Financial Habits Of The Wealthy: మన దేశ జనాభాలో మెజారిటీ వాటా మధ్య తరగతి కుటుంబాలది. వీళ్లు... పేదలుగా గుర్తింపు పొంది ప్రభుత్వ ప్రయోజనాలను అందుకోలేరు, ధనవంతుల తరహాలో విలాసాలనూ అనుభవించలేరు. మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలు సంపన్నుల కేటగిరీలోకి చేరడానికి కష్టపడాలేమోగానీ, కొన్ని దురవాట్లను వదులుకోకపోతే, ఐదేళ్ల కంటే తక్కువ సమయంలోనే పేదల వర్గంలోకి ఖాయంగా చేరతారని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


మధ్య తరగతి వాళ్లను నిరుపేదలుగా మార్చే 5 దురలవాట్లు


1. అత్యవసర ఖర్చుల కోసం డబ్బు కేటాయించకపోవడం
కనీసం మూడు నుంచి ఆరు నెలల ఖర్చులకు సరిపోయే డబ్బును ఎప్పుడూ దగ్గర ఉంచుకోవాలని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి అత్యవసర నిధి (Emergency Fund) లేకపోతే, ఇప్పటి నుంచైనా ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు. ఎమర్జెన్సీ ఫండ్‌ లేని కుటుంబాల్లో.. ఉద్యోగాన్ని లేదా సంపాదించే వ్యక్తిని కోల్పోవడం వంటి ఊహించని ఘటనలు జరిగితే, అది భారీ ఆర్థిక నష్టానికి దారి తీస్తుంది. ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికి అప్పులు చేయాల్సి వస్తుంది. లేదా, దీర్ఘకాలిక లక్ష్యాలతో పెట్టిన పెట్టుబడులను మధ్యలోనే బ్రేక్‌ చేయాల్సి రావచ్చు. ఫలితం.. ఆ కుటుంబం పేదల కేటగిరీలోకి పడిపోతుంది.



2. ఇతరుల ఆర్థిక బాధ్యతలు తీసుకోవడం
బంధువులు, మిత్రులు, హితుల అవసరాలు గమనించడం మంచి పనే అయినప్పటికీ, సరైన వ్యూహం లేకపోతే మీ డబ్బు ఆవిరైపోతుంది. మీ క్రెడిట్‌ కార్డ్‌ను వాళ్లకు ఇవ్వడం, లోన్ తీసుకుంటే హామీగా ఉండడం వంటివి రిస్క్‌తో కూడుకున్న పనులు. సదరు వ్యక్తులు క్రెడిట్‌ కార్డ్‌ బిల్లు లేదా లోన్‌ చెల్లించలేకపోతే ఆ భారం మీ నెత్తినే పడుతుంది. అంతేకాదు, బాగా కావలసిన వాళ్లే కదా అనుకుంటూ వ్యక్తులను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఇంటి బడ్జెట్‌ భారీగా పెరుగుతుంది. మీ ఫైనాన్షియల్‌ ప్లాన్‌ చిందరవందర అవుతుంది. ఇలాంటి విషయాల్లో 'నొప్పింపక, తానొవ్వక' సూత్రాన్ని అనుసరించాలి. అవసరంలో ఉన్న వ్యక్తికి మీరు ఎంత మేర సాయం చేయగలరో వాస్తవికంగా ఆలోచించి, ఆ గీతను దాటకూడదు. 


3. ఆరోగ్య బీమా లేకపోవడం 
ప్రస్తుతం, మన దేశంలో వైద్య ద్రవ్యోల్బణం (Health Inflation) చాలా ఎక్కువ ఉంది. జలుబుతో ఆసుపత్రికి వెళ్లినా ఆస్తులు రాయించుకుంటున్నారు. వైద్య ఖర్చులు ఆర్థిక భద్రతకు తూట్లు పొడుస్తాయి. కొన్ని తీవ్రమైన సందర్భాల్లో సంవత్సరాల పాటు లేదా జీవితాంతం వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. సరైన ఆరోగ్య బీమా (Health Insurance) కవరేజీ లేని మధ్య తరగతి కుటుంబాలను వైద్య ఖర్చులు నడివీధిలో నిలబెడతాయి. కొవిడ్‌ సమయంలో ఇలాంటి ఉదాహరణలను కోకొల్లలుగా చూశాం.


4. తాహతుకు మించిన రుణాలు
ఒక మధ్య తరగతి కుటుంబాన్ని ఆర్థికంగా కుంగదీసేది వైద్య ఖర్చు మాత్రమే కాదు, అనవసర రుణం కూడా. క్రెడిట్ కార్డ్‌ను ఇష్టం వచ్చినట్లు వాడడం, పిల్లల చదువుల కోసం తాహతుకు మించి రుణం తీసుకోవడం, ఆస్తులను తనఖా పెట్టి లోన్‌ తీసుకోవడం, ఒక అప్పు తీర్చడానికి మరో అప్పు చేయడం వంటివి చేటుకాలం తీసుకొస్తాయి. అనుకోకుండా ఆదాయం తగ్గినపుడో, ఉద్యోగం పోయినప్పుడో వీటి పీడ అర్ధమవుతుంది. ఒకసారి అప్పులు పేరుకుపోవడం మొదలైతే, ఆ సుడిగుండం నుంచి బయటపడటం చాలా కష్టం.


5. ద్రవ్యోల్బణం
ద్రవ్యోల్బణాన్ని (Inflation) పట్టించుకోకుండా ఖర్చు పెట్టే మధ్య తరగతి కుటుంబాలు అతి త్వరగా పేదల వర్గంలో చేరతాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుకూలంగా బడ్జెట్‌ను సర్దుబాటు చేసుకోవడం తప్పనిసరి. మొదట ఇది అసాధ్యం అనిపించినప్పటికీ, క్రమశిక్షణతో పాటిస్తే సుసాధ్యం అవుతుంది. ఇంటి బడ్జెట్‌ను ప్రస్తుత ధరలతో సింక్‌ చేసి, ఖర్చులు తగ్గించుకోవడం తప్పనిసరి. అంతేకాదు, బడ్జెట్‌ను ప్రతి రెండు నెలలకు ఒకసారి సమీక్షించుకోవాలి.


మరో ఆసక్తికర కథనం: హెచ్‌డీఎఫ్‌సీ కస్టమర్లకు అలెర్ట్‌, ఇకపై అలాంటి SMSలు బంద్‌