Donald Trump Truth Social: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త సోషల్‌ మీడియా యాప్‌ సోమవారం విడుదల కానుంది! 'ట్రూత్‌ సోషల్‌'గా పిలుస్తున్న ఈ యాప్‌ సోమవారం నుంచి యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని ఆ సంస్థకు చెందిన ఓ ప్రతినిధి చేసిన పోస్టుల ద్వారా తెలిసింది. ఈ యాప్‌ టెస్టు వెర్షన్‌ను రాయిటర్స్‌ చూసింది. దాదాపుగా ఏడాది కాలం పాటు సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ట్రంప్ తిరిగి తన అభిప్రాయాలను బాహాటంగా ప్రకటించేందుకు మార్గం సుగమమైనట్టే!


ట్రూత్‌ సోషల్‌ యాప్‌ నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రొడక్ట్‌ ఆఫీసర్‌ బి.బిల్లీ శుక్రవారం వరుసగా పోస్టులు చేశారు. టెస్టు దశలో యాప్‌ను ఉపయోగిస్తున్న వారిని ఆహ్వానించి వారి ప్రశ్నలు జవాబులు ఇచ్చారు. ఇప్పటి వరకు బీటా టెస్టర్లు ఉపయోగిస్తు యాప్‌ ప్రజల ముందుకు ఎప్పుడొస్తుందని ఒకరు ఆయన్ను ప్రశ్నించారు. 'ఫిబ్రవరి 21, సోమవారం రోజు యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో యాప్‌ను విడుదల చేయబోతున్నాం' అని ఆయన బదులిచ్చారు.


అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్టుల వల్లే ఆయన అనుచరులు రెచ్చిపోయి వైట్‌హౌజ్‌పై దాడి చేశారన్న ఆరోపణలతో ఆయన సోషల్‌ మీడియా ఖాతాలను సంబంధిత కంపెనీలు నిలిపివేశాయి. ట్విటర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లు 2021, జనవరి 6 నుంచి ఆయన ఖాతాలపై నిషేధం విధించాయి. దాంతో ఫిబ్రవరి 15న డొనాల్డ్‌ ట్రంప్‌ కొడుకు తన ట్విటర్లో ఒక స్క్రీన్‌ షాట్‌ను పోస్టు చేశారు. అందులో తన తండ్రి @realDonaldTrump పేరుతో ట్రూత్‌ సోషల్‌ ఖాతా స్క్రీన్‌షాట్‌ ఉంది. 'సిద్ధం కండి! మీకు ఇష్టమైన అధ్యక్షుడు త్వరలో మిమ్మల్ని కలవబోతున్నారు' అంటూ వెల్లడించారు.


ట్రూత్‌ సోషల్‌ యాప్‌ దాదాపుగా ట్విటర్‌ను పోలి ఉంటుందని సమాచారం. ట్విటర్లో చేసే పోస్టును ట్వీట్‌ అంటే ఇందులో 'ట్రూత్‌' అంటారు. ఈ యాప్‌లో పోస్టు చేసిన తర్వాత ఎడిట్‌ చేసేందుకు ఇప్పుడైతే ఫెసిలిటీ లేదని తెలుస్తోంది. ఇక ఇందులో డైరెక్ట్‌ మెసేజ్‌ లేదా డీఎం సౌకర్యం ఉందట. సైనప్‌ అయినప్పుడు అవతలి వారి పోస్టింగుల నోటిఫికేషన్లు రిసీవ్‌ చేసుకొనే ఆప్షన్‌ ఉందట. అంతేకాకుండా ఇతరులను బ్లాక్‌ చేసే సౌకర్యమూ ఇస్తున్నారట.