Mutual Funds Daily SIP: స్టాక్‌ మార్కెట్లో నేరుగా పెట్టుబడులు పెట్టలేని వారికి మ్యూచువల్‌ ఫండ్స్‌ (Mutual Funds) ఎంతో ఉపయోగకరం. ఇలాంటి ఫండ్స్‌లో కొందరు భారీ మొత్తం ఇన్వెస్ట్‌ చేస్తారు. అంత డబ్బు లేనివారికి ప్రతి నెలా క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) అత్యుత్తమ మార్గం. ఇప్పటి వరకు అందరికీ తెలిసిందేంటంటే నెల నెలా సిప్‌ కట్టుకోవడం. కానీ తొలిసారి ప్రతి రోజూ సిప్‌ కట్టుకొనే అవకాశం తెరపైకి వచ్చింది. మార్కెట్లలోని ఒడుదొడుకులను వీటితో అధిగమించొచ్చు!


మ్యూచువల్‌ ఫండ్‌ (Mutual Funds) డిస్ట్రిబ్యూటర్‌ వేదిక జెడ్‌ ఫండ్స్‌ (ZFunds) మంగళవారం సరికొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో ప్రతి రోజు రూ.100తో సిప్‌ చేసుకోవచ్చు. గ్రామీణ, చిన్న చిన్న పట్టణాల్లోని ప్రజలను దృష్టిలో పెట్టుకొని దీనిని తీసుకొచ్చారు. ప్రతి రోజూ రూ.100 పెట్టుబడి పెట్టడం వల్ల మార్కెట్లో ఒడుదొడుకుల ద్వారా వచ్చే ప్రయోజాన్ని పొందొచ్చు. అంటే సూచీలు పడ్డప్పుడు తక్కువ ధరకే యూనిట్లను కొనుగోలు చేయొచ్చు.


ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్ (ICICI Prudential Mutual funds), హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్ (HDFC Mutual Funds), టాటా మ్యూచువల్‌ ఫండ్ (TATA Mutual Fund)తో కలిసి ఈ సరికొత్త సిప్ (SIP) పథకాన్ని ప్రవేశపెడుతున్నామని జెడ్‌ ఫండ్స్‌ తెలిపింది. ఇవే కాకుండా మరికొన్ని మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. దాంతో ఎక్కువ మంది వద్దకు ఈ పథకాన్ని తీసుకెళ్లొచ్చని భావిస్తోంది.


టైర్‌-2, టైర్‌-3, టైర్‌-4 పట్టణాల్లోని ప్రజల పెట్టుబడి అవసరాలను తీర్చడమే తమ లక్ష్యమని జెడ్‌ ఫండ్స్ (ZFunds) అంటోంది. చిన్న చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు రోజువారీగా అత్యధిక రేటుతో రాబడి పొందొచ్చని పేర్కొంటోంది. రోజుకు వంద రూపాయిలు సిప్‌ చేయడం ద్వారా రోజువారీ కూలీలు, చిన్న వ్యాపారులు మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం దొరుకుతుందని వెల్లడించింది.


'ఇదో సరికొత్త విధానం. దేశంలోని ప్రజలందరికీ మ్యూచువల్‌ ఫండ్‌ ఉత్పత్తులు చేరేందుకు ఉపయోగపడుతుంది. స్వయం ఉపాధి పొందేవారు, రోజు కూలీలకు పెట్టుబడి అవకాశాలను ఇది సృష్టిస్తుంది' అని జెడ్‌ ఫండ్స్ (ZFunds) సహ వ్యవస్థాపకుడు, సీఈవో మనీశ్ కొఠారి అంటున్నారు.


Also Read: గుడ్‌న్యూస్‌ రాబోతోందా! ఉద్యోగుల కోసం EPFO సరికొత్త పింఛను పథకం!


Also Read: ఫండమెంటల్స్‌ బలం - లక్షకు రూ.1.81 కోట్ల లాభం, ఆ షేరేంటంటే!