Zomato Increasing Investments In Blinkit: భారత స్టాక్ మార్కెట్ లిస్టయిన ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో షేర్లు పతనాన్ని కొనసాగిస్తున్నాయి. గత నెల రోజుల్లో ఈ కంపెనీ షేర్లు 25 శాతానికి పైగా పడిపోయాయి. వాస్తవానికి, 2024 డిసెంబర్ త్రైమాసికానికి జొమాటో డెలివెరీ చేసిన ఆర్థిక ఫలితాలు పెట్టుబడిదారులకు రుచించలేదు. Q3 FY25 ఫలితాల ప్రకారం, జొమాటో ఆదాయం 13 శాతం పెరగగా, లాభంలో 66 శాతం క్షీణత నమోదైంది. అప్పటి నుంచి షేర్లలో భారీ పతనం ప్రారంభమైంది. అయినప్పటికీ, ఈ కంపెనీ షేర్ ధరల్లో క్షీణతను మరచిపోతోంది, తన క్విక్-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌లో భారీగా పెట్టుబడి పెడుతోంది. జొమాటో ఇలా చేయడం వెనుక ప్రత్యేక వ్యూహం ఉందా?
బ్లింకిట్‌లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు
బ్లింకిట్ విస్తరణ ద్వారా, జొమాటో తన డార్క్ స్టోర్‌ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 526 నుంచి 1,000కి పెంచాలని, 2025 మార్చి నాటికి దీనిని సాధించాలని యోచిస్తోంది. జొమాటో 'గ్రాస్ ఆర్డర్ వాల్యూ' (GOV) వార్షిక ప్రాతిపదికన 120 శాతం & త్రైమాసిక ప్రాతిపదికన 27 శాతం పెరిగింది. అయితే, బ్లింకిట్ వ్యాపార విస్తరణ కోసం దూకుడుగా వ్యవహరిస్తుండడం & మార్కెట్‌లో పెరుగుతున్న పోటీ కారణంగా, దాని 'ఎబిటా' (EBITDA) నష్టం రూ. 103 కోట్లకు పెరిగింది, ఇది క్రితం త్రైమాసికంలో రూ. 8 కోట్లు మాత్రమే.
జొమాటో త్రైమాసిక 'ఎబిటా మార్జిన్' (EBITDA Margin) కూడా 2024 సెప్టెంబర్ త్రైమాసికంలోని 9 శాతం నుంచి డిసెంబర్ త్రైమాసికంలో 7.6 శాతానికి తగ్గింది. అదే సమయంలో, ఫుడ్ డెలివరీ వ్యాపారం నుంచి జొమాటో సర్దుబాటు చేసిన ఎబిటా రూ. 423 కోట్లు, ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే 82 శాతం ఎక్కువ. బ్లింకిట్ రూపంలో పెరుగుతున్న ఖర్చులు జొమాటో ఆర్థిక ఆరోగ్యంపై ఒత్తిడి తెస్తున్నాయి.
జొమాటో షేర్లలో భారీ పతనం
నష్టాలు వచ్చినప్పటికీ బ్లింకిట్‌లోకి పెట్టుబడులను పంప్ చేస్తుండడంతో జొమాటో ఇన్వెస్టర్లలో గందరగోళం నెలకొంది. ఈ కారణంగా, నెల రోజుల వ్యవధిలో జొమాటో షేర్ ధర 23 శాతం పతనమైంది. దీనితో పోలిస్తే, అదే కాలంలో, నిఫ్టీ50 సూచీ 2.3 శాతం క్షీణించింది.
కంపెనీ వ్యూహం ఏంటి?
బ్లింకిట్‌లో పెట్టుబడుల విస్తరణ అనేది బాగా ఆలోచించిన వ్యూహమని కంపెనీ సీఈవో దీపిందర్ గోయల్ (Zomato CEO Deepinder Goyal) స్పష్టం చేశారు. భవిష్యత్ త్రైమాసికాల్లోనూ ఆ పెట్టుబడులను కొనసాగిస్తామన్నారు. డిసెంబర్ 2025 నాటికి 2,000 డార్క్ స్టోర్‌లను కలిగి ఉండడం తమ లక్ష్యంగా చెప్పారు. గతంలో, ఈ డిసెంబర్ 2026 నాటికి ఈ టార్గెట్ పెట్టుకున్నారు.
జొమాటో దీర్ఘకాలిక వ్యూహం భారతీయ మార్కెట్లో విజయం సాధిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే, సమీప భవిష్యత్తులో అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: లిస్టింగ్ రోజే బిగ్ షాక్ ఇచ్చిన ఐటీసీ హోటల్స్ - ఇన్వెస్టర్లకు నిద్ర పడుతుందా?