How To Link Aadhar-PAN: మీరు ఇప్పటికీ ఆధార్‌-పాన్‌ లింక్‌ చేయకపోతే చాలా నష్టపోతారు. ముఖ్యంగా... జీతం, పారితోషికం, బ్యాంక్‌ లావాదేవీలు వంటి వాటిపై దీని ప్రభావం పడుతుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్‌ చేయకపోతే, ఆ పాన్‌ కార్డ్‌ డీయాక్టివ్‌ (PAN card Deactivation) అవుతుంది. ఇలాంటి కార్డ్‌ హోల్డర్ల నుంచి రెట్టింపు TDS లేదా TCS వసూలు చేస్తారు. 


అయితే, ఆదాయ పన్ను విభాగం (Income Tax Deportment) టాక్స్‌పేయర్ల కోసం ఇటీవల కొంత ఉపశమనం ప్రకటించింది. ఈ నెల 31వ తేదీ లోగా (2024 మే 31) ఆ రెండు కీలక పత్రాలను అనుసంధానించాలని సూచించింది. అప్పటి వరకు రెట్టింపు TDS లేదా TCS వసూలు చేయకుండా వెసులుబాటు ప్రకటించింది. ఇన్‌కమ్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఇచ్చిన తుది గడువు లోగా పాన్‌-ఆధార్‌ నంబర్‌ అనుసంధానం పూర్తి చేయకపోతే, మీ కంపెనీ లేదా మీ బ్యాంక్‌ రెట్టింపు ముందస్తు పన్ను వసూలు చేస్తుంది. 


పాన్‌-ఆధార్‌ను ఉచితంగా లింక్‌ చేయడం ఇప్పుడు కుదరదు. ఈ పత్రాలను అనుసంధానించాలంటే, ఆదాయ పన్ను పోర్టల్‌లోకి వెళ్లి రూ.1000 జరిమానా చెల్లించాలి. జరిమానా చెల్లించాక దానికి సంబంధించిన చలాన్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే, ఇది చలానా డౌన్‌లోడ్‌ తప్పనిసరి కాదు. పేమెంట్‌ పూర్తయినట్లు ఈ-పే టాక్స్‌లో (e-Pay Tax) కనిపిస్తే పాన్‌-ఆధార్‌ లింక్‌ చేసుకోవచ్చు.



చలాన్‌ పేమెంట్‌ స్టేటస్‌ ఎలా చూడాలి?


1, https://www.incometax.gov.in/iec/foportal/ లింక్‌ ద్వారా ఇన్‌కమ్‌ టాక్స్‌ పోర్టల్‌లోకి వెళ్లాలి. 
2. ఇక్కడ, మీ ఐడీ (PAN), పాస్‌వర్డ్‌ ఉపయోగించి లాగిన్‌ కావాలి. 
3. హోమ్‌ పేజీలో కనిపించే మెనూ బార్‌లో e-File కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే డ్రాప్‌ డౌన్‌ మెనూ ఓపెన్‌ అవుతుంది. 
4. అందులో మూడో ఆప్షన్‌గా e-Pay Tax కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే, మీ చెల్లింపు పూర్తయిందా, లేదా? అనేది తెలుసుకోవచ్చు. 


ఆధార్-పాన్‌ను ఎలా లింక్ చేయాలి? ‍‌(How To Link Aadhar - PAN?)


1. పాన్‌ కార్డ్‌ను ఆధార్‌తో లింక్ చేయడానికి, ఆదాయ పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్ https://incometaxindiaefiling.gov.in/ లోకి వెళ్లాలి.
2. వెబ్‌సైట్‌లో మీరు ఇంకా రిజిస్టర్‌ చేసుకోనట్లయితే, ముందుగా రిజిస్టర్‌ చేసుకోండి. ఇక్కడ, యూజర్‌ ఐడీగా మీ పాన్‌ నంబర్‌ను మాత్రమే ఇవ్వాలి.
3. మీ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్ అవ్వండి.
4. ప్రొఫైల్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'లింక్ ఆధార్‌'పై క్లిక్ చేయండి.
5. మీ పుట్టిన తేదీ, జెండర్‌ వివరాలను ఇప్పుడు నమోదు చేయాలి.
6. మీ మిగిలిన వివరాలను ఆధార్‌తో సరిపోల్చుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి.
7. ఇప్పటికే  రూ.1,000 పెనాల్టీ చెల్లించారు కాబట్టి, మీ పాన్‌-ఆధార్‌ లింక్ చేయవచ్చు.
8. పాన్-ఆధార్ లింక్ అయిన వెంటనే మీ మొబైల్ నంబర్‌కు, ఈ-మెయిల్ ఐడీకి మెసేజ్ వస్తుంది.


పాన్-ఆధార్‌ లింక్ స్థితిని ఎలా తనిఖీ చేయాలి? ‍‌(How To Check Aadhar-PAN Linking Status?)


1. ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్‌ www.incometax.gov.in/iec/foportal/ లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని తనిఖీ చేయవచ్చు.
2. ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీలో, 'Quick Links' విభాగంలోకి వెళ్లి, 'లింక్ ఆధార్ స్టేటస్' మీద క్లిక్ చేయండి.
3. మీ పాన్, ఆధార్ నంబర్లను సంబంధిత గడుల్లో నమోదు చేసి, 'View Linked Aadhaar Status' మీద క్లిక్ చేయండి.
ధృవీకరణ విజయవంతం కాగానే, పాన్‌-ఆధార్ అనుసంధాన స్థితి స్క్రీన్‌పై కనిపిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: ఈ ఐదు అలవాట్లుంటే అంబానీ ఆస్తులు రాసిచ్చిన అడుక్కుతింటారు!