How To Build Emergency Fund: జీవన గమనం ఎప్పటికీ, ఎవరి ఊహలకు అందదు. కలలో కూడా ఊహించని కష్టాలు ఎలాంటి హెచ్చరిక లేకుండానే మనిషిని ముట్టడించొచ్చు. కూడబలుక్కున్నట్లు ఒకేసారి వచ్చి పడే కష్టనష్టాలను కాచుకునే రక్షణ వలయమే 'అత్యవసర నిధి' (Emergency Fund). ఆర్థిక నష్టాలను తట్టుకునే ఒక కార్పస్ ఇది. ఇంటి బడ్జెట్‌తో సంబంధం లేకుండా, జీవితంలో ఎదురయ్యే ఊహించని ఖర్చుల కోసం ఈ ఫండ్‌ ఉపయోగపడుతుంది.


అత్యవసర నిధిలో ఎంత జమ చేయాలి?


ప్రతి వ్యక్తికి చాలా బాధ్యతలు ఉంటాయి. వాటిన్నింటి నడుమ ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్మించడం సవాలే. అయితే.. అది మీకే కాదు, మీ కుటుంబం మొత్తానికి ధైర్యాన్ని & మనశ్శాంతిని ఇస్తుంది. అత్యవసర నిధి కోసం ఎంత పొదుపు చేయాలన్న విషయం మీ ఆదాయం, బాధ్యతలపై ఆధారపడి ఉంటుంది. నెలవారీ ఖర్చుల్లో భాగంగానే దీనికి కూడా కేటాయింపులు చేయాలి. కనీసం 3 నుంచి 6 నెలల జీతంతో అత్యవసర నిధిని నిర్మించాలి.


మీరు చేసే పొదుపుల్లో ఫస్ట్‌ ప్రయారిటీ ఎమర్జెన్సీ ఫండ్‌కు ఇవ్వాలి. క్యాష్‌ రూపంలో ఇంట్లో పెట్టుకోకుండా, అవసరమైన వెంటనే సులభంగా తిరిగి తీసుకునే మార్గాల్లో పెట్టుబడిగా పెట్టాలి. మీ శాలరీ అకౌంట్‌ లేదా సేవింగ్స్ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా (Auto Debt) డబ్బు కట్‌ అయ్యేలా సెట్‌ చేయాలి. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి కోసం సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను (SIP) ఉపయోగించుకోవచ్చు. డబ్బును పెట్టుబడిగా వినియోగించడం వల్ల వడ్డీ లేదా రాబడి రూపంలో అత్యవసర నిధి పెరుగుతూ ఉంటుంది. 


అత్యవసర నిధిని ఎలా నిర్మించాలి?


సేవింగ్స్ అకౌంట్‌: ఇది చాలా సులభమైన & సురక్షితమైన మార్గం. సేవింగ్స్ ఖాతాలో దాచిన డబ్బును ఎప్పుడైనా వెనక్కు తీసుకోవచ్చు. మీ డబ్బుకు బ్యాంక్‌ వడ్డీ కూడా చెల్లిస్తుంది.


రికరింగ్‌ డిపాజిట్‌: ఒక సంవత్సరం మెచ్యూరిటీతో రికరింగ్ డిపాజిట్‌ ప్రారంభించొచ్చు. దీనివల్ల, ఎమర్జెన్సీ ఫండ్‌ను నిర్మించడమే కాదు, వడ్డీ రూపంలోనూ అదనపు ఆదాయం లభిస్తుంది.


లిక్విడ్ మ్యూచువల్‌ ఫండ్స్‌: లిక్విడ్ మ్యూచువల్ ఫండ్స్‌ కూడా బెస్ట్‌ ఆప్షన్‌. ఇదొక స్పల్పకాలిక పెట్టుబడి విధానం. ఇందులో మీరు జమ చేసే డబ్బును మ్యూచువల్‌ ఫండ్స్‌ డెట్ & మనీ మార్కెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడిగా పెడతాయి. వీటి కాల వ్యవధి 91 రోజులకు మించదు. సేవింగ్స్ ఖాతా కంటే కొంచెం ఎక్కువ వడ్డీ రేటును ఇందులో పొందొచ్చు.


స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు: ఒక సంవత్సరం లోపు కాల వ్యవధితో స్వల్పకాలిక FD వేయవచ్చు. అయితే, మెచ్యూరిటీకి ముందే FDని రద్దు చేసుకుంటే పెనాల్టీ కట్టాల్సి వస్తుంది.



అత్యవసర నిధిని ఎప్పుడు ఉపయోగించాలి?


- ఆదాయం తగ్గినప్పుడు లేదా ఉద్యోగం పోయినప్పుడు కొత్త ఉద్యోగం/ఉపాధిని వెతుక్కునే వరకు మీ ఇంటి ఖర్చుల కోసం ఎమర్జెన్సీ ఫండ్‌ను ఉపయోగించుకోవచ్చు. 
- ఏదైనా అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వస్తే, ఆరోగ్య బీమా పథకం ఉన్నప్పటికీ, ఆసుపత్రి బయటి ఖర్చులను ఎమర్జెన్సీ ఫండ్‌ కవర్‌ చేస్తుంది. అంతేకాదు, ఆ సమయంలో ఇంటి ఖర్చులను కూడా ఇదే చూసుకుంటుంది.
- హఠాత్తుగా కారు చెడిపోయినా, ఇంటికి అత్యవసర మరమ్మతు చేయించాల్సి వచ్చినా నెలవారీ బడ్జెట్‌ మీద భారం పడకుండా ఎమర్జెన్సీ ఫండ్‌ చూసుకుంటుంది.
- ఒక్కోసారి ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, జేబులో డబ్బుండదు. అలాంటి సమయాల్లో ఎమర్జెన్సీ ఫండ్‌ అక్కరకు వస్తుంది, మీపై ఒత్తిడి తగ్గిస్తుంది.


అత్యవసర నిధి దగ్గర ఉంటే, ఎమర్జెన్సీ సమయంలో భారీ రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంటి బడ్జెట్‌పై భారం పడదు. అంతేకాదు, జీవనశైలి అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం కూడా రాదు.


మరో ఆసక్తికర కథనం: ఐటీఆర్‌లో ఈ విషయాన్ని మర్చిపోతే రూ.10 లక్షల ఫైన్‌, చూసుకోండి మరి!