బండి సంజయ్‌పై పోలీసులు 420, ఐపీసీ, 4(ఏ), 6 మాల్ ప్రాక్టీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బుధవారం (ఏప్రిల్ 5) యాదాద్రి జిల్లా బొమ్మల రామారం పోలీస్ స్టేషన్‌లో ఉన్న బండి సంజయ్‌ను భారీ కాన్వాయ్ మధ్య జాతీయ రహదారి మీదుగా వరంగల్ వైపు తీసుకొని వెళ్లారు. ఆయన్ను భువనగిరి కోర్టుకు తరలిస్తారని భావించారు. ఈ తరలించే క్రమంలో కేసు వరంగల్ జిల్లా పరిధిలో ఉండటంతో ఆలేరు మీదుగా జనగామ జిల్లాలోకి ప్రవేశించారు. జిల్లా సరిహద్దుల దగ్గర బండి సంజయ్ ను యాదాద్రి పోలీసులు వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు.


జనగామ దగ్గర వరంగల్ జిల్లా పోలీస్ వాహనాల్లోకి బండి సంజయ్ ను మార్చారు. బండి సంజయ్ ను వాహనాలు మారుస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ నుంచి బీజేపీ కార్యకర్తలు బండి సంజయ్‌ను పోలీసులు తీసుకు వెళ్తున్న వాహనాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. ఎక్కడికక్కడ నేతలు అడ్డుతగిలారు. వారిని తికమక చేసేందుకు బండి సంజయ్ ఏ వాహనంలో ఉన్నారో తెలియకుండా ఆయన్ను వేర్వేరు కార్లలోకి మారుస్తూ వచ్చారు. బండి సంజయ్ కనిపించకుండా అద్దాలకు పేపర్లు అడ్డుగా పెట్టారు.


పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు


బండి సంజయ్ వరంగల్ జిల్లా పోలీసుల అదుపులోకి వచ్చాక, ఆయనకు జనగామ జిల్లా పాలకుర్తి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఆయన్ను వర్ధన్నపేట మీదుగా హనుమకొండ తరలించారు.