Hindustan Zinc: దేశంలో ప్రస్తుతం లిస్టెడ్ కార్పొరేట్ కంపెనీలు వరుసగా తమ ఆర్థిక ఫలితాలను ప్రకటిస్తున్నాయి. దీంతో మార్కెట్లలో గత కొన్ని రోజులుగా క్యూ4 ఫలితాల కోలాహలం కొనసాగుతోంది. మార్కెట్లను నడిపించటంలో కంపెనీల లాభాల ప్రకటనలు సైతం కీలకంగా మారాయి. కొన్ని కంపెనీలు డివిడెండ్, బోనస్ షేర్లు ప్రకటిస్తూ తమ ఇన్వెస్టర్లను ధనవంతులుగా మార్చేస్తున్నాయి.


ఇప్పుడు మనం చూస్తున్నది మైనింగ్ కింగ్ అనిల్ అగర్వాల్ నేతృత్వంలో కొనసాగుతున్న హిందుస్థాన్ జింక్ కంపెనీ గురించే. వరుసగా స్టాక్ 7వ ట్రేడింగ్ రోజున తన ఇన్వెస్టర్లను లాభాల్లో ముంచేసింది. అయితే స్టాక్ వరుస పెరుగుదల, రాకెట్ దూకుడుకు కారణం చాలా మందికి తెలియదు. వారాంతంలో మార్కెట్లు భారీ క్షీణతకు గురైనప్పటికీ హిందుస్థాన్ జింక్ మాత్రం తన ర్యాలీని కొనసాగిస్తూనే ఉంది. ఇంట్రాడేలో నేడు స్టాక్ దాదాపు 7 శాతం లాభపడి రూ.464 స్థాయికి చేరుకుంది. ఇది స్టాక్ సరికొత్త 52 వారాల గరిష్ఠ ధర కావటం గమనార్హం. ఈ స్టాక్ 2024లో ఇప్పటివరకు దాదాపు 44 శాతం లాభపడింది.


తాజాగా మైనింగ్ కంపెనీ తన ఇన్వెస్టర్లకు డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. అయితే డివిడెండ్ ప్రకటన మే 7న ఉండగా.. ఇందుకోసం రికార్డు తేదీని కంపెనీ మే 15గా ప్రకటించింది. ఈ వివరాలను స్టాక్ మార్కెట్ ఫైలింగ్స్‌లో వెల్లడించింది. ఈ క్రమంలోనే 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఈక్విటీ షేర్లపై మధ్యంతర డివిడెండ్‌ నిర్ణయం కోసం బోర్డు డైరెక్టర్లు మే 7న సమావేశం కానున్నారు. వాస్తవానికి కంపెనీ 2024 ఆర్థిక సంవత్సరంలో రెండుసార్లు డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనికి ముందు డిసెంబరులో అర్హత కలిగిన ఇన్వెస్టర్లకు ఒక్కో షేరుపై కంపెనీ రూ.6 చొప్పున డివిడెండ్ చెల్లించింది. అలాగే 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు ఏకంగా రూ.75.50 ఫైనల్ డివిడెండ్ ప్రకటించి ఇన్వెస్టర్లను ధనవంతలు చేసేసింది. డివిడెండ్ ఆదాయం కోసం షేర్లను హోల్డ్ చేస్తున్న చాలా మంది కంపెనీ ప్రకటనతో గత ఆర్థిక సంవత్సరంలో మంచి రాబడులను అందుకున్నారు.


ఇక కంపెనీ ఆర్థిక పనితీరును గమనిస్తే.. మార్చితో ముగిసిన త్రైమాసికంలో వేదాంత గ్రూప్ కంపెనీ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ లాభాలు ఏడాదికి 21 శాతం క్షీణతను నమోదు చేసింది. వాస్తవానికి దీనికి నెమ్మదిగా కొనసాగుతున్న డిమాండ్ పెరుగుదల కారణంగా ఉంది. సరఫరా పేరిగినంత వేగంగా డిమాండ్ మార్కెట్లో పెరగటం లేదని కంపెనీ తన ఆర్థిక ఫలితాల ప్రకటనలో పేర్కొంది. దీంతో కంపెనీ నికర లాభం క్యూ4లో రూ.2,038 కోట్లుగా ఉండగా ఆదాయం రూ.7,285 కోట్లుగా నమోదైంది. ఈ క్రమంలో ఆదాయం సైతం 12 శాతం క్షీణతను చవిచూసింది. ఇదిలా ఉండగా కంపెనీలో 29.54 వాటాతో మైనారిటీ ఇన్వెస్టర్ గా కొనసాగుతున్న భారత ప్రభుత్వం కంపెనీలోని తన పెట్టుబడులను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించాలని చూస్తోంది. అయితే భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుందోనని కంపెనీలోని ఇన్వెస్టర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.