Ukraine Russia War Impact, Gold Prices Today:  రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరిగింది. పది గ్రాముల పుత్తడి ధర ఈ ఒక్క రోజులోనే ఏడాది గరిష్ఠానికి చేరుకుంది. ఎంసీఎక్స్‌ ప్రకారం రూ.2,25౦ పెరిగి రూ.52,630కి ఎగిసింది. మరోవైపు వెండి ధర 5 శాతం పెరిగి రూ.67,926కు చేరుకుంది.


స్పాట్‌ మార్కెట్లో బంగారం ధర 1925 డాలర్ల నిరోధాన్ని దాటేసింది. ఔన్స్‌ ధర 1950 డాలర్లు దాటేసింది. 13 నెలల గరిష్ఠాన్ని అందుకుంది. యుద్ధభయం ఇలాగే కొనసాగితే ఔన్స్‌ ధర 1980, 2000 డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు.


'ఎప్పట్నుంచో ఉన్న 1925 డాలర్ల నిరోధాన్ని బంగారం దాటేసింది. ఇప్పుడది 1950 డాలర్లకు పెరిగింది. స్పాట్‌ మార్కెట్లో తర్వాతి లక్ష్యం 1980, 2000 డాలర్లు. మరికొద్ది రోజుల్లోనే ఇది సాధ్యమవుతుంది. రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో స్పాట్‌ మార్కెట్‌ ధర బాగా పెరిగింది' అని మోతీలాల్‌ ఓస్వాల్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అమిత్‌ సజేజా అంటున్నారు.


ఈక్విటీ నష్టాల్లో ఉంటే


ఈక్విటీ మార్కెట్లు నష్టాల్లో ఉన్నప్పుడు మదుపర్లు ప్రత్యామ్నాయ పెట్టుబడుల వైపు చూస్తుంటారు. అందులో అందరికీ ఎక్కువ ఇష్టమైంది బంగారం. ఈ అద్భుత లోహం ధరల్లో భారీ హెచ్చుతగ్గులు ఉండవు. నష్టాలూ ఎక్కువగా రావు. అందుకే ఈక్విటీ మార్కెట్లు నష్టపోయిన ప్రతిసారీ పుత్తడి ధర ఎంతో కొంత పెరుగుతూనే ఉంటుంది. ఈ ఒక్కరోజే పది గ్రాముల బంగారం ధర రూ.2250 పెరిగి రూ.52,630 వరకు ఎగిసింది. యుద్ధం ఇలాగే కొనసాగితే అతి త్వరలోనే బంగారం ధర మరింత ఎగిసే అవకాశం ఉంది. ఏడాది గరిష్ఠం నుంచి రూ.60,000కు చేరుకున్నా ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


మార్కెట్లన్నీ పతనం


Stock Market Crash: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేస్తోంది. అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లన్నీ (Stock markets) పతనం దిశగా సాగుతున్నాయి. భారత స్టాక్‌ మార్కెట్లలో (Indian Stock markets) గురువారం రక్తకన్నీరు వరదలై పారింది! మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) ఏకంగా 5 శాతం వరకు పతనమయ్యాయి. మార్కెట్లు మొదలైన అరగంటలోనే బీఎస్‌ఈ మార్కెట్‌ విలువ రూ.10 లక్షల కోట్ల మేర ఆవిరైంది. రూ.256 లక్షల కోట్ల నుంచి రూ.246 లక్షల కోట్లకు తగ్గింది.


బ్రెంట్‌ క్రూడ్‌ఆయిల్‌ (Crude Oil) ఏడేళ్లలో తొలిసారిగా బ్యారెల్‌కు 10౩ డాలర్లకు చేరుకుంది. ఇండియా విక్స్‌ 30 శాతానికి పెరిగింది. మార్కెట్లు ఇప్పటికే జీవనకాల గరిష్ఠాల నుంచి పది శాతం వరకు పతనమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 2800 పాయింట్ల నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,300 దిగువన ముగిసింది.