూడా చేసింది. ప్రస్తుతానికి... వాల్‌మార్ట్, జనరల్ అట్లాంటిక్ సహా ఇతర ప్రముఖ పెట్టుబడిదార్ల నుంచి $1 బిలియన్ నిధులను సేకరించే పనిలో ఫోన్‌పే ఉంది, త్వరలోనే ఈ రౌండ్ క్లోజ్ కావచ్చు.
ONDC నెట్‌వర్క్‌లో, ఫేన్‌పో కంటే ముందు పేటీఎం, మైస్టోర్, క్రాఫ్ట్స్‌విల్లా, స్పైస్ మనీ, మీషో కూడా యాప్స్ ఓపెన్ చేశాయి.