Motor Insurance Claim Settlement: మోటార్ ఇన్సూరెన్స్ తీసుకునే కస్టమర్లకు గుడ్ న్యూస్. క్లెయిమ్‌ల విషయంలో గతంలో ఉన్న అనవసర తతంగానికి తెర పడింది. పేపర్లు లేకపోయినా క్లెయిమ్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. 'భారత బీమా నియంత్రణ & అభివృద్ధి సంస్థ' (IRDAI), మంగళవారం జారీ చేసిన 'మాస్టర్ సర్క్యులర్' ద్వారా సాధారణ బీమా కంపెనీలకు ప్రత్యేక సూచనలు చేసింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను మరింత సులభంగా మార్చడానికి, కస్టమర్ కేంద్రీకృతంగా మలచడానికి IRDAI ఈ సర్క్యులర్ జారీ చేసింది. ఇంతకుముందు కూడా, ఆరోగ్య బీమా క్లెయిమ్‌ల (Health Insurance Claim) కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఇదే విధమైన మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది.
13 పాత సర్క్యులర్లు రద్దు
IRDAI జారీ చేసిన మాస్టర్ సర్క్యులర్ వల్ల మొత్తం 13 పాత సర్క్యులర్‌లను రద్దయ్యాయి. వినియోగదార్ల వ్యక్తిగత అవసరాలను అర్థం చేసుకోవడానికి బీమా కంపెనీలకు ఈ మాస్టర్ సర్క్యులర్ సాయపడుతుందని IRDAI వెల్లడించింది. దీనివల్ల, కంపెనీలు వినియోగదార్ల అవసరాలకు అనుగుణంగా బీమా ఉత్పత్తులను ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. గతంలో కంటే ఎక్కువ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి, బీమా అనుభవం మరింత మెరుగుపడుతుంది.
మోటార్ బీమా క్లెయిమ్‌లు మరింత సులభం
కొన్ని పత్రాలు లేకపోయినా కస్టమర్ల క్లెయిమ్‌లను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు తిరస్కరించకూడదని మాస్టర్ సర్క్యులర్‌లో IRDAI స్పష్టం చేసింది. దీంతో పాటు... అనవసరమైన తతంగానికి పోకుండా, అవసరమైన పత్రాలను మాత్రమే కస్టమర్ల నుంచి తీసుకోవాలని కూడా బీమా కంపెనీలను ఆదేశించింది.
ఆరోగ్య బీమా తరహాలోనే కస్టమర్లకు 'కస్టమర్ ఇన్ఫర్మేషన్ షీట్' (CIS) జారీ చేయాలని బీమా నియంత్రణ సంస్థ మోటార్ బీమా కంపెనీలకు సూచించింది. దీనివల్ల, వినియోగదార్లు పాలసీ వివరాలను సాధారణ భాషలో తెలుసుకునే అవకాశం పొందుతారు. కస్టమర్‌కు వర్తించే బీమా కవరేజీ, యాడ్-ఆన్‌లు, బీమా మొత్తం, షరతులు, వారంటీ, క్లెయిమ్ ప్రక్రియ వంటి సమాచారాన్ని CISలో బీమా కంపెనీలు అందిస్తాయి.
పాలసీని రద్దు చేయడం కూడా సులభం
పాలసీని రద్దు చేసే ప్రక్రియను, కస్టమర్లకు రిఫండ్ ప్రాసెస్‌ను కూడా IRDAI మాస్టర్ సర్క్యులర్‌తో సులభంగా మార్చింది. ఇప్పుడు, బీమా పాలసీని రద్దు చేయడానికి గల కారణాన్ని పాలసీదారు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే, దీనికోసం పాలసీ వ్యవధి కనీసం 1 సంవత్సరం ఉండాలి, ఆ కాలంలో కస్టమర్ ఎలాంటి క్లెయిమ్ చేసి ఉండకూడదు. ఒక సంవత్సరం కంటే కాలం హోల్డ్ చేసిన పాలసీ విషయంలో ప్రీమియం వాపసును కూడా క్లెయిమ్ చేయొచ్చు.
పాలసీని రద్దు చేయడానికి, కస్టమర్ కేవలం 7 రోజుల ముందు సదరు కంపెనీకి నోటీసు జారీ చేస్తే చాలు. దీంతో పాటు, పే యాజ్ యు డ్రైవ్ (pay as you drive), పే యాజ్ యు గో (pay as you go) వంటి ఆప్షన్లను కూడా కస్టమర్లకు ఇవ్వాలని బీమా కంపెనీలకు IRDAI సూచించింది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి