మధ్యప్రదేశ్‌లోని జబల్‌ పూర్ ఎయిర్‌పోర్టులో భారీ ప్రమాదం తప్పింది. 55మంది ప్రయాణికులతో ట్రావెల్ చేస్తున్న విమానం ల్యాండ్ అయ్యే టైంలో ప్రమాదానికి గురైంది. కిందికి దిగుతున్నప్పుడు విమానం రన్‌వేపై నుంచి పక్కకు జారిపోయింది. 


ఈ ప్రమాదంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే పైలట్‌ అప్రమత్తతో ఎలాంటి నష్టం లేకుండా జాగ్రత్త తీసుకున్నారు. 


ATR72-600 నెంబర్‌ గల విమానం దిల్లీ నుంచి జబల్‌పూర్‌ చేరుకుంది. ప్రమాదం సమయంలో 55 మంది ప్రయాణికులు, ఐదురుగు సిబ్బంది ఉన్నారు. మధ్యాహ్నం 1:15 గంటలకు జబల్‌పూర్‌లో దిగాల్సి ఉంది. అప్పుడే ప్రమాదానికి గురైంది విమానం. 






ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్ ఏవియేషన్ అధికారులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ప్రకటించారు. 


గతేడాది ఫిబ్రవరిలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. దోహా నుంచి గన్నవరం చేరుకున్న ఎయిరిండియా విమానం ప్రమాదానికి గురైంది. అప్పుడు కూడా ల్యాండింగ్ టైంలోనే విమానం రన్‌వే పైనుంచి పక్కకు తప్పుకుంది.  రన్‌వే నుంచి పార్కింగ్‌కు వెళ్తుండగా రన్‌వే పక్కనే ఉన్న ఫ్లడ్‌లైట్‌ పోల్‌ను ఢీ కొట్టింది విమానం. ఆ రోజు కూడా విమానంలో సుమారు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్లు ప్రమాద సమయంలో కంగారు పడ్డారు. అప్పుడు కూడా ఎవరికీ ఎలాంటి గాయాలు తగల్లేదు. 


ఇవాళ జరిగిన ప్రమాదంతో ఎయిర్‌పోర్ట్‌లో నాలుగు నుంచి ఐదు గంటల పాటు కార్యకలాపాలు నిలిపివేసినట్లు ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ కుసుమ్ దాస్ తెలిపారు.


ఫ్లైట్ నంబర్ E-9167 ఎయిర్‌స్ట్రిప్ పక్కన ఉన్న బురదలో మునిగిపోయింది, దీని కారణంగా విమానం ముందు ల్యాండింగ్ వీల్ బాగా దెబ్బతింది. ముందుజాగ్రత్తగా, అధికారులు అక్కడికక్కడే అంబులెన్స్, అగ్నిమాపక దళాన్ని పిలిపించారు.ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని ప్రయాణికులకు ధైర్యం చెప్పారు.