Multibagger stock Rama phosphates: స్టాక్‌ మార్కెట్లో మల్టీ బ్యాగర్ల కోసం అంతా ఎదురు చూస్తుంటారు. తాము పెట్టుబడి పెట్టిన షేరు అనేక రెట్లు రాబడి ఇవ్వాలని కోరుకుంటారు. మంచి మంచి షేర్లు ఏమున్నాయా అని జల్లెడపట్టి వెతుకుతుంటారు. అయితే చాలామంది గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఒకటుంది! ఫండమెంటల్స్‌ బలంగా ఉన్న కంపెనీలో దీర్ఘకాలం పెట్టుబడిని కొనసాగిస్తే అది ఇబ్బడి ముబ్బడిగా రాబడి ఇస్తుంది. పైగా డివిడెండ్‌ కూడా లభిస్తుంది. అందుకు  రామా ఫాస్పేట్‌ షేరే ఉదాహరణ!


2021లో ఈ ఫెర్టిలైజర్‌ స్టాక్‌ అద్భుతం చేసింది. షేర్‌ హోల్డర్లకు 235 శాతం రాబడి ఇచ్చింది. ఈ ఒక్క ఏడాదే కాదు కొన్నేళ్లుగా ఈ షేరు ఆల్ఫా రిటర్నులను ఇస్తూనే ఉంది. ఎందుకంటే ఈ షేరులో దశాబ్దం కిందట లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు కోటీశ్వరులు అయ్యేవారు. 19 ఏళ్ల క్రితం లక్ష పెట్టుంటే ఇప్పుడు ఏకంగా రెండు కోట్ల వరకు అందుకొనేవారు. కొన్నాళ్లుగా ఈ కంపెనీకి అమ్మకాల సెగ తగులుతున్నా భవిష్యత్తులో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.


నెల రోజుల వ్యవధిలో ఈ షేరు రూ.400 నుంచి రూ.361 స్థాయిలకు తగ్గిపోయింది. దాదాపుగా పది శాతం తగ్గింది. అయితే ఆరు నెలలుగా సైడ్‌వేస్‌లో ట్రేడ్‌ అవుతోంది. ఎనిమిది శాతం వరకు రిటర్ను ఇస్తోంది. రూ.108 నుంచి రూ.361కి చేరుకున్నాక 235 శాతం ఆల్ఫా రిటర్ను ఇచ్చింది. గత ఐదేళ్లలో రామా ఫాస్పేట్‌ షేరు ధర రూ.75.95 కోట్ల నుంచి రూ.362కు చేరుకుంది. అంటే 380 శాతం ర్యాలీ అయిందన్నమాట. ఇక పదేళ్ల కాలంలో రూ.51 నుంచి రూ.362కు పెరిగింది. 610 శాతం పెరిగింది. 19 ఏళ్లలో రూ.2 నుంచి రూ.362 స్థాయికి చేరుకుంది. ఏకంగా 18000 శాతం ర్యాలీ చేసింది.


ఈ షేరు చరిత్ర చూసుకుంటే ఏడాది క్రితం ఇందులో లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టుంటే ఇప్పుడు రూ.3.35 లక్షలకు పెరిగేది. ఐదేళ్ల కాలంలో అయితే రూ.4.80 లక్షలుగా మారేది. పదేళ్ల క్రితం ఇందులో లక్ష రూపాయిలు పెట్టుంటే ఇప్పుడు రూ.7.10 లక్షలు అందేవి. అదే 19 ఏళ్ల క్రితం రూ.లక్ష పెట్టుంటే ఇప్పుడు అక్షరాల రూ.1.81 కోట్లు అందేవి.


నెల రోజులుగా ఈ షేరుకు అమ్మకాల సెగ తగిలింది. అప్పట్నుంచి ఒకే రేంజులో ట్రేడ్‌ అవుతోంది. మరికొన్ని రోజుల్లోనే ఇది రూ.550 స్థాయికి చేరుకుంటుందని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు.