Petrol, Diesel Sales: పెరిగిన చమురు ధరలు చేతి చమురు వదిలిస్తుండటంతో కస్టమర్లకు ఏం చేయాలో తోచడం లేదు! ఈ ధరాభారం నుంచి తప్పించుకొనేందుకు పెట్రోలు, డీజిల్‌ వాడటం మానేస్తున్నారు! ఏప్రిల్‌ నెల ప్రథమార్ధంలో డిమాండ్‌ తగ్గిపోవడమే ఇందుకు నిదర్శనం. పెట్రోలు విక్రయాలు 10 శాతం తగ్గితే, డీజిల్‌ డిమాండ్‌ 15.6 శాతం తగ్గిపోయింది. వంట గ్యాస్‌ డిమాండూ తగ్గిపోవడం గమనార్హం.


కరోనా మహమ్మారి సమయంలోనూ వంటగ్యాస్‌ డిమాండ్‌ తగ్గలేదు. అలాంటిది ఏప్రిల్‌ నెల ఆరంభం నుంచి ఇప్పటి వరకు 1.7 శాతం విక్రయాలు తగ్గిపోయాయి. క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 30 డాలర్లు ఉన్నప్పుడు మార్చి 22 వరకు 137 రోజుల పాటు గ్యాస్‌ ధరలు పెంచలేదు. ఒకవైపు ఎన్నికలు ముగియడం, మరోవైపు రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం ఆరంభం కావడంతో చమురు ధరలు ఒక్కసారిగా కొండెక్కాయి. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 6 మధ్యనే లీటర్‌ పెట్రోలు ధర రూ.10 వరకు పెరిగింది. చమురు ధరలను డీరెగ్యులేట్‌ చేశాక 16 రోజుల్లోనే ఇంత ధర పెరగడం ఇదే తొలిసారి. మార్చి 22న కుకింగ్‌ గ్యాస్‌ రూ.50 పెంచడంతో సిలిండర్ ధర రూ.945కు చేరుకుంది.


జెట్‌ ఫ్యూయల్‌ ధరలూ ఆల్‌టైం హైకు చేరుకున్నాయి. కిలో లీటర్ ధర రూ.1,13,202గా ఉంది. దాంతో ప్రతి నెలా జెట్‌ ఫ్యూయల్‌ అమ్మకాలు 20.5 శాతం తగ్గిపోతాయి. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే  ఆయిల్‌ డీలర్లు, ప్రజలు మార్చి తొలి రెండు వారాల్లో తమ ట్యాంకులు నింపించుకున్నారు. దాదాపుగా భారత మార్కెట్లో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు 90 శాతం వాటా ఉంది. కాగా ఏప్రిల్‌ 1-15 మధ్య 1.12 మిలియన్‌ టన్నుల చమురు అమ్మగా గతేడాది ఇదే సమయంతో పోలిస్తే ఇది 12.1శాతం పెరగడం గమనార్హం. 2019 నుంచి పోలిస్తే 19.6 శాతం పెరుగుదల.


2022 మార్చిలో 1.24 మిలియన్‌ టన్నుల విక్రయాలతో పోలిస్తే ఇప్పుడు 9.7 శాతం తక్కువగా అమ్మకాలు ఉన్నాయి. అయితే డీజిల్‌ విక్రయాలు మాత్రం 7.4 శాతం పెరిగి 3 మిలియన్‌ టన్నులకు పెరిగింది. మార్చి 2019తో పోలిస్తే ఇది 4.8 శాతం పెరుగుదల. మార్చిలోనే ధరల పెరుగుదల భయంతో ప్రజలు, పెట్రోల్‌ బంకులు ఎక్కువ పెట్రోలు, డీజిల్‌ కొనుగోలు చేయడంతో ఏప్రిల్‌ నెలలో విక్రయాలు తగ్గేందుకు ఒక కారణంగా చెబుతున్నారు.


Also Read: ట్విటర్‌ ఎందుకుగానీ! ఆ అప్పులు తీర్చేసి శ్రీలంకను కొనేయొచ్చుగా మస్క్‌!