మార్కెట్లు బూమ్‌లో ఉనప్పుడు ఆ స్టాక్‌ కొనండి, ఈ స్టాక్‌ కొనండీ అంటూ ఒకటే సలహాలు! ఈక్విటీ సూచీలు వరుసగా వరుసగా గరిష్ఠాలను తాకుతుండటంతో చాలామంది తొందర పడికొనేస్తారు. అప్పటికే లాభపడ్డ కొందరు వాటిని అమ్మేసి హాయిగా ఉంటారు. కొన్నవాళ్లు ధర పెరగకపోవడంతో ఇబ్బంది పడుతుంటారు. అవగాహన లేకుండా మార్కెట్లో పెట్టుబడులు పెట్టడంతో వచ్చే సమస్యలే ఇవి. అలాంటప్పుడే SIP, STP ఉపయోగపడతాయి.


SIP, STP ఉన్నాయి


ఈక్విటీ మార్కెట్లపై అవగాహన లేనివారికి మ్యూచువల్‌ ఫండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టాక్స్‌లో అయితే నేరుగా పెట్టుబడి పెట్టాలంటే ఎంతో అనాలసిస్‌ చేయాలి. రీసెర్చ్‌ అవసరం అవుతుంది. ఏ టైంలో మార్కెట్లోకి ఎంటర్‌ అవ్వాలో ఎప్పుడు ఎగ్జిట్‌ అవ్వాలో తెలియాలి. మ్యూచువల్‌ ఫండ్లలో అయితే ఇలాంటి రిస్క్‌ ఉంటుంది. వీటిని అనుభవం ఉన్న ఫండ్‌ మేనేజర్లు మేనేజ్‌ చేస్తుంటారు. మీ డబ్బును సరైన స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టి లాభాలు అందిస్తారు. మ్యూచువల్‌ ఫండ్లలో నేరుగానే కాకుండా సిప్‌ సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (Systematic Investment Plan - SIP), సిస్టమేటిక్‌ ట్రాన్స్‌ఫర్‌ ప్లాన్‌ (Systematic Transfer plan - STP) ద్వారా పెట్టొచ్చు.


SIP ప్రయోజనాలు ఇవీ


సిప్‌ గురించి మీరు ఇప్పటికే చాలాసార్లు వినుంటారు. ప్రతినెలా కొంత మొత్తాన్ని మ్యూచువల్‌ ఫండ్లో పెట్టుబడి పెట్టడమే సిప్‌. ఇందులో వంద రూపాయిల నుంచి ఎంతైనా పెట్టొచ్చు. దీర్ఘకాలంలో ఇది మీకు మంచి వెల్త్‌ను క్రియేట్‌ చేస్తుంది. స్వల్పకాలంలో వచ్చే ఒడుదొడుకుల భయం ఉండదు. ఒక లక్ష్యాన్ని అనుగుణంగా సిప్‌ చేయడం ద్వారా 5-10-15-20 ఏళ్లలో దానిని సాధించొచ్చు. పైగా సిప్‌ ద్వారా రూపీ యావరేజింగ్‌ ప్రయోజనం లభిస్తుంది. నెట్‌ అసెట్స్‌ వాల్యూ (NAV) తక్కువగా ఉన్నప్పుడు ఎక్కువ యూనిట్లు వస్తాయి. ఎక్కువగా ఉన్న తక్కువ యూనిట్లు వస్తాయి. అలా ఇన్వెస్టర్లకు యావరేజింగ్‌ ప్రయోజనం కలుగుతుంది. ఇందులో ముఖ్యమైన మరో విషయం కాంపౌండిగ్‌ పనిచేస్తుంది.


STPతో మరో స్కీమ్‌లోకి


మార్కెట్‌ పరిస్థితులు, మీ ఆర్థిక అవసరాలను బట్టి సిస్టమాటిక్‌ పోర్టుపోలియో రీబాలెన్సింగ్ చేసుకోవడానికి ఎస్‌టీపీ (STP) ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఈక్విటీ మార్కెట్లు వొలటైల్‌గా ఉన్నప్పుడు ఒక ఈక్విటీ స్కీమ్‌ నుంచి హైబ్రీడ్‌ లేదా డెట్‌ ఆధారిత స్కీముల్లోకి డబ్బును పద్ధతిగా బదిలీ చేసుకోవచ్చు. మార్కెట్లు మళ్లీ స్టెబిలైజ్‌ అయ్యాక డబ్బును తిరిగి ఈక్విటీ స్కీముల్లోకి మార్చుకోవచ్చు. రోజు నుంచి సంవత్సరం వరకు మీకిష్టమైన తేదీన బదిలీ చేసుకోవచ్చు. ఇన్‌స్టాల్‌మెంట్లను ప్లాన్‌ చేసుకోవచ్చు.


ఎస్‌టీపీ మూడు రకాలుగా ఉంటుంది. ఫిక్స్‌డ్‌, క్యాపిటల్‌ అప్రిసియేషన్‌, ఫ్లెక్సీ. మొదటి దాంట్లో పెట్టుబడి పెట్టేముందే ఎస్‌టీపీ డబ్బును నిర్ణయించుకోవాలి. రెండో దాంట్లో అప్పటికే రాబడి వస్తున్న స్కీమ్‌ నుంచి మరోదానికి మారుతారు. ఇక మూడోదాంట్లో ఇన్వెస్టర్లు తమకు నచ్చిన మొత్తాన్ని మరో కొత్త స్కీమ్‌లోకి బదిలీ చేయొచ్చు. అర్థమైంది కదా SIP, STP వల్ల లాభాలేంటో!