Former Excise Minister Narayana Swamy: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ స్కాం సంచలనం రేపుతోంది. ఈ స్కాంపై వైసీపీ నేత, మాజీ ఎక్సైజ్ మంత్రి నారాయణ స్వామి తాజాగా సంచలన వ్యాఖ్యలుచేశారు. స్కామ్‌లో వేరే వాళ్లు సంపాదించుకుని ఉండవచ్చు కానీ నేను నిజాయితీగా ఉన్నానని ప్రకటించారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ స్కాం గురించి తనకు తెలిసిన విషయాలన్నింటినీ సిట్‌కు చెబుతానని విచారణకు సహకరిస్తానని ప్రకటించారు.
నారాయణ స్వామి ఎక్సైజ్ మంత్రిగా ఉన్నప్పుడే ఈ లిక్కర్ స్కాం జరిగింది. అందుకే ఆయన వాంగ్మలాన్ని నమోదు చేసుకునేందుకు సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీచేశారు. సోమవారం హాజరు కావాలని సూచించారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని తాను రాలేనని చెప్పారు. దాంతో సిట్ అధికారులు స్థానిక సీఐను.. నారాయణ స్వామి ఇంటికి పంపి.. వీడియో కాల్ ద్వారా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ఆయన ఏం సమాధానాలిచ్చారో కానీ. ప్రెస్మీట్‌లో కొన్ని విషయాలపై మాట్లాడారు. లిక్కర్ డిజిటల్ లావాదేవీలు వద్దన్న మాట నిజమేనన్నారు. ఎందుకు వద్దన్నారు..ఎవరు వద్దన్నారు అన్నది మాత్రం చెప్పలేదు. తనను ఈ కేసులో ఇరికించేందుకు కొంత మంది వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సిట్ విచారణకు సహకరిస్తానన్నారు.
2019 -2024 మధ్యలో వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం నారాయణ స్వామి మంత్రిగా ఉన్నారు. ఎక్సైజ్, కమర్షఇయల్ టాక్సెస్ వంటి కీలక శాఖల్ని నిర్వహించారు. అయితే ఎప్పుడూ ఆయన అధికారులతో సమావేశాలు నిర్వహించనట్లుగా కానీ.. తన శాఖల విషయంలో సమీక్షలు చేసినట్లుగా కానీ ఎప్పుడూ బయటకు రాలేదు. మంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఎక్కువగా నియోజకవర్గానికే పరిమితయ్యేవారు. సాధారమంగా పతన శాఖలో జరిగే వ్యవహారాలపై ఆయనకు పెద్దగా సమాచారం ఉండేద ికాదు. పై స్థాయిలో నిర్ణయాలు తీసుకుని ఆదేశాలు జారీ చేస్తూ ఉంటారు. దాంతో నారాయణ స్వామి పదవి ఉంటే చాలన్నట్లుగా సైలెంట్గా ఉండిపోయారు.
ఇప్పుడు ఆ కేసు తనను చుట్టుముట్టేలా ఉండటంతో..తనను టార్గెట్ చేస్తారన్న అనుమానంతో నారాయణ స్వామి బయటకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీ నేతలే తనను ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని.. తన శాఖల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం తనకు ఎప్పుడూ ఇవ్వకపోయినా.. ఇప్పుడు భారీ లిక్కర్ స్కాంలో తనను నిందితుడిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. అందుకే సేఫ్ గా తప్పించుకోవాలని.. సిట్ కు కావాల్సిన వివరాలన్నీ ఇస్తానని చెబుతున్నారని అంటున్నారు.
ఎక్సయిజ్ మంత్రిగా ఉన్నప్పటికీ నిర్ణయాల్లో ఆయన పాత్రేమీ లేకపోవడంతో సిట్ అధికారులు ఇప్పటి వరకూ నిందితుడిగా చేర్చలేదు. అయితే మంత్రిగా ఉన్నందున ఆయన ప్రమేయంపై ఎక్కడైనా ఆధారాలు లభిస్తే వెంటనే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే నారాయణ స్వామి ముందు జాగ్రత్తగా విచారణకు సహకరిస్తానని చెబుతున్నట్లుగా భావిస్తున్నారు.