NPS charges Revised for National Pension System : అతి తక్కువ ఖర్చుతో లభించే అత్యుత్తమ పెట్టుబడి సాధనం జాతీయ పింఛను పథకం (National Pension System - NPS). ప్రతి నెలా కొంత డబ్బును ఇందులో జమ చేయడం ద్వారా ఉద్యోగ జీవితానికి వీడ్కోలు పలికే సమయంలో మంచి నిధి ఏర్పాటు అవుతుంది. ఈ నిధి నిర్వహణకు ఎక్కువ ఖర్చు కానప్పటికీ కొన్ని రుసుములు మాత్రం ఉంటాయి. కొన్ని పాయింట్‌ ఆఫ్‌ పర్చేస్‌ (POP), మరికొన్ని CRA స్థాయిలో ఉంటాయి.


పెట్టుబడి ఆరంభించేటప్పుడు అయ్యే ఖర్చులు లేదా రుసుములు పాయింట్స్‌ ఆఫ్‌ పర్చేస్‌ సమయంలో ఉంటాయి. ఉదాహరణకు ఎన్‌పీఎస్‌ ఖాతాలు తెరిచేందుకు, నిర్వహించేందుకు కొన్ని బ్యాంకులను ప్రావిడెంట్‌ ఫండ్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (PFRDA) నియమించింది. ఇవి చందాదారుల నమోదు, స్టేట్‌మెంట్ల విడుదలను చూసుకుంటాయి. కొన్ని ఎన్‌పీఎస్‌ రుసుములు చందారులు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. మరికొన్ని యూనిట్లను రద్దు చేసుకొనేప్పుడు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్యే ఈ పీవోపీ రుసుములను పెంచారు. అందరు పౌరులు, కార్పొరేట్‌ మోడల్స్‌కు ఇవి వర్తిస్తాయి. 2022, ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి.


కొత్త రుసుములు


* చందాదారుడు తన పేరు నమోదు చేసుకొనేప్పుడు చెల్లించాల్సిన ఫీజు రూ.200-400గా ఉంది. శ్లాబుల ప్రకారం దీనిని వసూలు చేస్తారు. మొదటే రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకు ముందు ఇది రూ.200 మాత్రమే.


* చందాదారుడు చేసే జమ లేదా కంట్రిబ్యూషన్‌ను బట్టి కొన్ని రుసుములు ఉంటాయి. ఉదాహరణకు కంట్రిబ్యూషన్‌లో 0.50 శాతం వరకు ఉంటుంది. లేదా కనీసం రూ.30 నుంచి గరిష్ఠంగా రూ.25,000 వరకు ఉంటుంది. గతంలో ఇది 0.25 శాతమే.


* ఒక ఆర్థిక ఏడాదిలో ఆరు నెలలకు మించి కనీస జమ రూ.1000 నుంచి రూ.2999 ఉంటే దానికి వార్షికంగా రూ.50 ఫీజు తీసుకుంటారు. కనీస కంట్రిబ్యూషన్‌ రూ.3000-2999 వరకైతే రూ.50, కనీస కంట్రిబ్యూషన్‌ రూ.3000-6000 అయితే రూ.75, రూ.6000 పైగా జమ చేస్తే ఏడాదికి రూ.100 వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అంతకు ముందు ఇది రూ.50 మాత్రమే.


* ఈ-ఎన్‌పీఎస్‌ (e-NPS) అయితే కంట్రిబ్యూషన్‌లో 0.20 శాతం వసూలు చేస్తారు. ఇంతకు ముందు 0.10 శాతమే.


* ఎన్‌పీఎస్‌ నుంచి ఎగ్జిట్‌ లేదా కొంత డబ్బును వెనక్కి తీసుకొనేందుకు ఈ మధ్యే ప్రాసెసింగ్‌ ఫీజును ప్రవేశపెట్టారు. ఈ సేవల కనీస రుసుము రూ.125 నుంచి రూ.500 వరకు ఉంటుంది. లేదా కార్పస్‌ మొత్తంలో 0.125 శాతం ఉంటుంది.


* 2022, ఫిబ్రవరి 15 నుంచి e-NPS రుసుములను కంట్రిబ్యూషన్‌లో 0.20 శాతానికి పెంచారు. అయితే సేవలను బట్టి ఇది రూ.15 నుంచి గరిష్ఠంగా రూ.10,000 వరకు ఉంటాయి.


Also Read: గుడ్‌న్యూస్‌ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!


Also Read: ప్రతిరోజూ రూ.100 SIP - సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకం