Income Tax Saving Tips: మారుతున్న కాలంతో పాటు మార్కెట్‌లో చాలా పెట్టుబడి ఆప్షన్లు అందుబాటులోకి వచ్చాయి. కానీ, నేటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్ (Fixed Deposit Scheme) ఒక పాపులర్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. ఒకవేళ మీరు కూడా ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లో పెట్టుబడి పెడితే, కొన్ని విషయాలు గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. దీనివల్ల, ఎఫ్‌డీపై వచ్చే వడ్డీపై పన్నును ఆదా చేయొచ్చు. లేదంటే మీ ఖాతా నుంచి డబ్బు కట్ అవుతుంది.
ఆదాయ పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం, FD స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే కస్టమర్ ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే ఫామ్ 15G, ఫామ్ 15Hని ఆ బ్యాంక్‌కు సమర్పించాలి. మీరు ఏ బ్యాంక్ FD పథకంలో పెట్టుబడి పెట్టినా ఇది వర్తిస్తుంది. ఫామ్ 15G లేదా ఫామ్ 15Hని బ్యాంక్‌కు సమర్పించకపోతే FDపై వచ్చే వడ్డీపై TDS (Tax Deduction At Source) కట్ అవుతుంది.
ఫామ్ 15G ఎవరు సమర్పించాలి, ఫామ్ 15Hని ఎవరు సమర్పించాలి?
పెట్టుబడిదారు వయస్సు 60 సంవత్సరాల కంటే తక్కువ ఉంటే ఫామ్ 15G నింపి సమర్పించాలి. 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న వ్యక్తులు ఫామ్ 15Hని సమర్పించాలి. ఈ ఫామ్స్ నింపడం వల్ల TDS కట్ కాదు. అంటే.. ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి వయస్సును బట్టి ఫామ్ 15G లేదా ఫామ్ 15Hని బ్యాంక్‌కు చేయాలి.
ఆదాయ పన్ను చట్టంలోని నియమం ప్రకారం, పెట్టుబడిదారు ఒక ఆర్థిక సంవత్సరంలో ఫిక్స్‌డ్ డిపాజిట్ మీద రూ. 40,000 కంటే ఎక్కువ వడ్డీని సంపాదిస్తుంటే, ఫామ్ 15G లేదా ఫామ్ 15H ద్వారా పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చు. ఈ ఫారమ్‌ను సమర్పించిన తర్వాత TDS చెల్లించాల్సిన అవసరం లేదు. ఇలా చేయకుంటే రూ. 40,000 కంటే ఎక్కువ వడ్డీపై పన్ను (TDS) చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ TDS కట్ అయితే, ఆదాయ పన్ను పత్రాలు (ITR) సమర్పించే సమయంలో దానిని క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది.
పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాలపరిమితి తగ్గింపు?
ఆదాయ పన్ను ఆదా చేసేందుకు కొందరు టాక్స్‌పేయర్లు (Taxpayers) 'టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్' పథకాల్లో డబ్బు జమ చేస్తుంటారు. ఈ FDలకు ఐదేళ్ల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే, ఇందులో జమ చేసిన డబ్బును ఐదు సంవత్సరాల వరకు వెనక్కు తీసుకోవడానికి ఉండదు. టైమ్ పిరియడ్ ఎక్కువగా ఉండడంతో ఈ తరహా ఎఫ్‌డీలు బ్యాంక్‌లు ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.
ప్రస్తుతం, మన దేశంలో బ్యాంక్ లోన్లు భారీగా పెరుగుతున్నా డిపాజిట్లు పెరగకపోవడంతో లిక్విడిటీ విషయంలో బ్యాంక్‌లు ఆందోళనగా ఉన్నాయి. టాక్స్ సేవింగ్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల పరిమితిని తగ్గిస్తే ఈ స్కీమ్స్‌లో డిపాజిట్లు పెరుగుతాయని భావిస్తున్నాయి. కాబట్టి.. పన్ను ఆదా ఫిక్స్‌డ్ డిపాజిట్ల కాల వ్యవధిని ఐదేళ్ల నుంచి మూడేళ్లకు తగ్గించాలని కోరుతూ SBI సహా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. 2023-24 ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ లోన్లు 16.3 శాతం మేర పెరిగితే, డిపాజిట్ల వృద్ధి మాత్రం 12.9 శాతం వద్ద ఉంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి