Karnataka UPI: కర్ణాటకలో చిన్న వ్యాపారులు,  వీధి వ్యాపారులు యూపీఐ (UPI) చెల్లింపులను అంగీకరించడం మానేశారు.  నగదు లావాదేవీలకు తిరిగి మారుతున్నారు. దీనికి  కారణం కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ  జీఎస్టీ నోటీసులు పంపుతూండటమే.  లక్షల రూపాయల పన్ను బకాయిలుఉన్నాయని  కట్టాలని ఈ నోటీసులు జారీ చేస్తున్నారు.  ఈ సమస్య బెంగళూరు, మైసూరు తో పాటు ఇతర ప్రాంతాల్లోని చిన్న వ్యాపారులను  ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకొచ్చిన తంటా అని యూపీఐ పేమెంట్లను నిరాకరిస్తున్నారు. 

ఏదైనా వస్తువులు అమ్మే వ్యాపారం చేసే వ్యాపారులు సంవత్సరానికి రూ. 40 లక్షలు , సేవలు అందించే వ్యాపారం చేసేవారు రూ. 20 లక్షలు టర్నోవర్ దాటితే జీఎస్టీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఈ రిజిస్ట్రేషన్ లేని వ్యాపారులు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.  కర్ణాటక వాణిజ్య పన్నుల శాఖ 2021-22 నుండి 2024-25 వరకు యూపీఐ లావాదేవీల డేటాను విశ్లేషించింది.   రూ. 20 లక్షల లావాదేవీలు దాటిన దాటిన వ్యాపారులను గుర్తించింది. దీని ఆధారంగా సుమారు 14,000 మంది వ్యాపారులకు నోటీసులు జారీ చేసిది.   

చాలా మంది చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారులు, హోటల్ యజమానులు, ఆటో డ్రైవర్లు,  పెయింగ్ గెస్ట్ హాస్టల్స్  నిర్వాహకులు యూపీఐ ద్వారా లావాదేవీలు చేసినందుకు లక్షల రూపాయల జీఎస్టీ బకాయిల నోటీసులు అందుకున్నారు.  హవేరి జిల్లాకు చెందిన శంకరగౌడ హడిమని అనే కూరగాయల వ్యాపారి..  నాలుగు సంవత్సరాలలో రూ. 1.63 కోట్ల యూపీఐ లావాదేవీలు చేసినందుకు రూ. 29 లక్షల జీఎస్టీ చెల్లించాలని నోటీసు అందింది. కూరగాయలు జీఎస్టీ కిందకు రావు. అయినా నోటీసులు ఇచ్చారు.  

ఈ నోటీసులు వ్యాపారులలో  భయాన్ని కలిగిస్తున్నాయి. ఫలితంగా, బెంగళూరు, మైసూరు,  తర ప్రాంతాలలో చాలా మంది వ్యాపారులు యూపీఐ క్యూఆర్ కోడ్‌లను తొలగించారు.  నగదు మాత్రమే అని బోర్డులు ఏర్పాటు చేశారు.  కర్ణాటక ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.20 లక్షల కోట్ల పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. దాంతో చిన్న వ్యాపారులను టార్గెట్ చేసింది.  వ్యాపార సంఘాలు జీఎస్టీ నోటీసులను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ జూలై 25 న రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చాయి. జూలై 23న పాలు, జూలై 24న సిగరెట్లు ,  గుట్కా విక్రయాలను నిలిపివేయడం, జూలై 25న బేకరీలు, చిన్న దుకాణాలు,  కండిమెంట్ షాపులు మూసివేయడం వంటి  నిరసనలు చేపట్టనున్నారు.   యూపీఐ చెల్లింపులను తిరస్కరించడం వల్ల వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు.  

అయితే  జీఎస్టీ రిజిస్ట్రేషన్ లేని వ్యాపారులకు మాత్రమే నోటీసులు జారీ చేశామని  వారు తమ టర్నోవర్‌ను వివరించాలని లేదా కంపోజిషన్ స్కీమ్‌లో చేరాలని అధికారులు అంటున్నారు. చిన్న వ్యాపారులకు ఈ సమస్య ఎదుర్కోవడం కన్నా..  నగదు లావాదేవీలుచేస్తేచాలని అనుకుంటున్నారు.