IT Returns:


ఒకప్పుడు ఐటీఆర్‌ ఫైలింగ్‌ (ITR Filing) అంటేనే చాలామంది వాయిదా వేసేవారు! ఆఖరి పది రోజుల్లో చూసుకుందాంలే అని భావించేవారు. ఎవరో ఒకర్ని పట్టుకొని పనికానిచ్చేద్దాం అనుకొనేవారు! అలాంటిది ఈసారి ఆదాయపన్ను ఫైలింగ్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి. గతేడాదితో పోలిస్తే కీలక మైలురాళ్లు ఈసారి ముందుగానే అధిగమిస్తున్నారు. ఆన్‌లైన్‌లో సులువుగా ఫైల్‌ చేసుకోవడం, ఆఖరి వరకు వేచి చూసే ధోరణి తగ్గడం, ఐటీఆర్‌ ఫైలింగ్ సరళతరం కావడమే ఇందుకు కారణాలు!




పన్ను చెల్లింపుదారులు (Income Tax Payers) ఈసారి చైతన్యం ప్రదర్శిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఏడు రోజులు ముందుగానే మూడు కోట్ల మంది ఆదాయపన్ను రిటర్ను దాఖలు చేశారు. అందుకే పన్ను చెల్లింపుదారులు, టాక్స్‌ ప్రొఫెషనల్స్‌కు ఐటీ శాఖ ధన్యవాదాలు తెలియజేసింది. 2023 జులై 18కే 2023-23 అసెస్‌మెంట్‌ ఇయర్‌కు సంబంధించి మూడు కోట్ల ఐటీఆర్‌లు ఫైల్‌ అయ్యాయి. గతేడాది ఇందుకు జులై 25 వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.


2023, జులై 18 నాటికి 3.06 కోట్ల ఐటీఆర్‌లు (ITR) ఫైల్‌ చేయగా ఇందులో 2.81 కోట్ల ఐటీఆర్‌లు ఇప్పటికే ఈ-వెరిఫై అయ్యాయి. అంటే 91 శాతం పూర్తయ్యాయి. ఇక ఈ-వెరిఫై (Income Tax) అయినవాటిలో 1.50 కోట్లకు పైగా ఐటీఆర్‌లను ప్రాసెస్‌ చేశామని ఐటీ శాఖ వెల్లడించింది. మూమెంటమ్‌ ఇలాగే కొనసాగాలని, ఆఖరి నిమిషం వరకు ఎదురు చూడకుండా త్వరగా ఐటీఆర్ ఫైలింగ్‌ చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది.


కోటి, రెండు కోట్ల ఐటీఆర్ ఫైలింగ్‌ రికార్డులు సైతం ఈసారి బద్దలైన సంగతి తెలిసిందే. 2023-24 అసెస్‌మెంట్ సంవత్సరానికి జులై 11 వరకు మొత్తం 2 కోట్లకు పైగా ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే 9 రోజుల ముందే ఈ మైలురాయిని చేరుకున్నాం. 2022 జులై 8 నాటికి ఒక కోటి నంబర్‌ కనిపించింది. అంటే, 2022తో పోలిస్తే 2023లో ఒక కోటి ITRల మైలురాయిని 12 రోజుల ముందే చేరుకున్నట్లయింది.




ITR ఫైలింగ్‌ లాస్ట్‌ డేట్‌ జూలై 31


2023-24 అసెస్‌మెంట్ ఇయర్‌లో టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి చివరి తేదీ 31 జులై 2023. ఇంకా పది రోజుల సమయమే మిగిలుంది. లాస్ట్‌ డేట్‌ వరకు ఎదురు చూడకుండా వీలైనంత త్వరగా ITRలు ఫైల్‌ చేయాలని ఆదాయపు పన్ను విభాగం తరచూ గుర్తు చేస్తోంది. 


Also Read: ఆషాఢంలో వెండి రికార్డు! ఇక శ్రావణంలో కిలో రూ.85,000 చేరడం పక్కా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial