Housing Prices 2023: ఈ సంవత్సరం (2023) సొంత ఇళ్ల (ఫ్లాట్లు/ ఇండిపెండెంట్‌ హౌసెస్‌) ధరలు పెరుగుతాయని రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశంలోని 58 శాతం మంది బిల్డర్లది ఇదే మాట. గృహ నిర్మాణాలకు ఉపయోగించే కలప, స్టీల్‌, సిమెంట్‌, ఇటుకలు, టైల్స్‌ ధరలు, కూలీ రేట్లు సహా ప్రతీదీ పెరిగినందున ఈ ఏడాది సొంత ఇళ్ల రేట్లు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే, హౌసింగ్‌ రేట్లలో మార్పు ఉండదని, ధరలు స్థిరంగా ఉంటాయని 32 శాతం రియల్‌ ఎస్టేట్‌ బిల్డర్లు అభిప్రాయపడ్డారు. 


రియల్టర్స్ అపెక్స్ బాడీ అయిన క్రెడాయ్‌ (CREDAI), రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా, ప్రాపర్టీ రీసెర్చ్ సంస్థ లియాసెస్ ఫోరాస్ సంయుక్తంగా చేసిన 'రియల్ ఎస్టేట్ డెవలపర్ల సెంటిమెంట్ సర్వే'లో (Real Estate Developers Sentiment Survey) ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 341 మంది రియల్ ఎస్టేట్ డెవలపర్లు . గత 2 నెలలుగా నిర్వహించిన ఈ ఉమ్మడి సర్వేలో పాల్గొని, తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.


"అస్థిరంగా ఉన్న పెట్టుబడి ఖర్చులు, ఆర్థిక అనిశ్చితులు, స్థిరంగా ఉన్న ద్రవ్యోల్బణం రేట్ల వల్ల 2023లో గృహాల ధరలు పెరిగే అవకాశం ఉందని 58 శాతం మంది డెవలపర్లు భావిస్తున్నారు" అని నివేదిక పేర్కొంది.


సొంత ఇళ్లకు డిమాండ్‌ ఎలా ఉంటుంది?
ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా, సొంత ఇళ్లకు డిమాండ్‌ పైనా తమ ఆలోచనలను ఈ సర్వేలో పంచుకున్నారు. 2023లో సొంత ఇళ్లకు డిమాండ్ స్థిరంగా ఉంటుందని 43 శాతం మంది డెవలపర్లు అంచనా వేశారు. 31 శాతం మంది మాత్రం, డిమాండ్‌ పెరుగుతోందన్న విషయం తమకు అర్ధం అవుతోందని, డిమాండ్‌ మరో 25 శాతం వరకు పెరుగుతుందని వెల్లడించారు. మొత్తంగా చూస్తే, దాదాపు 75 శాతం మంది డెవలపర్లు డిమాండ్‌ పెరుగుతుందని లేదా స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు.


గత కొన్ని త్రైమాసికాలుగా హౌసింగ్ ధరలు పెరుగుతున్నాయని.. బలమైన హౌసింగ్ డిమాండ్‌తో పాటు నిర్మాణ ఖర్చుల్లో పెరుగుదల దీనికి కారణమని 'రియల్ ఎస్టేట్ డెవలపర్ల సెంటిమెంట్ సర్వే' నివేదిక పేర్కొంది.


పెరుగుతున్న ఇన్‌పుట్ (నిర్మాణ) ఖర్చుల వల్ల, 2022లో 43 శాతం మంది డెవలపర్ల ప్రాజెక్ట్ ఖర్చులు 10-20 శాతం పెరిగాయని సర్వే నివేదికలో వెల్లడైంది. డెవలపర్లు ప్రభుత్వం నుంచి 'ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' కోరుకుంటున్నారు.


వడ్డీ రేట్లు పెరిగినప్పటికీ, సొంత ఇళ్ల కొనుగోళ్ల మీద ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని కొలియర్స్ ఇండియా CEO రమేష్ నాయర్ చెబుతున్నారు. రియల్ ఎస్టేట్ డెవలపర్లు కూడా గృహ కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా ఉన్న ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం మీద దృష్టి సారిస్తున్నారని వెల్లడించారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడం, డిమాండ్‌కు తగ్గ సరఫరాను తీసుకురావడంపై కూడా ఫోకస్‌ పెంచారని చెప్పారు.


ఆర్థిక మాంద్యం ప్రభావం ఎలా ఉంటుంది?
డెవలపర్లలో దాదాపు సగం మంది (46 శాతం), ఆర్థిక మాంద్యం తమ వ్యాపారం మీద ఒక మోస్తరు ప్రభావం చూపుతుందని నమ్ముతున్నారు. 31 శాతం మంది స్వల్ప ప్రభావాన్ని అంచనా వేస్తుండగా, 15 శాతం మంది తీవ్ర ప్రభావం చూపుతుందని నమ్ముతున్నారు.


స్థిరాస్తి రంగానికి 2022 సంవత్సరం చాలా ప్రోత్సాహాన్ని అందించింది. గత దశాబ్ద కాలంలో రికార్డు స్థాయి సేల్స్‌ గత సంవత్సరంలో జరిగాయి.


"2022 సెంటిమెంట్‌తో, చాలా మంది డెవలపర్లు (87 శాతం) హౌసింగ్‌ ఆఫర్లను కొనసాగించాలని చూస్తున్నారు. ఈ సంవత్సరం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు సమానంగా కొత్త లాంచ్‌లు పెరిగే అవకాశం ఉంది" క్రెడాయ్ ప్రెసిడెంట్ హర్ష్ వర్ధన్ పటోడియా మాట్లాడుతూ చెప్పారు. కరోనా తెచ్చిన మార్పులు, పెరుగుతున్న జనాభా, సంపద వృద్ధి, వేగవంతమైన పట్టణీకరణ స్థిరాస్తి రంగాన్ని నడిపించే కీలక కారకాలు అని వెల్లడించారు.