EPF Pension Scheme Rules And Eligibility: ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని ‍‌(Employee Pension Scheme లేదా EPS) 1995లో ప్రారంభించారు. ఇది సామాజిక భద్రత పథకం. ఇందులో చేరిన వ్యక్తి ఆర్థిక భవిష్యత్‌కు భద్రత లభిస్తుంది. ఈ పథకాన్ని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అమలు చేస్తోంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, తన EPF చందాదార్లకు (EPF Subscribers) పెన్షన్ సౌకర్యాన్ని అందిస్తోంది. చందాదార్లతో పాటు, వారి కుటుంబ సభ్యులు, నామినీలు కూడా పింఛను ప్రయోజనం పొందుతారు. 


EPF పెన్షన్ అర్హతలు ఏంటి?
-- ఒకే సంస్థలో లేదా వివిధ సంస్థల్లో కలిపి 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా పని చేసిన వ్యక్తికి కార్మిక చట్టం ప్రకారం పెన్షన్‌ లభిస్తుంది. 
-- 10 సంవత్సరాలకు తక్కువ కాకుండా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌కు విరాళం/చందా అందించిన EPFO సబ్‌స్క్రైబర్‌కు ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ ప్రయోజనం అందుతుంది. 
-- చందాదారు వయస్సు 50 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కూడా అతను ఆటోమేటిక్‌గా పెన్షన్ పొందేందుకు అర్హుడు అవుతాడు.


పెన్షన్‌ ఎలా లెక్కించాలి?
ఒక EPFO సబ్‌స్క్రైబర్‌కు EPS పథకం ద్వారా అందే పెన్షన్‌ను చాలా సులభంగా లెక్కించొచ్చు. సబ్‌స్కైబర్‌కు అందే పింఛను మొత్తం రెండు విషయాలపై ఆధారపడి ఉంటుంది. ఒకటి.. అతను పెన్షన్ స్కీమ్‌ కోసం ఎంతకాలం పాటు కాంట్రిబ్యూట్‌ చేశాడు? రెండు.. పదవి విరమణకు 60 నెలల ముందు అతని సగటు జీతం ఎంత?. ఈ రెండు విషయాల కచ్చితమైన లెక్క సబ్‌స్కైబర్‌కు తెలిసి ఉండాలి.


EPF వెబ్‌సైట్‌లో చెక్‌ చేయవచ్చు
-- పెన్షన్‌ లెక్కించడం కోసం, ముందుగా EPF అధికారిక వెబ్‌సైట్ epfindia.gov.in లోకి వెళ్లాలి.  
-- ఇప్పుడు, హోమ్‌ పేజీలో కనిపించే "Online Service" ఆప్షన్‌ను ఎంచుకోండి.
-- తర్వాత, "EDLI & Pension Calculator" ఆప్షన్‌ను ఎంచుకోండి.
-- ఈ ఆప్షన్‌ ఎంచుకునే ముందు, కాలిక్యులేటర్‌ను ఎలా ఉపయోగించాలో అర్ధం చేసుకోండి.
-- "EDLI & Pension Calculator"లో అవసరమైన వివరాలను నమోదు చేయండి.
-- ఇప్పుడు, ఒక వ్యక్తికి ఎంత పెన్షన్ మొత్తం వస్తుందో తెలుస్తుంది.


పెన్షన్‌ రూల్స్‌
-- ఉద్యోగ జీవితం తర్వాత నెలనెలా పింఛను పొందాలంటే, ఒక EPF సబ్‌స్క్రైబర్‌ కనీసం 10 సంవత్సరాల పాటు ఉద్యోగుల పెన్షన్ పథకానికి కాంట్రిబ్యూట్‌ (డబ్బు జమ) చేయాలి. 
-- ఒకవేళ, ఒక చందాదారు 20 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విరాళం (కాంట్రిబ్యూట్‌) ఇస్తే, ఆ వ్యక్తికి రెండు సంవత్సరాల బోనస్ ప్రయోజనం కూడా లభిస్తుంది. 
-- ఒక చందాదారు 50 సంవత్సరాల నుంచి 58 సంవత్సరాల మధ్య పదవి విరమణ చేస్తే, ఆ తర్వాత పొందే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటుంది. ఈ కేస్‌లో పెన్షన్‌ మీద వడ్డీ రేటు 4 శాతం కంటే తక్కువగా ఉంటుంది. 
-- ఒక ఉద్యోగి తన 58 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేస్తే, అతని 60 సంవత్సరాల వయస్సు వరకు ప్రతి సంవత్సరం 4 శాతం ఎక్కువ పెన్షన్ రేటు లభిస్తుంది.


మరో ఆసక్తికర కథనం: పెన్షన్ల విధానంలో మార్పు, 'ఆంధ్రప్రదేశ్‌ మోడల్‌' వైపు మొగ్గు - 'బేసిక్‌ పే'లో 50 శాతం గ్యారెంటీ!