AP Assembly Elections 2024: ముఖ్యంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో పర్యటించారు. ఐదేళ్ల పాటు పార్టీలోనే ఉంటు వైసీపీని, అధినేత జగన్‌ను ముప్పుతిప్పలు పెట్టిన ఎంపీ రఘురామకృష్ణరాజు ఇలాకా ఇది. అలాంటి ప్రాంతంలో జగన్ పవర్‌పుల్ స్పీచ్ ఇచ్చారు. టీడీపీని ముఖ్యంగా చంద్రబాబును జగన్ టార్గెట్ చేశారు. ఆయన చెప్పిన పథకాలు ఏవీ అమలు చేయరని ధ్వజమెత్తారు. చంద్రబాబును నమ్మితే మోసపోయినట్టేనంటూ విమర్శలు చేశారు.
చంద్రముఖి లేస్తుంది: జగన్
14 ఏళ్లు పాలించిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకు రాదని విమర్శించారు జగన్. చంద్రబాబు హయాంలో ఎప్పుడైనా ఇలాంటి స్కీమ్‌లు అమలు చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటు వేస్తే చంద్రముఖి నిద్రలేస్తుందని... లకలకా అంటూ రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తుందని అన్నారు. ఆయనకు ఓటు వేయడమంటే కొండచిలువ నోట్ల తలపెట్టడమే అన్నారు.
ఇంటింటికీ సంక్షేమం
తమ హయాంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామని గుర్తు చేశారు జగన్. మహిళలకు లక్షల విలువ చేసే భూములను పట్టాల రూపంలో ఇచ్చామని తెలిపారు. మూడు సార్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు ఇలాంటి మంచి పని ఒక్కటైనా చేశారా అని ప్రశ్నించారు. రైతులకు ఉచిత పంటల బీమా, 9 గంటల నాణ్యమైన ఉచిత బీమా ఇచ్చామన్నారు. గతంలో ఎప్పుడూ చూడని పరిపాలనను 59 నెలల్లో చూశారని చెప్పుకొచ్చారు.అన్ని రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చామన్నారు జగన్. లంచాలు లేకుండా వివక్ష లేకుండా పేదలకు పథకాలు అందిస్తూనే అభివృద్ధికి బాటలు వేశామన్నారు. ఎంఎస్‌ఎఈలకు ప్రోత్సాహకాలు ఇచ్చామన్నారు.
రెండు బటన్స్ నొక్కండి
పది రోజుల్లో జరగబోయే యుద్ధంలో ప్రజల భవిష్యత్‌కు సంబంధించినవి అని అన్నారు జగన్. పథకాలు ఇంటికి రావాలంటే ఇదే ప్రభుత్వం కొనసాగలని ప్రజలకు సూచించారు. చంద్రబాబు వస్తే ఇంటింటికీ పథకాలు రావు అని అన్నారు. విద్యాశాఖలో మార్పులు తీసుకొచ్చామని అది ప్రతి గ్రామంలో కనిపిస్తోందని... ఇంగ్లీష్ మీడియం, ఇతర సౌకర్యాలన్నీ మీ ఇంట్లో కనిపిస్తున్నాయని వివరించారు. పేదవాళ్లకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీని పాతిక లక్షల వరకు విస్తరించామని... విలేజ్ క్లినిక్‌లు, ఫ్యామిలీ డాక్టర్ ఫెసిలిటీ కల్పించామన్నారు జగన్. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చేశామన్నారు. ఇలాంటి పథకాలతోపాటు మరిన్ని అందుకోవాలంటే మాత్రం రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై వేయాలని సూచించారు. ఇన్ని రోజులు బటన్స్ నొక్కిన తన కోసం రెండు బటన్లు నొక్కాలని పిలుపునిచ్చారు.