Ravi Shastri Comments: భారత మాజీ కోచ్, ప్రఖ్యాత కామేంటేటర్ రవి శాస్త్రి తాజాగా ఒక షోలో అడిగిన ప్రశ్నకు జవాబుగా ఒక జాబితాను ప్రకటించాడు. ఇండియా తరపున ఆడిన ఐదుగురు గ్రేటెస్ట్ ప్లేయర్ల జాబితాలో కొందరు దిగ్గజాలకు చోటు దక్కలేదు. ఈ జాబితాలో సునీల్ గావస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీకి చోటు కల్పించాడు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దిగ్గజ క్రికెటర్లు అయిన సౌరవ్ గంగూలీ, రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లేలను ఎలా శాస్త్రి విస్మరించాడంటూ ఆయా ఆటగాళ్ల అభిమానులు కాస్త ఫైర్ అయ్యారు. వారి ఘనతలను ఏకరువు పెడుతూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. నిజానికి శాస్త్రి ప్రకటించిన జాబితాలో ఐదుగురు ఉద్ధండులే అయినా, తమ అభిమాన ప్లేయర్ కు చోటిస్తే బాగుండేనని పేర్కొంటున్నారు. ఇక ఈ ఐదుగురుని సెలెక్ట్ చేయడం వెనకాల శాస్త్రి తన ఐడియాలజీని ప్రకటించాడు.
నెంబర్ వన్ సచిన్..అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలను సాధించిన సచిన్ కు తాను నెంబర్ వన్ పొజిషన్ ఇస్తానని శాస్త్రి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తోపాటు వంద సెంచరీలను సాధించడం తిరుగులేని రికార్డనిపేర్కొన్నాడు. అలాగే టెస్టులు వన్డేల్లో అత్యధిక పరుగులు, అత్యధిక అర్ధ సెంచరీలు, అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఘనత ఇలా చాలా రికార్డులు సచిన్ పేరిట ఉన్నాయి. అలాగే తను ఆడిన కాలంలో ఎందరో మేటి బౌలర్లను తను ఎదుర్కొన్నాడని గుర్తు చేశాడు. ఆ తర్వాత స్థానంలో వివిధ ఆటగాళ్లను పేర్కొన్నాడు. అందులో సునీల్ గావస్కర్.. ఇండియా తరపున లెజెండరీ పొజిషన్ ను అందుకున్న తొలి ప్లేయరని గుర్తు చేశాడు. టెస్టుల్లో పదివేల పరుగుల రన్స్ క్లబ్ ని స్థాపించింది గావస్కర్ అని తెలిపాడు. అలాగే 1983 వన్డే ప్రపంచకప్ సాధించిన భారత జట్టులో తను సభ్యుడని గుర్తు చేశాడు.
హేమాహేమీలు..ఇక మిగతా ముగ్గురిలో ఎవరి ప్రత్యేకత వారికే నిలుస్తుంది. ముఖ్యంగా కపిల్ దేవ్ సారథ్యంలో వన్డే ప్రపంచకప్ ను భారత్ తొలిసారిగా సాధించింది. మేటి ఆల్ రౌండర్ గా తనను ఇప్పటివరకు పరగిణిస్తారు. ఇక కోహ్లీ విషయానికొస్తే సచిన్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆటగాడు కోహ్లీనే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఛేజ్ మాస్టర్ గా తను గుర్తింపు పొందాడు. అలాగే సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. అంతర్జాతీయంగా ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్నాడు. మరోవైపు ఎంఎస్ ధోనీ కెప్టెన్ గా ఉన్న కాలంలో భారత్ కు స్వర్ణయుగం అనడంలో ఎలాంటి సందేహం లేదు. మూడు ఐసీసీ టైటిల్స్ ని సాధించిన ఏకైక భారత కెప్టెన్ గా తను రికార్డులకెక్కాడు. హెలికాప్టర్ లాంటి షాట్లతో క్రికెట్ ను మరింత ఉత్తేజితం చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏదేమైనా శాస్త్రి తాజా జాబితాలో భారత అభిమానుల్లో కొత్త చర్చ నడుస్తోంది.