Guaranteed Pension Scheme: మోదీ 3.0 ప్రభుత్వంలో కేంద్ర ఉద్యోగుల కోసం కొత్త పెన్షన్ విధానాన్ని గవర్నమెంట్ పరిశీలిస్తోంది. ప్రస్తుతం, ప్రభుత్వ ఉద్యోగులు 'నేషనల్ పెన్షన్ సిస్టమ్' (NPS) కింద పింఛను పొందుతున్నారు. NPS విధానంలో... ఎంత డబ్బు డిపాజిట్ చేశారు, ఎంతకాలం డబ్బు డిపాజిట్ చేశారు, దానిపై ఎంత రాబడి వచ్చిందన్న అంశాలపై పెన్షన్ ఆధారపడి ఉంటుంది. ఎక్కువ డబ్బును ఎక్కువ కాలం డిపాజిట్ చేస్తేనే ఎక్కువ పింఛను లభిస్తుంది.
కొత్త ప్రభుత్వం NPS విధానంలో మార్పులు చేసి ఉద్యోగులకు ఖచ్చితమైన మొత్తాన్ని పింఛనుగా ఇచ్చే ప్రతిపాదనను పరిగణించే అవకాశం ఉంది. ఈ ఖచ్చితమైన మొత్తం ఉద్యోగుల చివరి 'బేసిక్ పే'లో 50% వరకు ఉండొచ్చు. ఉదాహరణకు.. ఒక వ్యక్తి చివరి ప్రాథమిక వేతనం రూ.70,000 అయితే, అతను ఖచ్చితంగా రూ.35,000 వరకు పెన్షన్ పొందొచ్చు.
ఏడాది క్రితం కమిటీ ఏర్పాటు
కొత్త పింఛను విధానాన్ని పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం 2023 మార్చిలో ఆర్థిక శాఖ కార్యదర్శి టి.వి.సోమనాథన్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది. పాత పింఛను విధానంలోకి (OPS) తిరిగి రాకుండా, ప్రభుత్వ ఉద్యోగులకు NPS కింద పెన్షన్‌ను పెంచే మార్గాలను సూచించడం ఈ కమిటీ లక్ష్యం.
వివిధ పింఛను విధానాలను పరిశీలించిన కమిటీ, ఈ ఏడాది మే నెలలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. 2023లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపాదించిన పెన్షన్ మోడల్‌ను ఈ కమిటీ ప్రముఖంగా ప్రస్తావించింది. ఈ మోడల్ ప్రకారం, ఉద్యోగులకు వారి చివరి జీతంలో 40% నుంచి 50% వరకు పెన్షన్ లభిస్తుంది. ఇదే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో కావచ్చని కమిటీ సూచించింది. దీనిని అమలు చేస్తే.. దాదాపు 87 లక్షల మంది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై ప్రభావం ఉంటుంది.
పాత పెన్షన్ విధానం కోరుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ ఏడాది జనవరి 11న ప్రభుత్వానికి ఒక మెమోరాండం సమర్పించారు. ప్రస్తుతం అమల్లో ఉన్న NPSను తొలగించి, ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ను (OPS) తిరిగి తీసుకురావాలని ఈ మెమోరాండంలో డిమాండ్ చేశారు. ఎందుకంటే... పాత పెన్షన్ విధానంలో ఉద్యోగులు తమ డబ్బును యాన్యుటీ స్కీమ్స్‌లో జమ చేయాల్సిన అవసరం లేదు. చివరి జీతంలో సగం డబ్బు స్థిరంగా పెన్షన్ రూపంలో వస్తుంది. NPS విధానంలో, పదవీ విరమణ సమయంలో తాను అందుకునే డబ్బులో కనీసం 40% మొత్తాన్ని యాన్యుటీ స్కీమ్స్‌లో జమ చేయాలి, గరిష్టంగా 60% మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. పైగా, యాన్యుటీ స్కీమ్స్ స్టాక్ మార్కెట్ సంబంధితం కాబట్టి, ఈ విధానంలో వచ్చే పింఛను స్టాక్ మార్కెట్ హెచ్చుతగ్గులపై ఆధారపడి ఉంటుంది, స్థిరంగా ఉండదు.
భారతదేశంలో, పెన్షన్ సంస్కరణల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసింది. 2004 జనవరి 1 నుంచి విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ NPSను అమలు చేస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న పెన్షన్ మోడల్ ఏది?
'ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీడ్ పెన్షన్ సిస్టమ్' (APGPS) చట్టం 2023 ప్రకారం, విశ్రాంత ఉద్యోగి అందుకున్న పెన్షన్ మొత్తం (యాన్యుటీ) తక్కువగా ఉంటే, ప్రభుత్వం అదనంగా కొంత డబ్బు కలిపి ఇస్తుంది. ఫలితంగా, ఆ విశ్రాంత ఉద్యోగి తన చివరి జీతంలో 50%కు సమాన మొత్తాన్ని పొందుతాడు. APGPS ఉద్యోగి చనిపోతే.. అతని/ఆమె జీవిత భాగస్వామికి వచ్చే పెన్షన్ తగ్గితే, ప్రభుత్వం అతని/ఆమె పెన్షన్‌కు కొంత డబ్బును జోడించి ఇస్తుంది. ఫైనల్‌గా, జీవిత భాగస్వామి తీసుకున్న పెన్షన్‌లో 60% మొత్తం అతని/ఆమెకు ఇస్తుంది. పింఛన్ మొత్తం రూ.10 వేల లోపు ఉంటే, ప్రభుత్వం రూ.10 వేలకు పెంచుతుంది. ఈ చట్టం కింద రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆరోగ్య బీమా కల్పిస్తారు.
NPSలో మార్పులకు సంబంధించి సోమనాథన్ కమిటీ చాలా అంశాలను చర్చించింది. ఆంధ్రప్రదేశ్ తరహాలో NPSలో 'గ్యారెంటీడ్ పెన్షన్ ఆప్షన్' అమలు చేస్తే ఉద్యోగులు OPSను మర్చిపోతారని సూచించింది. ఇప్పుడు, బంతి మోదీ 3.0 సర్కార్ కోర్ట్‌లో ఉంది. పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం గట్టిగా నిరాకరిస్తోంది కాబట్టి, NPSలో మార్పులకే మొగ్గు చూపే అవకాశం ఉంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి