Gold Investment: భారతీయులు - బంగారం.. ఇవి రెండూ పర్యాయపదాలు. బంగారం అన్న మాట వినపడగానే, భారతీయుల ఒంటి మీద తళుక్కుమనే నగలు, బంగారం షాపుల్లో రద్దీనే గుర్తుకొస్తాయి.
భారతీయుల దృష్టిలో బంగారం అంటే ఒక విలువైన లోహం మాత్రమే కాదు, శుభాలను కలిగించే వస్తువు. భారతీయులకు ఇది ఒక పెట్టుబడి సాధనం కూడా. భారతీయులు బంగారం మీదే అత్యధిక పెట్టుబడులు పెడతారు.
విచిత్రమైన విషయం ఏంటంటే... పసిడి అంటే పడి చచ్చే భారత్, బంగారం కొనుగోళ్లలో తొలి స్థానంలో లేదు. ఒక మీడియా నివేదిక ప్రకారం, బంగారం కొనుగోలులో భారతదేశానిది ప్రపంచంలో నాలుగో స్థానం.
ప్రపంచంలో ఇప్పటి వరకు తవ్వి తీసిన బంగారంలో కేవలం 10 శాతం మాత్రమే పారిశ్రామిక అవసరాలకు ఉపయోగ పడుతోంది.
బంగారాన్ని విపరీతంగా కొంటున్న ప్రపంచ దేశాలు
విలువైన లోహ నిల్వగా బంగారాన్ని పరిగణిస్తారు. ద్రవ్యోల్బణం, ఆర్థిక అస్థిరతల కాలంలో ఈ లోహం మనకు ఆర్థిక రక్షణ కల్పిస్తుంది. క్రిప్టో కరెన్సీల్లో ఇటీవలి హెచ్చుతగ్గుల కారణంగా ప్రజల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. మార్కెట్ అస్థిరత నుంచి రక్షణ కోసం చాలా దేశాల నుంచి బంగారానికి డిమాండ్ పెరిగింది. ఆ బంగారాన్ని అవి ఆర్థిక సంస్కరణలకు ఉపయోగించుకోవచ్చు.
670 టన్నుల బంగారం కొనుగోలు
ప్రపంచవ్యాప్తంగా, సెంట్రల్ బ్యాంకుల ద్వారా జరిగిన బంగారం కొనుగోళ్లు 2022 జనవరి-సెప్టెంబర్ ధ్య కాలంలో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. మూడో త్రైమాసికంలో (Q3) ప్రపంచ దేశాలు అన్నీ కలిసి 670 టన్నుల ఎల్లో మెటల్‌ను కొనుగోలు చేశాయి. దీనికి అదనంగా, ప్రపంచవ్యాప్తంగా నాలుగో వంతు సెంట్రల్ బ్యాంకులు ఈ సంవత్సరం మరింత పసుపు లోహాన్ని కొనుగోలు చేయాలని భావిస్తున్నాయి.
నితిన్ కామత్ రిపోర్ట్
జీరోధా సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ (Zerodha Co-Founder Nitin Kamath), 'కొత్త 9 రోజులు పాత 100 రోజులు' పేరిట బంగారం మీద తన అభిప్రాయాలను వెల్లడించారు. స్మార్ట్ మనీని అనుసరించడం ఎల్లప్పుడూ మంచి ఆలోచన అని సూచించారు.
నితిన్ కామత్ నివేదిక ప్రకారం... 2022 సంవత్సరంలో, అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన దేశాల్లో టర్కీ (Turkey) అగ్రస్థానంలో నిలిచింది. 2022 జనవరి-సెప్టెంబర్ కాలంలో ఆ దేశం 94.63 టన్నుల స్వర్ణాన్ని కొనుగోలు చేసింది. రెండో స్థానంలో ఉన్న ఈజిప్ట్ (Egypt) కొనుగోలు చేసిన 44.41 టన్నుల కంటే ఇది రెట్టింపు. 33.90 టన్నుల ఎల్లో మెటల్ కొనుగోలుతో ఇరాక్ (Iraq) మూడో స్థానంలో ఉంది.
ఇదే కాలంలో, 31.25 టన్నుల బంగారం కొనుగోలుతో, ఇరాక్ తర్వాత నాలుగో స్థానంలో భారత్ (Gold in India) నిలిచింది. భారతదేశం తన విదేశీ మారక ద్రవ్య నిల్వలలో (Forex) పసుపు లోహాన్ని జమ చేస్తూ వస్తోంది. కరెన్సీలో పతనాన్ని అడ్డుకోవడానికి బంగారం ఒక రక్షణ కవచంగా పని చేస్తుంది. 2022 నవంబర్‌లో, మొత్తం విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో బంగారం వాటా 7.26 శాతంగా ఉంది.