Income Tax Return Filing 2024: మన దేశంలో స్థిరాస్తిపై పెట్టుబడి పెట్టడానికి దాదాపుగా ఎవరూ సంకోచించరు. చేతిలో డబ్బు ఉంటే ఇల్లో, స్థలమో కొనాలనుకుంటారు. స్థలాన్ని నమ్ముకుంటే లాంగ్‌టర్మ్‌లో లాభాలు చేతికొస్తాయి. ఇంటి ఆస్తి నుంచి డబ్బు సంపాదిస్తే దానిపై ఆదాయ పన్ను చెల్లించాలి. అద్దె రూపంలో డబ్బు వచ్చినా, ఆస్తి అమ్మగా లాభం వచ్చినా.. ఈ రెండు సందర్భాల్లోనూ పన్ను బాధ్యత (Tax Liability) ఉంటుంది. అయితే, పన్ను రేటు భిన్నంగా ఉంటుంది.


ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను
ఇంటిని అమ్మడం వల్ల వచ్చే లాభాన్ని మూలధన లాభంగా (Capital Gain) లెక్కిస్తారు. ఈ మూలధన లాభంపై రెండు రకాల పన్నులు ఉంటాయి. ఆ ఇంటిని కొన్న నాటి నుంచి 2 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత అమ్మితే వచ్చే లాభాన్ని దీర్ఘకాలిక మూలధన లాభం (LTCG) అంటారు. ఇండెక్సేషన్ బెనిఫిట్‌ ‍‌(Indexation Benefit) తర్వాత మూలధన లాభంపై 20% టాక్స్‌ చెల్లించాలి. కొన్న నాటి నుంచి 2 సంవత్సరాల లోపు ఇంటిని విక్రయిస్తే వచ్చే లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభం (STCG) అంటారు. ఐటీఆర్‌ ఫైల్‌ చేసే సమయంలో ఈ లాభాన్ని పన్ను చెల్లింపుదారు (Taxpayer) ఆదాయంలో కలిపి చూపించాలి. ఆ తర్వాత, వర్తించే స్లాబ్ ప్రకారం టాక్స్‌ కట్టాలి.


లాభాలపై పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు
కొన్ని సందర్భాల్లో, ఇంటిని అమ్మితే వచ్చే లాభంపై పన్ను చెల్లిచనక్కర్లేదు. ఇన్‌కమ్‌ టాక్స్‌ యాక్ట్‌లోని సెక్షన్ 54 ప్రకారం, ఒక ఇంటిని విక్రయించడం వల్ల వచ్చే డబ్బుతో మరో ఇంటిని కొంటే పన్ను భారం ఉండదు. ఈ వెసులుబాటు లాంగ్‌టర్మ్‌ క్యాపిటల్‌ గెయిన్‌ విషయంలో మాత్రమే వర్తిస్తుంది. నివాస ఆస్తిని కొనడానికి లేదా నిర్మించడానికి మాత్రమే ఆ మూలధన లాభాన్ని ఉపయోగించాలని సెక్షన్ 54 చెబుతోంది. ఇల్లు అమ్మగా వచ్చిన లాభంతో వాణిజ్య ఆస్తిని కొంటే ఈ సెక్షన్ వర్తించదు. ఒకవేళ, మీరు ఖాళీ స్థలం కొని ఇల్లు కట్టినా కూడా సెక్షన్ 54 వెసులుబాటును ఉపయోగించుకోవచ్చు. లాభం రూపంలో వచ్చిన డబ్బుతో ఓపెన్‌ ఫ్లాట్‌ కొని వదిలేస్తే మాత్రం ఈ బెనిఫిట్‌ వాడుకోలేం. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి ఒక పరిమితి విధించారు. నివాస ఆస్తిపై వచ్చే లాభం రూ. 10 కోట్లు దాటనంతవరకే సెక్షన్‌ 54 పని చేస్తుంది. లాభం రూ. 10 కోట్లు దాటితే దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించాలి.


సెక్షన్ 54 ప్రకారం పన్ను మినహాయింపు పొందాలంటే, పాత ఆస్తిని అమ్మగా వచ్చిన లాభంతో 2 సంవత్సరాల లోపు కొత్త ఇంటిని కొనాలి. అదే డబ్బుతో కొత్త ఇంటి నిర్మాణం ప్రారంభిస్తే మూడేళ్ల లోపు దానిని పూర్తి చేయాలి. నివాస ఆస్తిని అమ్మడానికి ఒక సంవత్సరం ముందే కొత్త ఇంటిని కొనుగోలు చేసినా కూడా సెక్షన్ 54 కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు.


అద్దె ఆదాయంపై వర్తించే పన్ను
అద్దె రూపంలో ఆదాయం వస్తే, ITR ఫైలింగ్‌ సమయంలో, 'అదర్‌ ఇన్‌కమ్‌' విభాగం కింద ఆ ఆదాయాన్ని చూపించాలి. ఇది అసెసీ మొత్తం ఆదాయంలో కలుస్తుంది, వర్తించే స్లాబ్ ప్రకారం టాక్స్‌ కట్టాల్సి ఉంటుంది.


మరో ఆసక్తికర కథనం: కష్టకాలంలో ఆదుకునే బెస్ట్‌ ఫ్రెండ్‌ 'ఎమర్జెన్సీ ఫండ్‌' - దీనిని ఎలా పొందాలి?