ITC Hotels Shares Listing Price: ఐటీసీ నుంచి విడిపోయిన హోటల్ వ్యాపార సంస్థ ITC హోటల్స్ (ITC Hotels Demerger), స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో నిరుత్సాహకరంగా లిస్ట్ అయింది, ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చింది. ఐటీసీ హోటల్స్ స్టాక్ రూ. 188 వద్ద లిస్ట్ కాగా, ఆ తర్వాత షేర్ ధర రూ. 178.60కి పడిపోయింది. ఒక దశలో ఇది లోయర్ సర్క్యూట్‌లోకి జారిపోయింది. ఈ వార్త రాసే సమయానికి, ఈ షేర్ ప్రైస్ 4.26 శాతం క్షీణతతో రూ. 180 వద్ద ట్రేడవుతోంది. జనవరి 06, 2025న ITC నుంచి విభజన తర్వాత, ITC హోటల్స్ షేర్ ధరను కనుగొనడం (Share price discovery) కోసం నిర్వహించిన ప్రత్యేక ప్రి-ఓపెన్ ట్రేడింగ్ సెషన్ ముగింపులో, ITC హోటల్స్ స్టాక్ ధర రూ. 270 వద్ద నిలబడింది.
ITC హోటల్స్ స్టాక్, ఈ రోజు (బుధవారం, 29 జనవరి 2025) స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అయింది. ఇది, బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE)లో రూ. 188 వద్ద, నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE)లో రూ.180 వద్ద నమోదైంది. ఐటీసీ హోటల్స్‌ను దాని మాతృ సంస్థ ITC నుంచి వేరు చేసిన తర్వాత, ITC షేర్లను కలిగి ఉన్న పెట్టుబడిదారులకు, ప్రతి 10 ITC షేర్లకు బదులుగా ఒక ITC హోటల్స్ షేర్‌ను జారీ చేశారు.
ఐటీసీ గ్రూప్ నుంచి హోటల్ వ్యాపారాన్ని విడదీయాలని ITC 2023 సంవత్సరంలో నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల, ITC వాటాదారులకు వాల్యూ అన్‌లాక్ అవుతుంది. ఈ విభజన పథకం కింద, ITC ఇన్వెస్టర్లు & షేర్‌హోల్డర్లకు 1:10 నిష్పత్తిలో ITC హోటల్స్ షేర్లు ఇచ్చారు. ఐటీసీ హోటల్స్ షేర్లను జారీ చేయడానికి 06 జనవరి 2025ను రికార్డ్ డేట్‌గా నిర్ణయించారు. కొన్ని రోజుల తర్వాత, ITC హోటల్స్ షేర్లను 1:10 నిష్పత్తి ప్రకారం అర్హులైన పెట్టుబడిదారుల డీమ్యాట్ ఖాతాలకు క్రెడిట్ చేశారు. ITC నుంచి విభజన తర్వాత ITC హోటల్స్ షేర్ ధర ఆవిష్కరణ కోసం 06 జనవరి 2025న ప్రత్యేక ప్రీ-ఓపెన్ ట్రేడింగ్ సెషన్‌ను స్టాక్ ఎక్సేంజ్‌లు నిర్వహించాయి.
ITC హోటల్స్ విభజన 01 జనవరి 2025 నుంచి అమలులోకి వచ్చింది. ఐటీసీ హోటల్స్‌లో ఐటీసీకి 40 శాతం వాటా ఉంటుంది. మిగిలిన 60 శాతం వాటాను షేర్‌హోల్డర్లకు బదిలీ చేశారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: పాత పన్ను విధానాన్ని రద్దు చేస్తారా? - దీని గురించి ఎందుకు చర్చిస్తున్నారు!