Government Health Insurance Schemes in India: ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడం, ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపట్టడం ప్రభుత్వాల విధి. ఈ బాధ్యతలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయి, ఆరోగ్య బీమా కూడా అందిస్తున్నాయి.


ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలను కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాయి. అయితే.. సమాజంలోని అన్ని వర్గాలకు ఈ పథకాలు అందుబాటులో ఉండవు. పేదలు లేదా అల్ప ఆదాయ వర్గాలకు మాత్రమే వర్తిస్తాయి. ఈ పథకాల కింద ఏడాదికి గరిష్టంగా రూ.5 లక్షల వరకు హెల్త్‌ కవరేజ్‌ లభిస్తుంది. నెలకు కేవలం రూ.100 చెల్లించి ఈ స్కీమ్‌లో చేరొచ్చు, లేదా పూర్తి ఉచితంగా లభిస్తాయి. ఈ పథకాలను ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేయాలి.


మన దేశంలో అమల్లో ఉన్న ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు:


1. ఆయుష్మాన్ భారత్ యోజన: భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇది. దేశంలోని 40% పైగా జనాభాకు ఉచితంగా వైద్య సేవలు అందించడం లక్ష్యం. ఈ పథకం కింద గరిష్టంగా రూ.5 లక్షల వరకు కవరేజ్‌ లభిస్తుంది. మందులు, రోగ నిర్ధారణ పరీక్షలు, చికిత్సలు, ఆసుపత్రికి వెళ్లడానికి ముందు చేసిన ఖర్చులన్నీ దీనిలో కవరవుతాయి. 


2. ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన: ప్రజలకు ప్రమాద బీమా కవరేజ్‌ అందించడం లక్ష్యం. బ్యాంక్‌ ఖాతా ఉండి, 18-70 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులంతా అర్హులే. ప్రమాదంలో పూర్తి వైకల్యం లేదా మరణానికి రూ.2 లక్షలు, పాక్షిక వైకల్యానికి రూ.1 లక్ష కవరేజ్‌ ఉంటుంది. ప్రీమియం డబ్బు బ్యాంక్‌ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా కట్‌ అవుతుంది.


3. ఆమ్ ఆద్మీ బీమా యోజన (AABY): 18-59 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులు అర్హులు. కుటుంబ పెద్ద లేదా సంపాదిస్తున్న వ్యక్తి కవరేజ్‌ ఉంటుంది. సహజ మరణానికి రూ.30,000, శాశ్వత అంగవైకల్యం వల్ల మరణిస్తే రూ.75,000 పరిహారంగా చెల్లిస్తారు. పేద పిల్లలకు స్కాలర్‌షిప్‌లు కూడా అందుతాయి.


4. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS): నగరాల్లో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ అధికార్లు, పెన్షనర్లు అర్హులు. రోగ నిర్దరణ పరీక్షలు కూడా దీనిలో కవర్‌ అవుతాయి.


5. ఎంప్లాయీ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ (ESIC): ఈ పథకం కింద దేశంలోని కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు వైద్య సేవలు లభిస్తాయి. పనిలో చేరిన తొలిరోజు నుంచే కవరేజ్‌ ప్రారంభమవుతుంది. సందర్భాన్ని బట్టి నగదు ప్రయోజనాలు కూడా ఉంటాయి. 10 మంది కంటే ఎక్కువ మంది ఉద్యోగం చేస్తున్న శాశ్వత సంస్థలకు మాత్రమే ఇది వర్తిస్తుంది. 


6. జనశ్రీ బీమా యోజన: 18-59 ఏళ్ల వయస్సు గల పేదల కోసం దీనిని ప్రారంభించారు. మహిళ స్వయం సహాయక సంఘాలు, శిక్ష సహయోగ్ యోజన వంటి ప్రత్యేక ఫీచర్లు దీనిలో ఉన్నాయి.


7. యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ (UHIS): దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల కోసం ఈ పథకాన్ని రూపొందించారు. కుటుంబంలోని ప్రతి సభ్యుడికి వైద్య సేవల కవరేజ్‌ ఉంటుంది. ప్రమాదంలో వల్ల మరణించినా కవర్ ఉంటుంది.


8. డా.వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్:
డా.YSR ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాలుగు హెల్త్‌ స్కీమ్‌లు అమలు చేస్తోంది. 1. పేదల కోసం డా.YSR ఆరోగ్యశ్రీ పథకం, 2. దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న వారి కోసం ఆరోగ్య రక్ష పథకం 3. వర్కింగ్ జర్నలిస్ట్ హెల్త్ స్కీమ్ 4. ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS)


9. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు & జర్నలిస్టుల ఆరోగ్య పథకం: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, జర్నలిస్ట్‌ల కోసం ఈ పథకం ప్రారంభమైంది. పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు కూడా వర్తిస్తుంది. లిస్ట్‌లో ఉన్న ఆసుపత్రుల్లో నగదు రహిత చికిత్స లభిస్తుంది. 


10. ముఖ్యమంత్రి సమగ్ర బీమా పథకం: ఇది తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ పథకం. వెయ్యికి పైగా అనారోగ్యాలను కవర్ చేస్తుంది. రూ.5 లక్షల వరకు ఆసుపత్రి ఖర్చులను క్లెయిమ్ చేసుకోవచ్చు. 


11. యశస్విని ఆరోగ్య బీమా పథకం: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆరోగ్య బీమా పథకం ఇది. సహకార సంఘాల్లో సభ్యులైన రైతులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ పథకం ఉపయోగపడుతుంది. 800కు పైగా అనారోగ్యాలకు వర్తిస్తుంది.


12. కారుణ్య ఆరోగ్య పథకం: దీనిని కేరళ ప్రభుత్వం ప్రారంభించింది. ఖరీదైన, దీర్ఘకాలిక, ఎక్కువ తీవ్రత ఉన్న వ్యాధులు ఈ పథకంలోకి వస్తాయి. పేద ప్రజలు ఈ పథకానికి అర్హులు.


13. పశ్చిమ బంగాల్ ఆరోగ్య పథకం: ఉద్యోగులు, పెన్షనర్ల కోసం తీసుకొచ్చిన పథకం ఇది. రూ.1 లక్ష వరకు బీమా రక్షణ ఉంటుంది. OPD, ఆపరేషన్లు కవర్‌ అవుతాయి.


14. మహాత్మా జ్యోతిబా ఫూలే జన్ ఆరోగ్య యోజన: పేదలు, ముఖ్యంగా రైతుల కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని లాంచ్‌ చేసింది. నిర్దిష్ట అనారోగ్యాల విషయంలో రూ.లక్షన్నర వరకు బీమా రక్షణ ఉంటుంది. దీనిలో ఒక్కరోజు కూడా వెయిటింగ్‌ పిరియడ్‌ లేదు.


15. ముఖ్యమంత్రి అమృతం యోజన: గుజరాత్‌ ప్రభుత్వ పథకం ఇది. పేద ప్రజలు ఈ పథకానికి అర్హులు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షల వరకు వైద్య ఖర్చుల కవరేజీని ఈ పాలసీ అందిస్తుంది. 


ఈ ఆరోగ్య బీమా సంరక్షణ పథకాల కింద ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ చికిత్సలు పొందొచ్చు.


మరో ఆసక్తికర కథనం: ఇల్లు అమ్మిన లాభంపై రూపాయి కూడా టాక్స్‌ కట్టొద్దు, సెక్షన్ 54 మీకు తోడుంటుంది