Sharing Salary Information: వేతనాల వివరాలను సహోద్యోగులతో పంచుకోవడానికి భారతీయులు ఇష్టడటం లేదు. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో మాత్రమే జీతం గురించి చర్చిస్తారట. ఆఫీస్‌లో నమ్మకంగా అనిపించే వారితో సాలరీ డీటెయిల్స్‌ పంచుకోవడం ఇష్టమేనని ప్రస్తుత తరం ఉద్యోగులు చెప్పారని లింక్‌డ్‌ ఇన్‌ వర్క్‌ ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌లో వెల్లడైంది. మొత్తం 4,684 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. పది ఒక్కరు మాత్రమే సొంత కంపెనీ ఉద్యోగులు (13%), ఇతర కంపెనీల్లోని ఉద్యోగులను (9%) విశ్వసిస్తామని వెల్లడించారు.


భారత వర్క్ ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ సూచీ కాస్త తగ్గిందని లింక్‌డ్‌ ఇన్‌ తెలిపింది. జులైలో +55 శాతం ఉండగా సెప్టెంబర్‌లో +52కు తగ్గిందని పేర్కొంది. ఉద్యోగాలు, డబ్బులు, కెరీర్ వృద్ధిలో అంతర్జాతీయంగా ఒడుదొడుకులు ఉండటమే ఇందుకు కారణమని వెల్లడించింది. భారత్‌లో మాత్రం పది మందిలో ఏడుగురు కెరీర్‌ (74%), అనుభవం, విద్య (71%), ఆదాయ వృద్ధి (68%)లో తర్వాతి స్థాయికి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారని తెలిపింది.


కుటుంబ సభ్యులతో వేతనాల వివరాలను పంచుకొనేందుకు 61 శాతం మంది ప్రొఫెషనల్స్‌ సౌకర్యంగా ఫీలవుతున్నారు. తమ మిత్రులతో చెప్పేందుకు 25 శాతం సుముఖత వ్యక్తం చేస్తున్నారు. పెద్ద వయస్కులతో పోలిస్తే యువత తమ జీతభత్యాల గురించి కుటుంబం, స్నేహితులతో పంచుకొనేందుకు ఇష్టపడుతున్నారు. 72 శాతం జెన్‌ జడ్‌, 64 శాతం మంది మిలీనియల్స్‌ తమ జీతం గురించి చెప్పేందుకు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. 43 శాతం మంది జెన్‌ జడ్, 30 శాతం మంది మిలీనియల్స్‌ క్లోజ్‌ ఫ్రెండ్స్‌తో చెప్పుకుంటామని వెల్లడించారు. జెడ్‌ జన్‌లో 23 శాతం, మిలీనియల్స్‌లో 16 శాతం, జెన్‌ ఎక్స్‌లో 10 శాతం మంది సహ ఉద్యోగులతో పంచుకొనేందుకు ఆసక్తిగా ఉన్నారు.


'పని చేసే చోట తమ జీత భత్యాల వివరాలు చర్చించుకొనేందుకు ఇప్పటికీ ఉద్యోగులు ఇష్టపడటం లేదు. తరాలు మారే కొద్దీ మార్పు కనిపిస్తోందని లింక్‌డ్‌ ఇన్‌ వర్క్‌ఫోర్స్‌ కాన్ఫిడెన్స్‌ ఇండెక్స్‌ డేటా వెల్లడిస్తోంది. వేతనాల వివరాలను కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పంచుకొనేందుకే ఇష్టపడటం లేదు. ప్రస్తుత తరం ఉద్యోగులు మాత్రం తమ సహచరులతో చర్చించేందుకు సందేహించడం లేదు. ఇతర వయస్కులతో పోలిస్తే జెడ్‌ జన్‌ ప్రొఫెషనల్స్‌ సౌకర్యంగా ఫీలవుతున్నారు' అని లింక్‌డ్‌ ఇన్‌ న్యూస్‌ ఇండియా మేనేజర్‌ నీరాజితా బెనర్జీ అంటున్నారు.