RBI Big Action To Increase Liquidity: ప్రజల చేతిలో డబ్బు లేకపోవడం వల్ల వినియోగం తగ్గుతోంది. దీంతో వినియోగ మార్కెట్లు ఈగలు తోలుకుంటున్నాయి, కంపెనీల లాభాలు తగ్గుతున్నాయి. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్‌పై పడుతోంది. విదేశీ ఇన్వెస్టర్లు తమ డబ్బును ఉపసంహరించుకోవడంతోపాటు డాలర్‌తో పోలిస్తే రూపాయి బలహీనపడుతోంది. వీటికి, మన కంపెనీల నిరాశాజనక ఆర్థిక ఫలితాలు తోడవుతున్నాయి. దీంతో మొత్తంగా భారత ఆర్థిక వ్యవస్థ నష్టాలను చవిచూస్తోంది. ఈ సవాళ్లన్నింటినీ ఎదుర్కోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఒక ప్లాన్ ఆలోచించింది. ఒకే దెబ్బకు అనేక పిట్టలు కొట్టాలని నిర్ణయించింది. మార్కెట్‌లో డబ్బు లభ్యతను (Liquidity) పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ రూ. 1.5 లక్షల కోట్లను మార్కెట్‌లోకి పంపనుంది. ఈ డబ్బు వివిధ బ్యాంక్‌ల ద్వారా లోన్‌ల రూపంలో చేతుల్లోకి వస్తుంది. జనం చేతిలో డబ్బు ఉంటే వస్తు & సేవల క్రయవిక్రయాలు (వినియోగం) పెరుగుతాయి. అప్పుడు కార్పొరేట్ కంపెనీల ఆదాయాలు & లాభాలు పెరుగుతాయి. కార్పొరేట్ ఫలితాలు బాగుంటే స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతుంది. ఈ పరిణామాలన్నింటి ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ లాభపడుతుంది.
మార్కెట్‌లో లిక్విడిటీ పెంచడానికి రిజర్వ్ బ్యాంక్ ప్లాన్ ఇదీ...
ఈ ప్లాన్ కింద.. ప్రభుత్వ సెక్యూరిటీలను తిరిగి కొనుగోలు చేయడం (Buyback) ద్వారా ద్రవ్య మార్కెట్‌లోకి డబ్బును పంపుతుంది. మరోవైపు, డాలర్లను విక్రయించడం ద్వారా, నిరంతరం బలహీనపడుతున్న రూపాయిని సంక్షోభం నుంచి బయటపడేందుకు దారి చూపిస్తుంది. ఫిబ్రవరిలో జరగనున్న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య విధాన సమావేశంలో (RBI MPC) రెపో రేట్ తగ్గింపు కూడా ఈ ప్లాన్‌లో భాగంగా ఉండవచ్చు. ఓవరాల్‌గా చూస్తే, భారతదేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం & మార్కెట్‌లో ద్రవ్య చలామణీని ప్రోత్సహించడం ఈ స్కీమ్ లక్ష్యం.
మూడు దశల్లో రూ. 60 వేల విలువైన బాండ్ల బైబ్యాక్
లిక్విడిటీని పెంచేందుకు రిజర్వ్ బ్యాంక్ మూడు దశల్లో రూ. 60,000 కోట్ల విలువైన బాండ్లను బైబ్యాక్ చేస్తుంది. ఒక్కో దశలో రూ. 20,000 కోట్ల ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ (Open market operation - OMO) ఉంటుంది. ఇందుకోసం జనవరి 30, ఫిబ్రవరి 13, ఫిబ్రవరి 20 తేదీలను ఖరారు చేసింది. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ అనేది రిజర్వ్ బ్యాంక్ ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులను కొనుగోలు చేసే & విక్రయించే పద్ధతి. ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరాను నియంత్రించడానికి RBI ఇలా చేస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యతను ఏడాది పొడవునా నియంత్రించే పద్ధతి ఇది.
OMO కాకుండా, ఫిబ్రవరి 07న, 56 రోజుల కాల పరిమితితో వేరియబుల్ రెపో రేట్‌తో (VRR) రూ. 50,000 కోట్ల విలువైన రెపోను వేలం వేయనుంది. ఇంకా... యూఎస్ డాలర్/భారతీయ రూపాయి (USD/INR) స్వాప్ ఆక్షన్ రూపంలో 5 బిలియన్ డాలర్లు ఉన్నాయి. దీని ద్వారా రూ. 43,000 కోట్లు బ్యాంకింగ్ వ్యవస్థలోకి చొప్పిస్తుంది. స్వాపింగ్ కాల పరిమితి ఆరు నెలలు. ఈ ప్రక్రియలో, నెలల్లో ఐదు బిలియన్ డాలర్ల విలువైన రూపాయిలు & డాలర్లను చేతులు మారుస్తుంది.
ఇటీవల, ప్రైవేట్ బ్యాంకుల అధిపతులతో జరిగిన సమావేశంలో, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడం & ఆర్థిక చేరికలను పెంచడం వంటి కార్యక్రమాలపై ప్రధానంగా మాట్లాడారు.
ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో లిక్విడిటీ లోటు రూ.3.13 లక్షల కోట్లకు చేరింది.
మరో ఆసక్తికర కథనం: మీ బ్యాంక్ లోన్ EMI కచ్చితంగా తగ్గుతుంది - మీరు ఈ పనిని చేస్తే చాలు!