EPFO New Pension Scheme for formal workers: సంఘటిత రంగంలోని ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం తీసుకొచ్చేందుకు సమాలోచనలు చేస్తోంది. ఉద్యోగుల పింఛను పథకం EPS-95 పరిధితో సంబంధం లేకుండా నెలకు రూ.15,000కు పైగా బేసిక్‌ పే, డీఏ వచ్చేవారి కోసం దీనిని ప్రవేశపెట్టాలని అనుకుంటోంది. ప్రస్తుతం ఉద్యోగంలో చేరినప్పుడు రూ.15,000 వరకు పొందుతున్నవారు తప్పనిసరిగా EPS-95 కిందకు వస్తున్నారు.


'ఈపీఎఫ్‌వోలో అధికంగా కంట్రిబ్యూట్‌ చేస్తున్న వారికి అత్యధిక పింఛను అందించాలన్న డిమాండ్లు ఉన్నాయి. అందుకే సరికొత్త పింఛను పథకం తీసుకురావడం పరిగణనలో ఉంది. లేదా మూల వేతం రూ.15,000కు పైగా ఉన్న ఉద్యోగుల కోసం ఓ పథకం తీసుకురావాలని అనుకుంటున్నారు' అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.


మార్చి 11, 12న గువాహటిలో ఈపీఎఫ్‌వో ధర్మకర్తల మండలి సమావేశం కానుంది. అక్కడ జరిగే సమావేశంలో ఇది చర్చకు రానుంది. 2021, నవంబర్‌లో పింఛను వ్యవహారాలపై వేసిన కబ్‌  కమిటీ కూడా అప్పుడే నివేదికను సమర్పించనుంది.


ఇప్పుడు రూ.15,000కు పైగా మూల వేతనం వస్తున్న ఉద్యోగులు ఇష్టం లేకున్నా 8.33 శాతం చొప్పున తక్కువ మొత్తాన్నే జమ చేయాల్సి వస్తోంది. దీనివల్ల తక్కువ పింఛను లభిస్తోంది. రూ.15,000 లోపు మూల వేతనం ఉన్నవారు ఎక్కువ కంట్రిబ్యూట్‌ చేయకుండా 2014లో ఈపీఎఫ్‌వో పింఛను పథకంలో పరిమితి ఉండేలా ఓ సవరణ తీసుకొచ్చింది. మొదట్లో ఇది రూ.6,500 నుంచి పెంచారు. ఆ తర్వాత రూ.15,000 వరకు అమలు చేశారు. ఇప్పుడు మూల వేతనాన్ని రూ.25,000 వరకు పెంచాలని డిమాండ్లు ఉన్నాయి. అయితే ఆ ప్రతిపాదన ఇంకా ఆమోదించలేదు. 


'ఉద్యోగ భవిష్య నిధి చట్టం - 1952 ప్రకారం నెలవారీ మూలవేతనం పరిమితి రూ.15,000 నుంచి రూ.25,000 పెంచాలన్న ప్రతిపాదన ఉంది. ఈ విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు' అని 2016, డిసెంబర్లో అప్పటి కార్మిక శాఖా మంత్రి బండారు దత్తాత్రేయ లోక్‌సభలో పేర్కొన్నారు. ప్రస్తుతానికి మూల వేతనం పెంపు గురించి బలమైన డిమాండ్లు ఉన్నాయని ఆ అధికారి అంటున్నారు.


Also Read: ట్రంప్‌ వారి కొత్త సోషల్‌ మీడియా యాప్‌ - సోమవారమే విడుదల! పేరేంటో తెలుసా?


Also Read: ఫండమెంటల్స్‌ బలం - లక్షకు రూ.1.81 కోట్ల లాభం, ఆ షేరేంటంటే!