EV Sales in India: భారత ప్రభుత్వం రానున్న కాలంలో కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు అనుగుణంగా ఎలక్ట్రిక్ వాహనాలను దేశంలో ప్రమోట్ చేస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గతంలో రాబోయే 5 ఏళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ వాహనాలు పెద్దగా కనిపించవని పేర్కొన్నారు. దీనిని ప్రోత్సహించేందుకు కంపెనీలకు ఫేమ్ పథకం కింద కేంద్రం పలు ప్రోత్సాహకాలను సైతం ఇప్పటికే అందించింది. దీంతో ఈవీల వైపు మెుగ్గుచూపుతున్న వారి సంఖ్య దేశంలో గణనీయంగా పెరిగింది.


ఏప్రిల్ 2024లో పెరిగిన ధరలు, తగ్గిన అమ్మకాలు 
అయితే ఈ గ్రోత్ స్టోరీ మెుత్తం మార్చితో ముగిన గత ఆర్థిక సంవత్సరంలో వినిపించింది. అయితే ఏప్రిల్ 2024 డేటా గమనిస్తే.. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల అమ్మకాలు గణనీయంగా తగ్గింపోతున్నట్లు వెల్లడించింది. దీనిపై పరిశ్రమవర్గాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనికి ముందు మార్చి 2024లో ఈవీ కంపెనీలు రికార్డు స్థాయిలో టూవీలర్లను విక్రయించినట్లు డేటా చెబుతోంది. అయితే ఒక్కసారిగా అమ్మకాలు పడివోటవానికి కారణాలను పరిశీలిస్తే.. ప్రభుత్వం ఫేమ్ పథకం కింద అందిస్తున్న రాయితీలు తగ్గింటంతో ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల ధరలు పెరిగాయి. దీనికి ముందు రేట్లు పెరుగుతాయనే వార్తలతో చాలా మంది పాత రేట్ల వద్దే తమకు ప్రియమైన మోడళ్ల ఈవీలను కొనుగోలు చేయటం కంపెనీలకు విక్రయాలు గణనీయంగా పెరగటానికి దోహదపడ్డాయి.


అత్యధిక మార్కెట్ వాటా ఓలాదే 
ప్రస్తుతం దేశంలోని ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ అత్యధికంగా 51 శాతం మార్కెట్ వాటాను దక్కించుకుంది. ఏప్రిల్ 2024లో కంపెనీ ఏకంగా 33,062 వాహనాలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే నెలలో విక్రయించిన 21,882 కంటే అధికం. అయితే ఇది మార్చి 2024లో కంపెనీ విక్రయించిన 50,545 కంటే తక్కువే. ఇదే క్రమంలో కంపెనీ మెుత్తం 2024 ఆర్థిక సంవత్సరంలో 3,26,428 ఈవీలను అమ్మింది. దీని తర్వాత ఈవీ అమ్మకాల్లో టీవీఎస్ మోటార్స్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఏప్రిల్ 2024లో కంపెనీ కేవలం 7,653 ఎలక్ట్రిక్ స్కూటర్లను మాత్రమే విక్రయించగలిగింది. ఫేమ్ సబ్సిడీ తగ్గటంతో స్కూటర్ రేట్లను కంపెనీ రూ.6000 మేర పెంచటం అమ్మకాలపై కొంత ప్రతికూల ప్రభావాన్ని చూపింది. మార్చి2024లో 26,478 స్కూటర్లు అమ్మిక కంపెనీ మెుత్తం ఆర్థిక సంవత్సరంలో 1,82,933 స్కూటర్లను విక్రయించి 20 శాతం మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది.


ఇదే క్రమంలో బజాజ్ ఆటో ఈవీ స్కూటర్ల విక్రయంలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఏప్రిల్ నెలలో కంపెనీ 7,515 ఈవీలను విక్రయించింది. అయితే కంపెనీ ఫేమ్ స్కీమ్ సబ్సిడీ తగ్గిన తర్వాత తన స్కూటర్ల రేటును రూ.12,000 మేర పెంచింది. మెుత్తం ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1,06,431 స్కూటర్లను కంపెనీ విక్రయించింది. నాలుగో స్థానంలో ఉన్న ఏథర్ ఎనర్జీ ఏప్రిల్ నెలలో 4,052 ఎలక్ట్రిక్ స్కూటర్లను అమ్మగా.. ఫేమ్ స్కీమ్ సబ్సిడీ తగ్గటంతో వాహనాల రేటును రూ.16,000 పెంచేసింది. మొత్తం ఆర్థిక సంవత్సరానికి కంపెనీ 1,08,870 వాహనాలను విక్రయించింది. 


మధ్యంతర బడ్జెట్ ప్రకటన ఎఫెక్ట్ 
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్ ప్రకటనలో.. ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్(EMPS) ప్రకటించగా ఏప్రిల్ 1,2024 నుంచి ప్రారంభించింది. ఇది జూలై 31,2024 వరకు అందుబాటులో ఉండనుంది. ఇది ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలపై సబ్సిడీ కిలోవాట్-గంట బ్యాటరీ సామర్థ్యంతో ఉన్న టూవీలర్లకు రూ,5,000గా నిర్ణయించారు. ఒక్కో వాహనానికి గరిష్ఠంగా అందించే రాయితీ రూ.10,000కి పరిమితం చేశారు. ఇది ఇంతకు ముందు FAME స్కీమ్ కింద అందించబడిన సబ్సిడీ కంటే తక్కువ కావటం కంపెనీలకు రేట్లు పెంచాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది. దీంతో ఆ ప్రభావం అమ్మకాలపై పడిందని నిపుణులు చెబుతున్నారు.