Income Tax Return Filing 2024: ఆర్థిక సంవత్సరం 2023-24 లేదా మదింపు సంవత్సరం 2024-25 కోసం ఆదాయ పన్ను రిటర్న్‌ (ITR 2024) దాఖలు చేయడానికి జులై 31వ తేదీ వరకు గడువుంది. టాక్స్‌పేయర్లు (Taxpayers) ఒక ఆర్థిక సంవత్సరంలో వివిధ రకాల ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తారు. గృహ రుణం (Home Loan) తీసుకోవడం వాటిలో ఒకటి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఒక ఇల్లు/ఫ్లాట్‌ కొని, ఆ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ముందే హోమ్‌ లోన్‌పై వడ్డీ (Interest on Home Loan) కడితే, ఆ వడ్డీపై పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయవచ్చా అన్నది చాలామంది టాక్స్‌పేయర్లలో ఉన్న సందేహం.


ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద, హోమ్ లోన్ అసలు (Principal Amount) చెల్లింపుపై, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల తగ్గింపును (Deduction) క్లెయిమ్‌ చేసుకోవచ్చు. నిర్మాణం పూర్తయిన లేదా నిర్మాణంలో ఉన్న ఇల్లు/ఫ్లాట్‌కు ఈ ప్రయోజనం వర్తిస్తుంది.


గృహ రుణంపై వడ్డీ చెల్లింపుల విషయానికి వస్తే.... 
ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 24B కింద, ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.2 లక్షల వడ్డీ మొత్తంపై పన్ను మినహాయింపు (Tax Exemption On Home Loan Interest Amount) లభిస్తుంది. సెక్షన్ 80EE కింద, వడ్డీ మొత్తంపై మరో రూ.50,000 మినహాయింపు ప్రయోజనం కూడా ఉంటుంది. అయితే... సెక్షన్ 80EE కింద మినహాయింపు పొందడానికి కొన్ని షరతులు ఉన్నాయి. మొదటిసారిగా ఇంటిని కొనుగోలు చేసిన వ్యక్తికి ఈ సెక్షన్‌ వర్తిస్తుంది. అంతేకాదు, ఆ ఇంటి ధర రూ.50 లక్షల లోపు ఉండాలి.


అయితే... బిల్డర్‌ నుంచి ఇల్లు లేదా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకోవడానికి ముందు చెల్లించిన హోమ్‌ లోన్ వడ్డీపై ఆదాయ పన్ను మినహాయింపును వెంటనే క్లెయిమ్ చేసుకోలేరు. వాస్తవానికి... గృహ రుణం తీసుకున్న మొదటి సంవత్సరం నుంచి సెక్షన్ 80C కింద అసలు రీపేమెంట్‌పై రూ. 1.50 లక్షల వరకు తగ్గింపు ప్రయోజనాన్ని పొందొచ్చు. అంటే, ఇల్లు లేదా ఫ్లాట్‌ నిర్మాణంలో ఉన్నప్పటికీ సెక్షన్ 80C కింద మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కానీ, సెక్షన్‌ 24B కింద వడ్డీని క్లెయిమ్‌ చేయలేరు. నిర్మాణం ముగిసి, కొనుగోలుదారు ఆ ఆస్తిని స్వాధీనం చేసుకున్న తర్వాతే వడ్డీపై మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. 


నిర్మాణంలో ఉన్న సమయంలో చెల్లించిన వడ్డీని నిర్మాణం పూర్తయిన తర్వాత క్లెయిమ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిని, ఇల్లు లేదా ఫ్లాట్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఐదేళ్లలో ఐదు సమాన వాయిదాల్లో క్లెయిమ్ చేయవచ్చు. అయితే, పాత వడ్డీ (నిర్మాణ సమయంలో చెల్లించిన వడ్డీ), పస్తుత వడ్డీ కలిపి ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ. 2 లక్షలకు మించి క్లెయిమ్‌ చేయలేరు. 


టాక్స్‌ బెనిఫిట్‌ క్లెయిమ్ చేయడానికి ఈ సర్టిఫికేట్ అవసరం
సెక్షన్ 24B కింద, హోమ్‌ లోన్‌ పాత + ప్రస్తుత వడ్డీ మినహాయింపు ప్రయోజనాలను మీరు క్లెయిమ్‌ చేయాలంటే, ఆ ఇంటి నిర్మాణం పూర్తయినట్లు రుజువు చూపించాలి. దీనికోసం మీ దగ్గర ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (Occupancy Certificate) లేదా స్వాధీనం పత్రం (Possession Certificate) ఉండాలి. ఆదాయ పన్ను చట్ట ప్రకారం, ఈ రుజువు లేకుండా సెక్షన్ 24B ప్రయోజనాన్ని ఉపయోగించుకోలేరు.


మరో ఆసక్తికర కథనం: పెన్షన్ ఎవరికి వస్తుంది, అర్హతలేంటి, ఎంత పింఛను వస్తుందో ఎలా లెక్కించాలి?