Adani Stocks: రామేశ్వరం వెళ్లినా శనీశ్వరం తప్పలేదన్నట్లు తయారైంది గౌతమ్ అదానీ పరిస్థితి. గత ఏడాది జనవరిలో అదానీ వ్యాపారాలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్, రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ షేర్ల మ్యానిపులేషన్, ఇతర అవకతవలపై సంచలన రిపోర్ట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీంతో కుప్పకూలిన అదానీ స్టాక్స్ 2024లో సుప్రీం కోర్టు ఊరటను ఇచ్చినతర్వాత తిరిగి పుంజుకున్నాయి.


అమెరికా సంస్థతో వివాదం కొనసాగుతున్నప్పటికీ గౌతమ్ అదానీ మాత్రం వ్యాపార విస్తరణలో స్పీడ్ ఏమాత్రం తగ్గించటం లేదు. ఇటీవల వరుసగా సిమెంట్ నుంచి పవర్ ప్లాంట్స్ రంగాల్లో అనేక కొత్త కొనుగోళ్లను చేపట్టిన సంగతి తెలిసిందే. అలాగే మీడియా వ్యాపారంలోనూ ఇటీవలి కాలంలో అదానీ గ్రూప్ పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. అదానీ దూకుడుగా ముందుకు సాగుతున్న పరిస్థితుల్లో దేశీయ మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చర్యలు వచ్చాయి. సెబీ అదానీ గ్రూప్‌కు సంబంధించిన 6 లిస్టెండ్ కంపెనీలకు ఒకేసారి షోకాజ్ నోటీసులు జారీ చేయటం సంచలనంగా మారింది. మార్కెట్లో ఇన్వెస్టర్లు ప్రస్తుతం దీనిపైనే చర్చించుకుంటున్నారు. అయితే ఇది అదానీ గ్రూప్ షేర్లలో మరో పతనానికి దారితీస్తుందా అనే విషయంపై అందరూ చర్చించుకుంటున్నారు.


షోకాజ్ నోటీసులపై నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని చెప్పటం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇటీవల పంతాజలి విషయంలో జరిగిన పరిణామాలు ఎలాంటి ఇబ్బందులను కలిగించాయో మనందరం చూశాం. దీనిపై ఇన్వెస్టర్లకు వివరణ ఇచ్చిన అదానీ గ్రూప్.. గ్రూప్ కంపెనీలకు సంబంధిత పార్టీ లావాదేవీల నిబంధనల ఉల్లంఘనలు, లిస్టింగ్ నిబంధనల ఉల్లంఘన, గతంలో ఆడిటర్ సర్టిఫికేట్‌ల చెల్లుబాటుకు సంబంధించినవని పేర్కొంది. నిన్న త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన అదానీ ఎంటర్ ప్రైజెస్ కంపెనీకి రెండు షోకాజ్ నోటీసులు అందాయి. ఇదే క్రమంలో అదానీ నేతృత్వంలోని.. అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీలు సెబీ నుంచి నోటీసులు అందుకున్నాయి.


రెగ్యులేటరీ చర్యలు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపబోవని అదానీ గ్రూప్ వెల్లడించింది. అయితే అదానీ విల్మార్, అదానీ టోటల్ గ్యాస్ కాకుండా ఇతర కంపెనీల ఆడిటర్లు సెబీ విచారణ తర్వాత మెరిటోరియస్ వివరణలు, అభిప్రాయాలు ఇచ్చారు. ఇది భవిష్యత్ ఆర్థిక నివేదికలపై ప్రభావం చూపుతుందని అదానీ గ్రూప్ పేర్కొంది. ప్రస్తుత పరిస్థితులకు ముందు ఆగస్టులో.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నివేదికలో సెబీ 13 అదానీ గ్రూప్‌కు సంబంధించిన లావాదేవీలను గుర్తించింది. వాటి వెనుక ఉన్న ఒప్పందాలపై విచారణ జరుపుతున్నట్లు అప్పట్లో పేర్కొంది. ఏదేమైనా అదానీకి మాత్రం వరుస వివాదాలు పెద్ద తలనొప్పులనే తెచ్చిపెడుతున్నాయని చెప్పుకోవాలి. 2024లో కోర్టు క్లీన్ చిట్ తర్వాత పరిస్థితులు చక్కబడుతున్నాయని అనుకునే లోపే సెబీ నోటీసులు ఇన్వెస్టర్లను అప్రమత్తం అయ్యేలా చేస్తున్నాయి.


ఆరోపణలు ఎదుర్కొంటున్న కంపెనీల షేర్లు చాలా వరకు ఇంట్రాడేలో నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి..


అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్లు 1.1 శాతం నష్టంతో రూ.3007.65 వద్ద కొనసాగుతున్నాయి


అదానీ పవర్ షేర్లు 0.5 శాతం నష్టంతో రూ.605.05 వద్ద ట్రేడువుతున్నాయి


అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ షేర్లు 1.3 శాతం నష్టపోయి రూ.1321.25 వద్ద కొనసాగుతున్నాయి


అదానీ విల్మార్ షేర్లు 1.7 శాతం నష్టంతో రూ.345.6 వద్ద ఇంట్రాడేలో ట్రేడవుతున్నాయి


అదానీ టోటల్ గ్యాస్ షేర్లు స్వల్పంగా 0.1 శాతం పెరిగి రూ.933.2 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.


అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్లు 0.82 శాతం లాభంతో రూ.1,061.50 వద్ద ట్రేడవుతున్నాయి