Elon Musk Twitter Bid: టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ (Elon Musk) ట్విటర్‌ (Twitter) కొనుగోలు ప్రతిపాదనపై ఇంటర్నెట్లో మీమ్స్‌ వెల్లువెత్తుతున్నాయి. చాలామంది అతడి ఆఫర్‌పై జోకులు వేస్తున్నారు. అదే సమయంలో కొంతమంది అతడు శ్రీలంక (Sri Lanka) అప్పులు తీర్చి 'సిలోన్‌ మస్క్‌'గా పేరు తెచ్చుకుంటే బాగుంటుందని అంటున్నారు.


ప్రస్తుతం శ్రీలంక దివాలా తీసింది. అక్కడి ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అయింది. ఆహార ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ అప్పులు తీర్చేందుకు ఏం చేయాలో తెలియక అక్కడి నాయకులు తిప్పలు పడుతున్నారు. లంక ముంగిట 51 బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పు ఉంది. ఇదే సమయంలో 43 బిలియన్‌ డాలర్లు పెట్టి సోషల్‌ మీడియా (Social Media) ప్లాట్‌ఫామ్‌ కొంటానని మస్క్‌ ఆఫర్‌ ఇచ్చారు. అతడిచ్చిన ఆఫర్‌ విలువ శ్రీలంక అప్పులతో సరితూగుతుండటంతో నెటిజన్లు ఇలా పోస్టులు పెడుతున్నారు.




'ఎలన్‌ మస్క్‌ ట్విటర్‌ బిడ్‌ -43 బిలియన్‌ డాలర్లు. శ్రీలంక అప్పులు - 45 బిలియన్‌ డాలర్లు. అతడు శ్రీలంకను కొని సిలోన్‌ మస్క్‌గా పేరు తెచ్చుకోవచ్చు' అని స్నాప్‌డీల్‌ సీఈవో కునాల్‌ భాల్‌ ట్వీట్‌ చేశారు. మరికొందరూ అదేరీతిలో ట్వీట్లు చేశారు.


ట్విటర్‌ను తనకు అమ్మేందుకు ఓ బెస్ట్‌, ఫైనల్‌ డీల్‌ ఎలన్‌ మస్క్‌ గురువారం ప్రతిపాదించారు. ఒక్కో షేరుకు 54.20 డాలర్లు చెల్లించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎలన్‌ మస్క్‌ అన్నారు. జనవరి 28 ముగింపు ధరతో పోలిస్తే 54 శాతం ప్రీమియం చెల్లిస్తానని పేర్కొన్నారు. అప్పటికి ఆ షేరు ధరను విలువ కడితే 43 బిలియన్‌ డాలర్లు అవుతోంది. అప్పట్నుంచి ఈ సోషల్‌ మీడియా కంపెనీ షేరు 18 శాతం పెరిగింది.




గురువారం రోజు ఎలన్‌ మస్క్‌ ఈ ఆఫర్‌ను అమెరికా సెక్యూరిటీ, ఎక్స్‌ఛేంజ్‌ కమిషన్‌ వద్ద దాఖలు చేశారు. ఇప్పటికే ఆ కంపెనీలో మస్క్‌కు 9 శాతం వాటా ఉంది. ఏప్రిల్‌ 4న తొలిసారి ఈ విషయాన్ని ఆయన ప్రకటించారు.


టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటారు. ట్విటర్లో ఎక్కువగా తన అభిప్రాయాలను వెల్లడిస్తుంటారు. ఆయనకు ఈ వేదికలో 80 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ట్విటర్లో చేయాల్సిన మార్పులపై ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు మాట్లాడారు. వాటా ఉందని తెలియడంతో కంపెనీ ఆయన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ పదవిని ఆఫర్‌ చేసింది. దాంతో ఆయన లార్జెస్ట్‌ ఇండివిజ్యువల్‌ షేర్‌ హోల్డర్‌గా మారారు.


తన వాటా గురించి బయటకు తెలియగానే మస్క్‌ ఎన్నో ప్రతిపాదనలు చేశారు. మున్ముందు ఎలాంటి మార్పులు అవసరమో వెల్లడించారు. సాన్‌ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం, ట్వీట్లకు ఎడిట్‌ బటన్‌ ఇవ్వడం, ప్రీమియం యూజర్లకు ఆటోమేటిక్‌గా వెరిఫికేషన్‌ మార్క్స్‌ ఇవ్వడం గురించి మాట్లాడారు. చాలా అరుదగా ట్వీట్‌ చేసే ఎక్కువ ఫాలోవర్లు ఉన్న సెలెబ్రిటీల వల్ల ట్విటర్‌ చనిపోయే ప్రమాదం ఉందనీ ఆయన హెచ్చరించారు.


బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్‌ ఇండెక్స్‌ ప్రకారం ఎలన్‌ మస్క్‌ సంపద 260 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దాంతో ఆయన సులభంగా ట్విటర్‌ను కొనుగోలు చేయగలరు. ఎందుకంటే ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం ట్విటర్‌ విలువ 37 బిలియన్‌ డాలర్లు మాత్రమే.